ETV Bharat / business

'తెలుగు రాష్ట్రాల్లో ప్రజాకర్షక పథకాలకే భారీగా ఖర్చు.. ఇదే కొనసాగితే..'

author img

By

Published : Apr 18, 2022, 5:27 PM IST

SBI Report on States: ఉచిత పథకాలకు రాష్ట్రాలు భారీ ఖర్చు చేస్తున్నాయని ఎస్​బీఐ వెల్లడించింది. పలు రాష్ట్రాలు పన్ను ఆదాయంలో దాదాపు 63 శాతం ఉచితాలకు వెచ్చిస్తున్నట్లు తన నివేదికలో పేర్కొంది. తెలంగాణలో రెవెన్యూలో 35 శాతం ప్రజాకర్షక పథకాల కోసం వినియోగిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్​లో ఇది 5-19 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.

sbi
ఎస్​బీఐ

SBI Report on States: దేశంలోని పలు రాష్ట్రాలు ఆర్థికంగా నిలకడలేని ఉచితాలు, ప్రజాకర్షక పథకాలు ప్రకటించడం ఆందోళనకర విషయమేనని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన నివేదికలో వెల్లడించింది. ఉచిత పథకాల అమలు, రెవెన్యూ ఖర్చులను పునఃపరిశీలించకపోతే భవిష్యత్తులో ఆర్థిక విపత్తు సంభవించే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఎస్‌బీఐ రీసర్చ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందని నివేదిక తెలిపింది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు ప్రకటిస్తోన్న ఉచితాలు వాటి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయని అభిప్రాయపడింది.

  • తెలంగాణ సహా రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, బంగాల్‌, కేరళ వంటి రాష్ట్రాలు తమ ఆదాయంలో 5-19 శాతం రుణమాఫీ వంటి ఉచిత పథకాల కోసం ఖర్చు చేస్తున్నాయని తెలిపింది. పన్నుల పరంగా చూసుకుంటే.. రాష్ట్రాలకు వచ్చే పన్ను ఆదాయంలో దాదాపు 63 శాతం ఉచితాలకు వెచ్చిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో అయితే రాష్ట్ర రెవెన్యూలో 35 శాతం ప్రజాకర్షక పథకాల కోసం వినియోగిస్తున్నట్లు తెలిపింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 18 రాష్ట్రాల సగటు ద్రవ్య లోటు 50 బేసిస్‌ పాయింట్లు పెరిగి 4 శాతానికి చేరిందని వెల్లడించింది. 6 రాష్ట్రాల్లో ఏకంగా ద్రవ్యలోటు 4 శాతం దాటేసి ప్రమాదకర దిశగా ఉందని పేర్కొంది. 11 రాష్ట్రాల ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాలకు సమానంగా లేదా తక్కువగా ఉండగా.. 7 రాష్ట్రాల్లో ద్రవ్యలోటు బడ్జెట్‌ లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. బిహార్‌, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాలు బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ ద్రవ్యలోటు ఉన్నట్లు ప్రకటించాయి.

ప్రజాకర్షక పథకాలు దీర్ఘకాలంలో రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో సీనియర్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా.. అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని.. ఇలాగే కొనసాగితే శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం ఆ రాష్ట్రాల్లో తలెత్తడం తథ్యమని హెచ్చరించారు.

ఇదీ చూడండి : 'సొంత ఇల్లు లేదు.. ఫ్రెండ్స్​ దయతో..!'.. పేదరికంలో ప్రపంచ కుబేరుడు!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.