తెలంగాణ

telangana

'ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల నిబంధన.. చిన్నకార్లకు గుదిబండే'

By

Published : Jun 1, 2022, 6:52 AM IST

Airbags mandatory: ప్రయాణికులు వాహనాల్లో 6 ఎయిర్​బ్యాగులు తప్పనిసరి నిబంధన చిన్న కార్ల విపణిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఆ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి విన్నవించింది మారుతీ సుజూకీ ఇండియా. దీని వల్ల వాహన రంగంలో ఉద్యోగాలపైనా తీవ్ర ప్రభావం తప్పదని వివరించింది.

Airbags mandatory
ఎయిర్‌బ్యాగ్‌ నిబంధన

Airbags mandatory: ప్రయాణికుల వాహనాల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనను పునఃపరిశీలించాలని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ప్రభుత్వానికి విన్నవించింది. ఇప్పటికే ధరలు పెరగడంతో, చిన్న కార్ల విపణిపై ప్రతికూల ప్రభావం పడిందని.. కొత్త నిబంధన అమలు వల్ల తయారీ వ్యయాలు మరింత అధికమై, వాహన ధరలు పెంచాల్సి వస్తుంది కనుక మరింత ప్రభావం పడుతుందనే ఆందోళనను ఎంఎస్‌ఐ వ్యక్తం చేసింది. ఇందువల్ల వాహన రంగంలో ఉద్యోగాలపైనా ప్రభావం తప్పదని వివరించింది. ప్రారంభ స్థాయి కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని పేర్కొంది. గత మూడేళ్లుగా చిన్న కార్ల కొనుగోళ్లు తగ్గుతున్నాయని, తాజా మార్పుల కోసం మరింతగా చిన్న కార్ల ధరలు పెంచితే, విక్రయాలపై ప్రభావం పడుతుందని వివరించింది. ద్విచక్ర వాహనం నుంచి కారు కొనాలనుకునే వారు, మరింతకాలం వేచి చూసే పరిస్థితి ఎదురవుతుందని పేర్కొంది.

భద్రత దృష్ట్యా 8 మందిలోపు ప్రయాణించే అన్ని కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయాలని, ఈ ఏడాది ప్రారంభంలో రహదారి రవాణా మంత్రిత్వ శాఖ కార్ల తయారీదార్లకు సూచించింది. ఈ ఏడాది అక్టోబరు నుంచి ఈ ప్రతిపాదన అమలు చేయాలన్నది మంత్రిత్వ శాఖ నిర్ణయం. 2020 ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 ఉద్గార నిబంధనలతో పాటు గత కొన్నేళ్లుగా వివిధ నియంత్రణ నిబంధనలను చేరుకునేందుకు ప్రారంభ స్థాయి కార్ల ధరలు పెంచాల్సి వచ్చిందని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ తెలిపారు. ధరలు పెరుగుతున్నకొద్దీ చిన్న కార్ల విపణిపై ప్రభావం పడుతోందని, ముఖ్యంగా దేశంలోని గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేసేందుకు తయారీలో పలు మార్పులు చేపట్టాల్సి వస్తుందని, ఇందుకోసం చిన్న కార్ల కొనుగోలుదార్లు మరో రూ.20,000-25,000 భారం మోయాల్సి వస్తుందన్నారు. ఇంత భారం మోయలేక, కొనుగోళ్లను వాయిదా వేసుకునే వారు అధికమవుతారని.. ఫలితంగా వాహన రంగంలో ఉద్యోగాలపైనా ప్రతికూల ప్రభావం ఉంటుందని వివరించారు. డ్రైవర్లు, నిర్వహణ, మరమ్మతులు, విడిభాగాలు.. ఇలా అన్ని విభాగాల్లో ఉద్యోగాల కల్పన తగ్గుతుందని వివరించారు.

ఇదీ చూడండి:జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతం.. పెరిగిందా? తగ్గిందా?

ABOUT THE AUTHOR

...view details