తెలంగాణ

telangana

Omkaram temple: ఆ ఆలయానికి వెళ్తే 13 రకాల ఉచిత భోజనం... ఎక్కడో తెలుసా..!

By

Published : Oct 17, 2021, 4:54 PM IST

ఏదైనా ఆలయానికి వెళ్తే కాస్త ప్రసాదమో లేక పండో చేతిలో పెడతారు. కానీ ఆ ఆలయానికి వెళ్తే మాత్రం పదమూడు రకాల పదార్థాలతో కడుపునిండా భోజనాన్ని వడ్డిస్తారు. అంతే కాదండోయ్​... తాంబూలం ఇచ్చి మరీ పంపుతారు. మరి ఆ ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా..? ఇదిగో ఇది చదవండి.

Omkaram temple
Omkaram temple

ఏదైనా ఆలయానికి వెళ్తే కాస్త ప్రసాదమో లేక పండో చేతిలో పెట్టడం పరిపాటి. కానీ ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా బండి ఆత్మకూరులోని ఓంకారం అనే ప్రాంతంలో ఉన్న సిద్ధేశ్వర ఆలయానికి వెళ్తే మాత్రం పదమూడు రకాల పదార్థాలతో కడుపునిండా భోజనాన్నిపెట్టి... తాంబూలం ఇచ్చి మరీ పంపుతారు. పరమేశ్వరుడితోపాటూ మహానంది, వేంకటేశ్వరస్వామి, దుర్గాదేవి కొలువై భక్తుల పూజల్ని అందుకుంటున్న ఈ ఆలయానికి ఏ సమయంలో వెళ్లినా... భోజనం చేయకుండా వెనక్కి వెళ్లరు. ఈ ఆలయం కొన్ని వందల ఏళ్ల నుంచీ ఉంటే ఈ అన్నదాన కార్యక్రమం పదిహేడేళ్లక్రితమే... ప్రారంభమైందనీ ఈ బృహత్కార్యానికి మూలకర్త కాశీనాయన యోగేననీ తెలిపారు. భక్తులే దాతలుగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

ఓంకారం అనే ప్రాంతంలో ఉన్న సిద్ధేశ్వర ఆలయం..

స్థలపురాణం..

ఇక్కడున్న శివలింగాన్ని సిద్దేశ్వరుడు అనే ముని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం సిద్ధేశ్వరుడు అనే ముని తపస్సు చేసుకునేందుకు బయలుదేరి ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఓం అనే శబ్దం వినిపించిందట. తాను తపస్సు చేసుకునేందుకు ఇదే సరైన ప్రదేశమని నిర్ణయించుకున్న ఆ ముని ఇక్కడ ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు మొదలు పెట్టాడట. అప్పటినుంచే ఈ ఆలయానికి ఓంకార సిద్ధేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఆ ముని వల్లే ఇక్కడ పంచ బుగ్గ కోనేరు వెలసిందనీ... ఆ నీటితోనే పార్వతీపరమేశ్వరులకు రోజూ అభిషేకం నిర్వహిస్తారనీ చెబుతారు. వ్యాస మహర్షి అశ్వద్ధనారాయణ స్వామి (ఆంజనేయస్వామి)ని ఇక్కడ ప్రతిష్ఠించడంతో ఈ ప్రాంతానికి ఆంజనేయుడు క్షేత్రపాలకుడుగా వ్యవహరిస్తున్నాడు. కొన్నాళ్లకు వేంకటేశ్వరస్వామి, దుర్గాదేవి ఆలయాలనూ ఇక్కడ నిర్మించారు. ఇక, ఇక్కడ అన్నదానం ప్రారంభించడానికి కాశీనాయన అనే యోగి కారణమని అంటారు. నెల్లూరు జిల్లా బెడుసుపల్లిలో జన్మించిన కశిరెడ్డి మొదటినుంచీ ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు. కొన్నాళ్లకు ఓ స్వామీజీ వద్ద మంత్రదీక్ష తీసుకుని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ చివరకు 1933లో ఇక్కడకు చేరుకుని ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడనీ ప్రతీతి. కశిరెడ్డి మహిమలు తెలిసిన భక్తులు ఆ యోగిని ‘నాయనా’ అని పిలవడం మొదలుపెట్టడంతో ఆ స్వామి కాశీనాయనగా గుర్తింపు పొందాడట. ఆకలిగా ఉన్నవారికి లేదనకుండా అన్నం పెట్టాలనే సందేశాన్ని చాటిన ఈ యోగి ఇక్కడే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాడనీ... ఆయన పరమపదించాక అద్దాలమండపాన్ని కట్టి ఆ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠంచి నిత్యాన్నదానాన్ని కొనసాగిస్తున్నారనీ అంటారు. ధర్మస్థాపనకు కృష్ణభగవానుడు వీరభోగ వసంతరాయలు రూపంలో ఎప్పుడైనా రావొచ్చని కాలజ్ఞానంలో రాసి ఉందనీ... అలా వచ్చే స్వామికి నివేదించాలనే ఉద్దేశంతోనే ఇలా పదమూడు రకాల వంటకాలతో భోజనాలు సిద్ధం చేస్తుంటామనీ చెబుతారు ఆశ్రమ నిర్వాహకులు.

భక్తులే అన్నీ సమకూరుస్తారు...

కొండపైనున్న శివాలయంతోపాటూ ఇతర ఉపాలయాల్లో పూజల్ని నిర్వహించే భక్తులు ఆ తరువాత కాశీనాయన క్షేత్రానికి చేరుకుంటారు. సాధారణ రోజుల్లో రోజుకు దాదాపు 1500 మంది భోజనం చేస్తే కార్తిక మాసం, శివరాత్రి సమయాల్లో అయిదారు లక్షలమందికి అన్నసంతర్పణ జరుగుతుంది. ఈ ఆశ్రమంలో మధుమేహులకు ప్రత్యేక కౌంటరు ద్వారా కొర్ర అన్నం, రాగి లడ్డూ... వంటివి వడ్డిస్తారు. ఇరవైనాలుగ్గంటలూ ఇక్కడ పొయ్యి వెలుగుతూనే ఉంటుందనీ... ఇందుకు అవసరమైన నిత్యావసరాలను భక్తులే ఎప్పటికప్పుడు సమకూరుస్తుంటారనీ అంటారు. అర్ధరాత్రో, అపరాత్రో ఇక్కడికి వచ్చేవారు భోజనం వండుకుని తినేందుకు వీలుగా నిత్యావసరాలను ఈ ప్రాంగణంలో ఉంచుతారు. ఏటా 20 లక్షల మంది ఇక్కడ భోజనం చేస్తారని చెబుతారు.

ఎలా చేరుకోవచ్చు..

ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆత్మకూరు హైవేపక్కన ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి బస్సులూ, ప్రైవేటు వాహనాల్లో వెళ్తే భక్తులు ఏడెనిమిది గంటల్లోనే ఆలయానికి చేరుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details