తెలంగాణ

telangana

ట్విట్టర్​ కొత్త సీఈఓగా లిండా.. ఆమె ఎవరో తెలుసా?.. గత నెలలోనే మస్క్​తో..

By

Published : May 12, 2023, 10:19 PM IST

Updated : May 12, 2023, 10:48 PM IST

Twitter New CEO Linda : ట్విటర్‌ కొత్త సీఈవోగా లిండా యాకరినో నియమితులయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించారు. లిండా యాకరినో ప్రస్తుతం ఎన్‌బీసీ యూనివర్సల్‌ ఎగ్జిక్యూటివ్​గా పనిచేస్తున్నారు.

twitter new ceo linda
twitter new ceo linda

Twitter New CEO Linda : ట్విట్టర్​ కొత్త సీఈఓగా లిండా యాకరినో నియమితులయ్యారు. ఆ విషయాన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యాకరినోను సంతోషంగా స్వాగతిస్తున్నానని తెలిపారు. లిండా వ్యాపార కార్యకలాపాలను చూసుకుంటారని వెల్లడించారు. తాను ప్రొడక్ట్‌ డిజైన్‌, కొత్త సాంకేతికపై దృష్టి సారిస్తానని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

ఎవరీ లిండా?
ట్విట్టర్ నూతన సీఈఓగా నియమితురాలైన లిండా యాకరినో.. ప్రస్తుతం ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగం ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. గత 12 ఏళ్లుగా ఆమె ఇదే సంస్థలో పనిచేస్తున్నారు. లిండా యాకరినో గత నెలలో ఓ ఈవెంట్​లో మస్క్‌ను ఇంటర్వ్యూ కూడా చేశారు. వాణిజ్య ప్రకటనల ప్రభావం మరింత మెరుగుపరిచే అంశాలపై ఎన్​బీసీలో ఆమె పనిచేస్తున్నారు. కంపెనీ ప్రవేశపెట్టిన ప్రకటనల ఆధారిత పికాక్‌ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌లో లిండా కీలక పాత్ర వహించారు. అంతకు ముందు టర్నర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో లిండా యాకరినో 19 ఏళ్ల పాటు పనిచేశారు. యాడ్‌ సేల్స్‌ను డిజిటల్‌ రూపంలోకి మార్చడంలో లిండా కీలక పాత్ర వహించారు. పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఆమె.. లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ చదివారు.

శుక్రవారం ఉదయమే ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సీఈఓ నియామకంపై ప్రకటన చేశారు. ట్విట్టర్‌కు కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ను ఎంపిక చేసినట్లు మస్క్‌ ప్రకటించారు. ఆరు వారాల్లో నూతన సీఈఓ బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు. అయితే అప్పుడు సీఈఓ పేరును మాత్రం మస్క్ వెల్లడించలేదు. ట్విట్టర్‌లో తాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతానని వివరించారు. ఉత్పత్తి, సాఫ్ట్‌వేర్‌, సిసోప్స్‌లను పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు.

గతేడాది నవంబర్‌లోనే ట్విట్టర్‌లో తన సమయాన్ని కుదించుకుంటానని మస్క్‌ తెలిపారు. మస్క్‌ తాజా నిర్ణయంతో టెస్లా పెట్టుబడిదారుల ఆందోళన తగ్గింది. ఆ సమయాన్ని మస్క్‌.. టెస్లా కోసం కేటాయిస్తారని వారు ఆశిస్తున్నట్లు సమాచారం. ట్విటర్‌కు కొత్త సీఈఓ నిర్ణయం మస్క్‌ ప్రకటించగానే.. టెస్లా షేర్లు 2.4 శాతం పెరిగాయి. అంతకుముందు డిసెంబర్​లో ట్విట్టర్ సీఈఓగా కొనసాగాలా? లేక వైదొలగాలా? అని ప్రశ్నిస్తూ మస్క్‌ పోల్​ నిర్వహించారు. ఈ పోల్‌లో ఎక్కువ మంది యూజర్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. వారి నిర్ణయానికి అంగీకరించిన ఆయన ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన స్థానంలో వేరే వ్యక్తి వచ్చే వరకు ఆ స్థానంలో కొనసాగుతానని తెలిపారు.

Last Updated :May 12, 2023, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details