తెలంగాణ

telangana

AP Employees Strike: 'ఇదేదో ఆషామాషీ ఉద్యమం కాదు'

By

Published : Jan 24, 2022, 5:26 PM IST

Updated : Jan 24, 2022, 5:59 PM IST

Employees
Employees

17:23 January 24

ఏపీ పీఆర్సీ సాధన సమితి వ్యాఖ్యలు

AP Employees Strike: సమ్మెకు వెళ్తామని తాము ఎప్పుడూ అనుకోలేదని ఏపీ పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు. ఇవాళ తమకు చాలా బాధాకరమైన రోజు అని వాపోయారు. ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం ఉద్యోగ సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్లు పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల్లో భాగంగా తమ సమస్యలు ఆలకించామని ప్రభుత్వం చెబుతోందని.. కాని పరిష్కారానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు. తమనే కాదు.. పౌరసమాజాన్ని కూడా సర్కార్ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.

ఈనెల తమకు పాత జీతాలనే చెల్లించాలని సీఎస్‌ను గతంలో కోరామని ఏపీ పీఆర్సీ సాధన సమితి నేతలు చెప్పారు. ఐదుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీ వేసిందని విన్నామన్న నేతలు.. నిన్నటి రౌండ్‌టేబుల్‌ భేటీలో వచ్చిన అభిప్రాయం మేరకు సమ్మె నోటీసు ఇచ్చామని స్పష్టం చేశారు. ఫిట్‌మెంట్‌, అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక, హెచ్‌ఆర్‌ఏ.. అన్నింటిపై చర్చించామన్నారు. తాము చేస్తున్నది ఆషామాషీ ఉద్యమం కాదని.. 13 లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్ల ఉద్యమమని గ్రహించాలని ప్రభుత్వానికి హితవు పలికారు.

అలాగైతేనే చర్చలు..

"మేం 12 సార్లు చర్చలకు వెళ్లాం.. మాకు న్యాయం జరగలేదు. కమిటీ ద్వారా మా గాయాలకు వెన్నపూస పూస్తారా.. కారం పూస్తారో చూస్తాం. పాత జీతాలు ఇస్తేనే చర్చలకు వెళ్తాం. పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకుంటేనే చర్చలకు వెళ్తాం. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేస్తేనే చర్చలకు వెళ్తాం"

- బండి శ్రీనివాసరావు

రహస్య విషయాలు ఏముంటాయి..

సచివాలయ ఉద్యోగులు కూడా సమ్మెకు వెళ్తున్నారంటే ప్రభుత్వం ఆలోచించుకోవాలని వెంకట్రామిరెడ్డి అన్నారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికలో రహస్య విషయాలు ఏముంటాయని ప్రశ్నించారు. కమిటీ నివేదికలోని అనేక అంశాలు ఇప్పటికే తమకు వివరించారన్న ఆయన.. హెచ్‌ఆర్‌ఏలో కోత పెట్టేలా జీవోలు ఇవ్వడం దారుణమన్నారు. ఉద్యోగులకు నష్టం కలిగించే అంశాలు తీసుకునే జీవోలు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆషామాషీ ఉద్యమం కాదు..

"మా డిమాండ్లు పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు ఇచ్చారు. మా సమస్యలు విన్నామని ప్రభుత్వం చెబుతోంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇదేదో ఆషామాషీ ఉద్యమం కాదు. 13 లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్ల ఉద్యమం"

- సూర్య నారాయణ

సమ్మె నోటీసు అందజేత..

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు సమ్మె నోటీసు అందజేశారు. సీఎస్‌ సమీర్‌ శర్మ దిల్లీ పర్యటనకు వెళ్లడంతో జీఏడీ ముఖ్యకార్యదర్శికి నోటీసు అందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నుంచి పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీగా ఏర్పడినట్లు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునేవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు జారీ చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాలు తీసుకోకుండా జీవోలు జారీ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. దీనిపై నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు రచించామని.. నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. సీఎస్‌ను ఉద్దేశిస్తూ సమ్మె నోటీసును ఉద్యోగ సంఘాల నేతలు జీఏడీ ముఖ్యకార్యదర్శికి అందజేశారు.

ఇదీ చూడండి:

Last Updated : Jan 24, 2022, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details