తెలంగాణ

telangana

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు..

By

Published : Sep 25, 2022, 8:07 PM IST

Bathukamma celebrations

Bathukamma celebrations: రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు తొలిరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఊరూవాడా ఉయ్యాల పాటలు మారుమోగాయి. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో.. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చిన్నాపెద్ద సంతోషంగా ఆడిపాడారు.

Bathukamma celebrations: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పెత్రమాసం తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు మొదలయ్యాయి. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ శోభ ఉట్టిపడింది. ఊరువాడా.. రంగు రంగుల పూలను ఒద్దికగా పేర్చి.. రాగయుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. చౌరస్తాలన్ని బతుకమ్మలతో మురిసిపోయాయి.

తీరొక్క పూలతో తీరుగా పేర్చిన బతుకమ్మలన్ని నేలతల్లిని సింగారించాయా అన్నట్టు.. మైమరిపించాయి. రహదారులన్ని కోలాహలంగా మారాయి. ఉయ్యాల పాటలు.. గాజుల చేతుల చప్పట్లతో వీధులన్ని మారుమోగాయి. రంగురంగు పూలతో బతుకమ్మలు... ఆడపడుచుల ఆటపాటలు... సంప్రదాయ నృత్యాలతో పట్టణాలు, గ్రామాలు హోరెత్తాయి.

బతుకమ్మ వేడుకల్లో గవర్నర్‌..రాజ్‌భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై, ఆమె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మ సంబురాల్లో ఆడిపాడారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో..ఉమ్మడి వరంగల్‌లో జిల్లాల్లోని ఊరువాడా బతుకమ్మ సంబురాలతో మురిసిపోయింది. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయం తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో పూలవనంలా మారింది. వేలాదిగా తరలివచ్చిన మహిళలతో సందడిగా మారింది. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ హొరెత్తించారు.

మెదక్ జిల్లాలో..బతుకమ్మ సంబరాలు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనూ ఘనంగా జరిగాయి. బతుకమ్మలను అందంగా పేర్చి కోదండ రామాలయం బాలాజీ మందిరంతో పాటు వివిధ కూడళ్లు, కాలనీల వద్ద బతుకమ్మ ఆడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ బతుకమ్మ ఆటపాటలు మారుమోగాయి. ఖమ్మంలో జరిగిన వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. చిన్నాపెద్ద అంతా ఒక్కచోట చేరి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మహిళలు ఘనంగా జరుపుకున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో..ఉమ్మడి కరీంనగర్ జిల్లా బతుకమ్మ సంబురాలతో మురిసిపోయింది. హుజూరాబాద్‌లో ఎంగిల పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల మహిళలు సంతోషంగా బతుకమ్మ ఆడారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోనూ ఊరువాడా ఉయ్యాల పాటలు మారుమోగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబురాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో..ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ తొలిరోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా బతుకమ్మ సంబరాల్లో ఆడి పాడారు.

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details