తెలంగాణ

telangana

PM Modi Tweet: 'హైదరాబాద్​లో పర్యటించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా..'

By

Published : Feb 4, 2022, 10:52 AM IST

Updated : Feb 5, 2022, 11:31 AM IST

PM Modi Hyderabad Tour : నేడు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్​లో పర్యటించనున్నారు. ఈ మేరకు మోదీ.. ట్వీట్​ చేశారు. ఇక్రిశాట్​ స్వర్ణోత్సవాలతో పాటు.. రామానుజాచార్య సహస్తాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

PM Modi Hyderabad Tour
PM Modi Hyderabad Tour

PM Modi Hyderabad Tour : ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు. ఆయన పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజాచార్య విరాట్‌ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు.

పర్యటనపై మోదీ ట్వీట్​..

ఇవాళ్టి హైదరాబాద్‌ పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటున్నట్లు తెలిపిన ప్రధాని... వ్యవసాయం, ఆవిష్కరణల్లో ఇక్రిశాట్‌ ప్రధాన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు రామానుజ విగ్రహావిష్కరణలో పాల్గొననున్నట్లు మోదీ తెలిపారు. రామానుజాచార్యులకు ఇది సముచితమైన నివాళిగా పేర్కొన్న మోదీ.. ఆయన పవిత్రమైన ఆలోచనలు, బోధనలు మనకు స్ఫూర్తినిస్తాయని ట్వీట్​లో పేర్కొన్నారు.

పర్యటన సాగనుందిలా..

తొలుత శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధానికి సీఎం స్వాగతం పలుకుతారు. ఆయన వెంట హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు, అనంతరం ముచ్చింతల్‌కు వస్తారు. ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతో పాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ ముఖ్యమంత్రి మోదీ వెంటే ఉంటారు. ప్రొటోకాల్‌ ప్రకారం ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనలో గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రులు తోమర్‌, కిషన్‌రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొంటారు. సమతా స్ఫూర్తి కేంద్రంలో ప్రధాని సుమారు మూడు గంటల సేపు పర్యటిస్తారు. ఈ సందర్భంగా కేంద్రం విశిష్టతలను చిన జీయర్‌ స్వామి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించనున్నారు. రామానుజాచార్య విగ్రహం, యాగశాలలను ప్రధాని హెలికాప్టర్‌ ద్వారా విహంగ వీక్షణం చేసేలా ఏర్పాట్లు చేశారు.

8వేల మంది పోలీసులతో భద్రత..

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపధ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 8వేల మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపడుతున్నారు. ముచ్చింతల్​లోని శ్రీరామనగరంలో అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. అత్యాధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని భద్రతా చర్యలను పర్యవేక్షించే ఎస్పీజీ అధికారులు.. ఇప్పటికే రాష్ట్ర పోలీసులతో పలుసార్లు సమీక్షించారు. శ్రీరామనగరంలో కార్యక్రమం ముగిశాక శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ.. రహదారి మీదుగా చేరుకుంటారు. ఇటీవల పంజాబ్​లో ప్రధాని కాన్వాయ్​ను అడ్డుకున్న ఘటన దృష్ట్యా.. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోదీ వెళ్లే సమయంలో ఆ రహదారి మీదుగా ఇతర వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. ప్రధాని కార్యక్రమంపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. డీజీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు.

Security Tightens in Hyderabad : ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను.. వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సీఎస్​, డీజీపీ పరిశీలించారు. ఇవాళ ప్రధాని, ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా 8 వేలమందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఇక్రిశాట్, ముచ్చింతల్, శంషాబాద్ విమానాశ్రయం వద్ద పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏ ఆటంకాలు లేకుండా ప్రముఖుల పర్యటనకు ప్రణాళిక చేసినట్లు చెప్పారు. ఒకే చోట నుంచి భద్రత పర్యవేక్షణకు కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వివరించారు.

ప్రధాని మోదీ హైదరాబాద్​ పర్యటన ఇలా సాగనుంది

  • మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు
  • అక్కడి నుంచి హెలికాప్టర్​లో ఇక్రిశాట్​కు వెళ్లి.. స్వర్ణోత్సవంలో పాల్గొంటారు
  • సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్​లో ముచ్చింతల్​లోని శ్రీరామనగరానికి వెళ్తారు
  • అతిథి గృహంలో 10 నిమిషాలు రీప్రెష్ అయి యాగశాలకు చేరుకుంటారు
  • యాగశాలలో సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్లను దర్శించుకొని విశ్వక్ సేనుడి పూజ చేస్తారు
  • సాయంత్రం 7 గంటలకు సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు
  • సమతామూర్తి విగ్రహం వద్ద సుమారు అరగంట పాటు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు
  • మోదీ సమక్షంలోనే రామానుజచార్యుల విగ్రహంపై 15 నిమిషాలపాటు 3డీ లైటింగ్ ప్రదర్శన ఉంటుంది
  • అనంతరం.. మరోసారి యాగశాలకు చేరుకుని ఆరోజు నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ యాగానికి పూర్ణాహుతి పలుకుతారు
  • 5వేల మంది రుత్వికులు ప్రధాని మోదీకి వేద అశీర్వచనం ఇస్తారు
  • ఆ తర్వాత రహదారి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వెళ్తారు
  • అక్కణ్నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకుంటారు

ఇదీ చదవండి :హైదరాబాద్ పర్యటనలో పీఎం మోదీ.. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్న సీఎస్

Last Updated : Feb 5, 2022, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details