తెలంగాణ

telangana

Chalo Raj Bhavan: నేడు కాంగ్రెస్ 'చలో రాజ్​భవన్'.. అప్రమత్తమైన పోలీస్​ శాఖ

By

Published : Jul 16, 2021, 5:13 AM IST

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ చలో రాజ్​భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 200మందితో ఇందిరాపార్క్ వద్ద సమావేశం నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. ఇందిరాపార్క్ నుంచి రాజ్​భవన్ వరకు ప్రదర్శనగా వచ్చి గవర్నర్​ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇందిరాపార్కు తోపాటు రాజ్​భవన్​కు వచ్చే మార్గంలో పలు చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చలో రాజ్​భవన్ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉండడంతో అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

Chalo Raj Bhavan
Chalo Raj Bhavan

కాంగ్రెస్‌ పార్టీ చలో రాజ్‌భవన్​కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేఖంగా ఇందిరా పార్కు నుంచి చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని నేడు చేపట్టనుంది టీపీసీసీ. ఇందుకోసం పోలీసులను అనుమతి కోరగా ఇందిరా పార్కు వద్ద 200 మంది సమావేశం కావడానికి నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చారు. ఇందిరాపార్క్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీగా వచ్చి గవర్నర్‌ను కలిసి వినతి ఇచ్చేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో చలో రాజ్​భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలునిచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... అడ్డుకుంటే పోలీసు స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో పోలీస్ శాఖ మరింత అప్రమత్తమైంది.

డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల వల్ల ఈరోజు అత్యంత పేదవాడి నుంచి సంపన్నుల వరకు పన్నులు చెల్లించాల్సి వస్తోంది. కరోనా సమయంలో ప్రజలు బతకడానికే కష్టమవుతున్న సందర్భంలో కూడా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం మాత్రం మానేయలేదు. హైదరాబాద్​లో పెట్రోల్ ధర 105 రూపాయలు ఉంటే... వాస్తవంగా పెట్రోల్ ధర రవాణా ఛార్జీలు, డీలర్ల కమీషన్లతో సహా అన్ని కలిపితే 40 రూపాయలు మాత్రమే. 40 రూపాయల ఇంధనాన్ని 65 రూపాయలు అదనంగా కలిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల వద్ద నుంచి దోచుకుంటున్నాయి. 32 రూపాయలు కేసీఆర్ దోచుకుంటే... 33 రూపాయలు నరేంద్ర మోదీ దోచుకుంటున్నారు. చారణా కోడికి బారణా మసాలా. అసలు కంటే మిత్తి ఎక్కువున్నది. ప్రజలను ఇలా పట్టిపీడిస్తుంటే మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ ప్రభుత్వాల మెడలు వంచాలంటే పేద ప్రజల తరఫున పోరాటం చేస్తాం. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లో సైకిల్ యాత్రలు, ఎడ్ల బండి యాత్రలు చేసినం. రేపు చలో రాజ్​భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నం. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ నుంచి రాజ్​భవన్​ వరకు నిరసన తెలపడానికి కార్యక్రమం తీసుకున్నమో... పేదలు, అన్ని వర్గాల ప్రజలు, పార్టీలకతీతంగా ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ల దోపిడీని ప్రశ్నించినపుడల్లా... మా మీద అక్రమ కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, మా కార్యకర్తలను నిర్భందించడం ఇలాంటి కార్యక్రమాలు ఎపుడు చేస్తనే ఉంటరు. ఇదే విధంగా ప్రభుత్వాలు బరితెగించి చేస్తే ఈసారి చలో రాజ్​భవన్ కాదు పోలీస్​స్టేషన్ల ముట్టడే పెడ్తం. ఎంతమందిని కార్యకర్తలను, ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేసి ఏ జైళ్ల పెడ్తరో నేనూ చూస్త. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఊరుకునే సమస్యనే లేదు.

-- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఉల్లంఘనలకు పాల్పడే అవకాశం!

నిబంధనలతో కూడిన అనుమతికి లోబడి కార్యక్రమాన్ని నిర్వహించకుండా ఉల్లంఘనలకు పాల్పడే అవకాశం ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. పెద్ద సంఖ్యలో మోహరించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు నిబంధనలకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాలున్నాయని భావిస్తున్న పోలీసులు ఇందిరా పార్క్ నుంచి రాజ్​భవన్ వరకు పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం ర్యాలీ నిర్వహించడానికి అవకాశం లేకుండా అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించనున్నారు.

ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు..

అదేవిధంగా లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ గుడి, ట్యాంక్​ బండ్, లుంబినీ పార్క్, ఖైరతాబాద్ సర్కిల్, రాజ్​భవన్, పంజాగుట్ట సర్కిల్ తదితర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించకూడదని ర్యాలీగా రాజ్​భవన్​కు రాకూడదని ఒకవేళ వచ్చేందుకు ప్రయత్నించిన ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు వీలుగా పోలీస్ శాఖ అన్ని రకాల సిద్ధమైంది. వెయ్యి మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఇందిరా పార్క్ వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్న పోలీస్ శాఖ అందుకు అనుగుణంగా సంసిద్ధమైంది.

చిక్కడపల్లి, ఆబిడ్స్, పంజాగుట్ట ఏసీపీలతోపాటు సెంట్రల్ జోన్ డీసీపీ, ట్రాఫిక్ డీసీపీలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండు వందల మందితో ఇందిరా పార్క్‌ వద్ద సమావేశం అయ్యేందుకు పోలీసులు నిబంధనలతో కూడిన అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

ఇవీ చూడండి:కాంగ్రెస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కమల్​నాథ్​!

ABOUT THE AUTHOR

...view details