తెలంగాణ

telangana

క్రిప్టో కరెన్సీపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

By

Published : Apr 19, 2022, 12:18 PM IST

Crypto currency news: క్రిప్టో కరెన్సీ వినియోగంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఉగ్రవాద నిధులకు ఉపయోగించే ముప్ప పొంచి ఉందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఓ సెమినార్​లో మాట్లాడారు.

nirmala sitharaman
క్రిప్టో కరెన్సీపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Nirmala sitharaman on crypto: భారత్‌లో క్రిప్టో కరెన్సీ మార్కెట్‌పై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ కరెన్సీ వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోలను మనీలాండరింగ్‌, ఉగ్రవాదులకు నిధులను సమీకరించేందుకు ఉపయోగించే ముప్పు పొంచి ఉందని అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీతారామన్‌ ఓ సెమినార్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

'క్రిప్టోలతో అన్ని దేశాలకు ఉన్న అతిపెద్ద ముప్పు ఇదే. మనీలాండరింగ్‌, ఉగ్రవాదానికి ఆర్థిసాయం చేయడానికి ఈ కరెన్సీని ఉపయోగించే అవకాశాలున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి సాంకేతికతతో కూడిన నియంత్రణ అవసరమని భావిస్తున్నా. అయితే ఇది కేవలం ఏ ఒక్క దేశమో నిర్వహించడం అనేది అసాధ్యం. బోర్డు(అంతర్జాతీయ ద్రవ్యనిధి)లోని అన్ని దేశాలు సమన్వయం చేసుకోవాలి' అని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

ఈ సందర్భంగా భారత్‌లో సాంకేతిక వినియోగం గురించి కూడా కేంద్రమంత్రి ప్రస్తావించారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో భారత్‌లో సాంకేతిక వినియోగం పెరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రేటు 64శాతం ఉంటే భారత్‌లో సాంకేతిక వినియోగం రేటు 85శాతంగా ఉందన్నారు. సామాన్య ప్రజలు సైతం దీన్ని సమర్థంగా ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) సమావేశాల్లో పాల్గొనేందుకు నిర్మలా సీతారామన్ నిన్న వాషింగ్టన్‌ వెళ్లారు. ప్రపంచ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌, జీ20, ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. పర్యటనలో భాగంగా శ్రీలంక, ఇండోనేషియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాషింగ్టన్‌లో సమావేశాల అనంతరం సీతారామన్‌ శాన్‌ ఫ్రాన్సిస్కో వెళ్లి అక్కడ బిజినెస్‌ లీడర్లతో భేటీ కానున్నారు. పర్యటన ముగించుకుని ఏప్రిల్‌ 27న సీతారామన్ భారత్‌కు బయల్దేరనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇదీ చదవండి:'తెలుగు రాష్ట్రాల్లో ప్రజాకర్షక పథకాలకే భారీగా ఖర్చు.. ఇదే కొనసాగితే..'

ABOUT THE AUTHOR

...view details