ETV Bharat / business

Tax Saving Investment Plans : ఆదాయపు పన్ను తగ్గించుకోవాలా?.. ఇలా చేస్తే ఫుల్​ రిటర్న్స్​!

author img

By

Published : May 12, 2023, 10:34 AM IST

Tax Saving Investment Plans : ఆర్థిక ప్రణాళికలో ఆదాయపు పన్ను కీలకమైన అంశం. సరైన పెట్టుబడులు పెట్టడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు వీలవుతుంది. అంతేకాకుండా అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు.

Best Tax Saving Investment Options
Best Tax Saving Investment Options

Tax Saving Investment Plans : చాలామంది ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలోనే పన్ను తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలను వెతుకుతుంటారు. సరైన పథకాలను ఎంపిక చేసుకోవడంలో చేసే పొరపాటు వల్ల మంచి రాబడిని అందుకోవడంలో విఫలం అవుతుంటారు. కేవలం పెట్టుబడుల ద్వారా మాత్రమే పన్ను ఆదా లక్ష్యాన్ని పెట్టుకోకూడదు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారు.. పన్ను ఆదా పెట్టుబడుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ పాత పన్ను విధానంలోనే కొనసాగాలి అనుకుంటే మాత్రం కొన్ని అంశాలను పరిశీలించాల్సిందే. అవేంటో తెలుకుందాం.

  • ముందుగా అందుబాటులో ఉన్న వివిధ పన్ను సెక్షన్ల గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. సెక్షన్‌ 80C కల్పించే రూ.1,50,000 పరిమితి పూర్తయ్యిందా చూసుకోవాలి. ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, వీపీఎఫ్‌, జాతీయ పొదుపు పత్రాలు, గృహరుణం అసలు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, జీవిత బీమా ప్రీమియం ఇలా అన్నీ కలిసి ఈ సెక్షన్‌ కింద ఎంత మినహాయింపు పొందారో చూసుకోండి. ఇదొక్కటే కాదు. సెక్షన్‌ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపు, సెక్షన్‌ 80CCD(1B) కింద ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి రూ.50,000 ఇలా అందుబాటులో ఉన్న మార్గాలన్నీ ఉపయోగించుకునేందుకు ప్రయత్నించవచ్చు.
  • పెట్టుబడులు అనేవి భవిష్యత్‌ భరోసాకు ఉపయోగపడేలా ఉండాలి. కేవలం పన్ను ఆదా కోసం మాత్రమే పెట్టుబడులను ఎంచుకోవడం సరికాదు. ఉదాహరణకు ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో మదుపు చేసి, పన్ను ఆదా చేసుకోవచ్చు. కానీ, ఇవి మార్కెట్‌ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. నష్టభయం ఉంటుంది. ఏమాత్రం నష్టం భరించలేని వారికి ఇవి సరిపోవు. దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఇవి పనికొస్తాయి. పన్ను ఆదా అనేది ఈ పథకాలకు వర్తించే అదనపు ప్రయోజనంగానే చూడాలి.
  • చాలామంది పన్ను చెల్లింపుదారులు స్వల్పకాలిక లక్ష్యాల కోసం పన్ను ఆదా పథకాలను ఎంపిక చేసుకుంటారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. పదవీ విరమణ, పిల్లల ఉన్నత చదువులు లాంటి దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి. పెట్టుబడులు వైవిధ్యంగా ఉండాలన్న సూత్రాన్ని మర్చిపోకుండా.. దీర్ఘకాలంలో మంచి రాబడితోపాటు, వచ్చిన రాబడికి పన్ను ప్రయోజనాలను అందించే పథకాలను ఎంపిక చేసుకోవాలి. షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, స్థిరాస్తి పెట్టుబడులు ఇందులో ఉండాలి.
  • పన్ను ప్రణాళికను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. పన్ను చట్టాలు, నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. గతేడాది ప్రణాళిక ఈసారి పనికి రాకపోవచ్చు. ఇప్పుడు కొత్త, పాత పన్నుల విధానం అమల్లో ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది ప్రయోజనమో ముందే చూసుకోవాలి. దాన్ని బట్టి, ఆప్షన్‌ ఇవ్వాలి. పూర్తి వివరాల కోసం మీ కార్యాలయంలో సంప్రదించండి.
  • మీ ఆదాయానికి సంబంధించిన పత్రాలు, బ్యాంకు నుంచి వచ్చిన వడ్డీ వివరాలు, ఫారం-16, మీ పెట్టుబడి వివరాలు అన్నీ కనీసం ఏడేళ్లపాటు దాచుకోండి. ఆదాయపు పన్ను విభాగం నుంచి అనుకోకుండా నోటీసులు వచ్చినప్పుడు ఇవన్నీ ఆధారాలుగా పనికొస్తాయి.

ఆదాయపు పన్ను భారం తగ్గించుకోవడం ఒక్కటే లక్ష్యంగా జీవిత బీమా పాలసీ లాంటివి తీసుకోవద్దు. మీ అవసరం ఏమిటన్నది చూసుకొని, సరైన మొత్తానికి పాలసీని తీసుకోవాలి. దీంతోపాటు.. మీ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఉపయోగపడే విధంగా పెట్టుబడులు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

ఇవీ చదవండి

పర్సనల్​ లోన్​ కావాలా?.. తక్కువ వడ్డీ రేటుతో రుణం ఇస్తున్న 10 బ్యాంకులు ఇవే!
అత్యవసరంగా డబ్బులు కావాలా?.. FD బ్రేక్‌ చేయకుండా లోన్​ పొందండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.