ETV Bharat / city

AP PRC ISSUE: పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలకు మంత్రుల పిలుపు

author img

By

Published : Jan 23, 2022, 4:45 PM IST

AP PRC ISSUE: ఏపీలో పీఆర్సీ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. పీఆర్సీ సాధన సమితి నేతలను ఆ రాష్ట్ర మంత్రులు చర్చలకు ఆహ్వానించారు. అయితే వారు మాత్రం పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే వస్తామని స్పష్టం చేశారు.

PRC
PRC

AP PRC ISSUE: పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలకు ఏపీ మంత్రులు పిలుపునిచ్చారు. సంప్రదింపులకు రావాలని మంత్రులు బొత్స, పేర్ని నాని కోరారు. మరోవైపు పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘ నేతలు తేల్చి చెప్పారు.

కొత్త పీఆర్సీపై కసరత్తు..!

మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్కేళ్లతోనే జనవరి నెల జీతాలు సకాలంలో చెల్లించాలని... ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఖజానా శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆర్థికశాఖ అధికారులు మార్గదర్శకాలతో శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు ఇప్పటికే ఖజానా ఉద్యోగుల సర్వీసు అసోసియేషన్‌ తాము ఈ ప్రక్రియలో పాల్గొనబోమని ప్రభుత్వానికి తెలిపింది. ఆ సంఘం నాయకులు పి.శోభన్‌బాబు, రవికుమార్‌ ఉన్నతాధికారులకు ఈ సమాచారం ఇచ్చారు. తాజాగా పే అండ్‌ అకౌంట్సు ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.వెంకటేశ్వరరెడ్డి, పి.శివప్రసాద్‌ కూడా ఉన్నతాధికారులను కలిసి తాము పీఆర్సీ అమలు ప్రక్రియలో పాల్గొనబోమని తేల్చిచెప్పారు.

ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ రెండ్రోజుల కిందట వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఏపీ సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవో రవి సుభాష్‌, ఖజానా శాఖ డైరెక్టర్‌ మోహన్‌రావు, పే అండ్‌ అకౌంట్సు అధికారి కె.పద్మజ, జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస పూజారి, జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, సహాయ ఖజానా అధికారులు, ఉప ఖజానా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఖజానా శాఖ నిత్యం ఏమేం చేయాలనే దానిపైనా రావత్‌ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ప్రకారం...

* ఖజానా శాఖ డైరెక్టర్‌ మోహన్‌రావు డీడీలతో, ఎస్‌టీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పీఆర్సీ ఎలా అమలు చేయాలో వివరించాలి.

* అనంతరం ఖజానా శాఖ అధికారులందరూ సంబంధిత డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంట్‌ అధికారులతో సమావేశమై అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలి.

* ఖజానా శాఖ అధికారులంతా జనవరి 22కల్లా పరిశీలన కార్యక్రమం పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా అడుగు ముందుకు పడ్డ దాఖలాలు లేవు.

* రోజూ జిల్లా ఖజానా అధికారులు ఉదయం 11 గంటలకల్లా ఖజానా శాఖ డైరెక్టర్‌కు పురోగతి వివరించాలి. ఆయన మధ్యాహ్నం 12 గంటల లోపు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పురోగతి తెలియజేయాలి.

* సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవో అవసరమైన సాంకేతిక సహకారం అందించాలి. ఖజానా శాఖ అధికారులందరికీ డీడీవో వారీగా డ్యాష్‌బోర్డులో సమాచారం అందుబాటులో ఉంచాలి.

* ఖజానా అధికారులంతా ప్రభుత్వ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలి.

* జనవరి 25 కల్లా అందరు డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంటు అధికారులకు తాజా పే రోల్స్‌ అందుబాటులో ఉంచాలి. ఇంతకుముందున్న విధానం ప్రకారమే వాటిని ఖజానా అధికారులకు పే అండ్‌ అకౌంట్సు అధికారులకు వారు సమర్పించి జీతాల చెల్లింపు పూర్తిచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Employees Allotments: కేటాయింపుల తర్వాత విధుల్లో చేరకుంటే యాక్షన్ తప్పదు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.