ETV Bharat / state

డబ్బు కొట్టు అనుమతి పట్టు.. ఆసుపత్రిని బట్టి కొనసాగుతున్న వసూళ్ల పర్వం

author img

By

Published : May 3, 2022, 5:04 AM IST

Corruption in the health sector: 20 పడకల్లోపు ఆసుపత్రికి అనుమతిఇవ్వాలంటే అయిదేళ్లకు రూ.3,750 చెల్లిస్తే సరిపోతుంది. 50 పడకల్లోపు ఆసుపత్రికైతే రూ.7,500.. 100 పడకల్లోపు దవాఖానాకు రూ.10,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్‌ ఆసుపత్రిలో నిర్ణీత నిబంధనల ప్రకారం వైద్యులు, సిబ్బంది, పరికరాలు, నిర్వహణ లేకపోయినా.. కొందరు అధికారులు ముడుపులు స్వీకరించి చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. వైద్యులు, నర్సుల ధ్రువపత్రాలు సరైనవో, నకిలీవో కూడా చూడకుండానే అనుమతిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

Corruption
Corruption

Corruption in the health sector: కొత్తగా ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిని ప్రారంభించాలన్నా, క్లినిక్‌ను తెరవాలన్నా.. ముందుగా ముడుపులు ముట్టజెప్పాల్సిందే! ఈ విషయంలో కొందరు వైద్యాధికారులు భారీగానే దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. చేయి తడపనిదే సంబంధిత దస్త్రం ముందుకు కదలడం లేదంటే.. వైద్యారోగ్యశాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. క్లినిక్‌ అయితే రూ.లక్ష.. 50 పడకల ఆసుపత్రికి రూ.1.50 లక్షలు.. 100 పడకలైతే రూ.2 లక్షలు.. ఇలా స్థాయిని బట్టి భారీగానే వసూళ్లకు పాల్పడుతుండడం గమనార్హం. ఈ దోపిడీ తీరును పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కిందటే ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేసింది. కానీ, అది ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఈ విషయంపై ఇటీవల కొందరు బాధితులు ఫిర్యాదు చేయడంతో వైద్యారోగ్యశాఖ తాజాగా ఈ వ్యవహారంపై దృష్టిపెట్టింది.

పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ విధానం: రాష్ట్రంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు కొత్తగా సేవలు ప్రారంభించడానికి, పునరుద్ధరణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి సులభతర వాణిజ్య విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ‘తెలంగాణ అలోపతిక్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌(టీఏఎంసీఈ)’ పరిధిలోకి వచ్చే అన్ని స్థాయుల ఆసుపత్రులకు ఈ నూతన విధానం వర్తిస్తుంది. ‘‌్ర్ర్ర.్మ్చ్ఝ‘’.్మ’ః్చ-్ణ్చ-్చ.్ణ్న‌్ర.i-’ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే అవసరమైన పత్రాలను పొందుపరచి దరఖాస్తు సమర్పించి, రుసుము చెల్లించి అనుమతులు పొందడానికి మార్గం సులభమైంది. దరఖాస్తు చేసిన 90 రోజుల్లోగా అనుమతులివ్వడంగానీ, తిరస్కరించడంగానీ.. ఏదో ఒక నిర్ణయాన్ని అధికారులు వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో జిల్లా వైద్యాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన, ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దరఖాస్తు ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లోనే ఎప్పటికప్పుడూ తెలుసుకునే వీలుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ 2020 అక్టోబరు 20న జారీచేశారు. గర్భస్థ శిశు నిర్ధారణ కేంద్రాలు, జెనెటిక్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాలు, జెనెటిక్‌ ల్యాబొరేటరీలకూ ఇదే విధానం వర్తిస్తుందని అదే తేదీన జారీచేసిన మరో ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా పారదర్శకత పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టినా.. ఏడాదిన్నరగా అమలు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పుడేం జరుగుతోంది?: రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లు, నిర్ధారణ పరీక్షల కేంద్రాలకు అనుమతులిచ్చే అధికారం జిల్లా వైద్యారోగ్య అధికారి(డీఎంహెచ్‌వో)కి ఉంటుంది. ఒక అలోపతి ఆసుపత్రి ప్రారంభించాలంటే.. దాదాపు 16 రకాల ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆసుపత్రిలో ఎంతమంది వైద్యులు, నర్సులు పనిచేస్తారో పేర్కొంటూ.. వారి అర్హత ధ్రువపత్రాలనూ జతపర్చాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్న పరికరాల జాబితా, జీవ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించిన ధ్రువపత్రాలూ ఇవ్వాలి. అధికారులు దరఖాస్తులను పరిశీలించి, తనిఖీలు నిర్వహిస్తారు. కొన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌ ఎక్స్‌టెన్షన్‌ అండ్‌ మీడియా ఆఫీసర్‌(డెమో), మరికొన్ని జిల్లాల్లో స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌.. ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సాధారణంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో లేక డీఎంహెచ్‌వో ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సి ఉండగా.. అత్యధిక జిల్లాల్లో కిందిస్థాయి అధికారులే తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వారు కోరినంతగా ముడుపులు ముట్టజెబితే.. నిర్దేశిత గడువులోగా అనుమతి పత్రం వచ్చేస్తోందని, లేదంటే నెలల తరబడి ఆరోగ్యశాఖ కార్యాలయంలోనే మగ్గుతోందనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొందనే విమర్శలున్నాయి. నిజానికి అనుమతి రుసుము తక్కువే అయినా.. అధికారులకిచ్చే ముడుపులే రూ.లక్షల్లో ఉంటున్నాయని తెలుస్తోంది.

ప్రభుత్వ అనుమతి రాగానే కొత్త చట్టం అమలు..

-డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

ఆసుపత్రులకు అనుమతి ఇవ్వడంలో కొందరు వైద్యాధికారులు తప్పుడు మార్గం అవలంబిస్తున్నట్లు మాకూ ఫిర్యాదులొస్తున్నాయి. ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నాం. ఇంకా అటువంటివి ఏమైనా ఉంటే ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వాటిని నివారించడానికి కొత్త క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్టును త్వరలో అమల్లోకి తీసుకురానున్నాం. దీని మార్గదర్శకాలను రూపొందించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కొత్త చట్టం అమలవుతుంది. ఆసుపత్రుల అనుమతులకు జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఒక కమిటీ ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ఆరోగ్యశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఉంటుంది. తద్వారా మరింత పారదర్శకంగా ఆసుపత్రుల అనుమతి విధానం ఆన్‌లైన్‌లో అమల్లోకి వస్తుంది. ఆసుపత్రుల అనుమతికి ప్రస్తుతం వసూలు చేస్తున్న రుసుములను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా కొంత నియంత్రణలోకి తేవాలని భావిస్తోంది.

-డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

ఇదీ చదవండి: రాహుల్‌ టూర్‌పై ఓయూ అధికారులకు హైకోర్టు ఆదేశం... అనుమతి లేదన్న వర్సిటీ..

సఫారీ బస్​పైకి దూసుకొచ్చిన గజరాజు.. పర్యటకులు హడల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.