తెలంగాణ

telangana

తెరాసలో పెరుగుతున్న రాజ్యసభ ఆశావహులు

By

Published : Apr 1, 2022, 5:43 AM IST

TRS On Rajya sabha Seats: తెరాసలో రాజ్యసభ సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీ ఉండగా.. కనీసం పది మంది పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లకు దక్కుతుందా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు అవకాశం లభిస్తుందా.. అండగా ఉంటున్న పారిశ్రామికవేత్తలకు వరిస్తుందా... అనే చర్చ జోరుగా సాగుతోంది. సామాజిక సమీకరణాలు, భవిష్యత్తు రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని.. అనూహ్యంగా కొన్ని పేర్లు తెరపైకి రావొచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

trs on rajya sabha
trs

TRS On Rajya sabha Seats: రాజ్యసభ స్థానాల భర్తీపై తెరాసలో చర్చ జోరందుకుంది. లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ పదవీకాలం జూన్‌లో ముగియనుంది. బండ ప్రకాష్ రాజ్యసభకు రాజీనామా చేసి శాసనమండలికి ఎన్నికయ్యారు. మూడు స్థానాలకు ఈనెల లేదా వచ్చే నెలలో ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. ఈ తరుణంలో రాజ్యసభలో అడుగు పెట్టేందుకు పలువురులో ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ను మెప్పించి ఒప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకి విధేయంగా ఉన్నామంటూ కొందరు.. కేసీఆర్​పై నమ్మకంతో ఇతర పార్టీలను వీడి తెరాసలో చేరామంటూ మరికొందరు పెద్దలసభ సీట్లను ఆశిస్తున్నారు. ఈ జాబితాలో కొందరు పారిశ్రామికవేత్తల పేర్లూ వినిపిస్తున్నాయి. గతంలో పలు సందర్భాల్లో వినిపించిన పారిశ్రామివేత్త దామోదర్ రావు, హెటిరో ఛైర్మన్ పార్థసారథి రెడ్డి పేర్లు మరోసారి ప్రచారంలోకి వచ్చాయి.

ప్రకాష్​రాజ్ పేరు..!:సామాజిక సమీకరణాలతో పాటు భవిష్యత్తు రాజకీయాలను పరిగణలోకి తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్​.. దిల్లీలో అవసరాలు, ఇతర పార్టీలతో సంబంధాలను బేరీజు వేయవచ్చని తెరాస శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. దిల్లీ అవసరాల కోణంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​కుమార్ పేరు పరిశీలించవచ్చునని పార్టీ వర్గాల అంచనా. కేసీఆర్​, కేటీఆర్​తో సన్నిహితంగా ఉంటూ.. ఇటీవల ముంబయి పర్యటనలో ప్రత్యక్షమైన సినీ నటుడు ప్రకాష్​రాజ్ పేరు సైతం కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత పేరును అవసరమైతే పరిశీలించవచ్చునని కొందరి అంచనా వేస్తున్నారు.

ప్రచారానికి భిన్నంగా..:చాలాకాలంగా పదవులకు దూరమైన సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కొందరు విశ్రాంత అధికారులను పేర్లూ పరిశీలించవచ్చునని తెలుస్తోంది. తెరాసలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి వంటి నేతలూ రాజ్యసభ సీట్లు ఆశిస్తున్నట్లు సమాచారం. పదవుల భర్తీలో ప్రతీసారి అంచనాలకు అందని విధంగా అనూహ్యమైన నిర్ణయాలు ప్రకటించే కేసీఆర్​.. రాజ్యసభ టికెట్లలోనూ ప్రచారానికి భిన్నంగా వ్యవహరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పార్టీలో సీనియర్ నేతలు చెబుతున్నారు.

ఇదీచూడండి:వీడ్కోలు వేదికపై పాటలతో అలరించిన రాజ్యసభ ఎంపీలు

ABOUT THE AUTHOR

...view details