తెలంగాణ

telangana

హైదరాబాద్​లో ఒక్కసారిగా దంచికొట్టిన వాన.. తడిసిముద్దయిన నగరం..

By

Published : Aug 4, 2022, 3:10 PM IST

Updated : Aug 4, 2022, 3:28 PM IST

Hyderabad Rains: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు తడిసిముద్దయ్యారు. రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

heavy rains in several places in Hyderabad today
heavy rains in several places in Hyderabad today

హైదరాబాద్​లో ఒక్కసారిగా దంచికొట్టిన వాన.. తడిసిముద్దయిన నగరం..

Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, అల్విన్‌కాలనీ, కేపీహెచ్‌బీ, కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, షేక్‌పేట, లక్డికాపూల్‌, హిమాయత్​నగర్​, నారాయణ గూడ, లిబర్టీ, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, సైదాబాద్‌, శంషాబాద్, సాతంరాయి, గగన్‌పహాడ్, తొండుపల్లిలో వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్​పూర్, బండ్లగూడ జాగిర్​, గండిపేట్, మణికొండ, పుప్పల్​గూడా, ఆరాంఘర్​ ప్రాంతాలలోనూ వర్షం కురిసింది.

యూసుఫ్​గూడా ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురియటంతో.. రహదారులన్ని జలమయమయ్యాయి. శ్రీకృష్ణనగర్- బి బ్లాక్ కమ్యూనిటీ హాల్ వీధి, సింధు టిఫిన్ సెంటర్ వీధిలో వరద నీరు పొంగుతోంది. రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలు వాన నీటిలో మునిగిపోయాయి. మోకాళ్ల వరకు వరద వస్తుండటంతో.. స్థానికులతో పాటు వాహనాదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతవరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కురియటంతో నగరవాసులు తడిసిముద్దయ్యారు. రహదారులపై వర్షం నీరు పొంగటంతో.. వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మరోవైపు.. రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రేపు, ఎల్లుండి 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు తెలిపారు.

ఇవీ చూడండి:

Last Updated : Aug 4, 2022, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details