తెలంగాణ

telangana

'భారత స్టాక్​ మార్కెట్లకు సత్తా ఉంది.. అలా చేస్తేనే మంచి లాభాలు'

By

Published : May 4, 2022, 9:57 AM IST

Stock Market Long Term Strategy: అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నా.. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు తట్టుకోగలవని అంటున్నారు యాక్సిస్​ మ్యూచువల్​ ఫండ్​ ఎండీ, సీఈఓ చంద్రేశ్​ నిగమ్​. ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని, ఇదే నిదర్శనమని తెలిపారు. మంచి సంస్థలను ఎన్నుకొని, దీర్ఘకాలిక లాభాల కోసం చూసుకోవడమే ఉత్తమమని ఆయన చెబుతున్నారు. ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రేశ్​ నిగమ్​ ఇంకా ఏమన్నారంటే..

Long-term strategy is the way to profits in Stock Market
Long-term strategy is the way to profits in Stock Market

Stock Market Long Term Strategy: 'అంతర్జాతీయంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. భారతీయ స్టాక్‌ మార్కెట్లకు వాటిని తట్టుకునే శక్తి ఉంది. చరిత్రను పరిశీలిస్తే ఎన్నో సందర్భాలు దీన్ని నిరూపించాయి. దేశీయ మార్కెట్లకు ఇప్పుడు చిన్న మదుపరులే శక్తిగా మారారు. కొత్తగా ఎంతోమంది ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. భారతీయ కంపెనీల బలాన్ని వారు అర్థం చేసుకుంటున్నారు. క్రమానుగత పెట్టుబడుల (సిప్‌) మొత్తం పెరగడమూ ఇందుకు నిదర్శనం' అని అంటున్నారు యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈఓ చంద్రేశ్‌ నిగమ్‌. ఆయనతో 'ఈనాడు' ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితిని ఎలా విశ్లేషిస్తారు.?

ఇటీవల కాలంలో మనం చూసిన అతి పెద్ద సంక్షోభం కొవిడ్‌-19. ఇది దురదృష్టకరమే అయినప్పటికీ.. ఈ కాలంలో ఎన్నో కొత్త వ్యాపారాలు పుట్టుకొచ్చాయి. పెట్టుబడులూ పెరిగాయి. చైనాకు మరో ప్రత్యామ్నాయం వంటి ఆలోచనలు, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎల్‌ఐ పథకం మన దేశ ఉత్పత్తి రంగానికి సానుకూలంగా మారింది. సంఘటిత రంగంలో ఎన్నో కంపెనీలు వృద్ధి బాట పట్టాయి. ఇవన్నీ భారతీయ ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చే అంశాలే. ఐటీ, ఆరోగ్య సంరక్షణలో వృద్ధిని ప్రత్యక్షంగా చూశాం. స్వల్పకాలిక హెచ్చుతగ్గులు ఎప్పుడూ ఉంటాయి. వాటిని పట్టించుకోవద్దు. ద్రవ్యోల్బణం నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లు ఇప్పటి నుంచే వాటికి సిద్ధం అవుతూనే ఉన్నాయి. కాబట్టి, పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు.

ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న మదుపరులు పెట్టుబడులకు దూరం అవుతున్నారా.?

నిత్యావసర ఖర్చులు పెరుగుతున్న మాట వాస్తవం. ఈ రెండేళ్ల కాలంలో కొన్ని రంగాల్లో వేతనాల పెంపు గణనీయంగా ఉంది. ఇది కొంత శాతం మందికే. వీరితోపాటు మిగతావారు ఇప్పుడు పెట్టుబడిని ఒక కచ్చితమైన అవసరంగా భావిస్తున్నారు. మ్యూచువల్‌ ఫండ్లకు సిప్‌ల ద్వారా రూ.12,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. నెలకు కొత్తగా 25 లక్షల వరకూ సిప్‌ ఖాతాలు జమ అవుతున్నాయి. సిప్‌ ద్వారా వస్తున్న పెట్టుబడులు మరో రెండు మూడేళ్లలో రెట్టింపు అయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఇవన్నీ చూస్తుంటే చిన్న మదుపరులు ఖర్చులను తగ్గించుకుంటూ పెట్టుబడులవైపు దృష్టి సారిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఖర్చులు మరింత పెరిగితే.. పెట్టుబడులు కొంత మేరకు తగ్గే ఆస్కారం లేకపోలేదు.

కొవిడ్‌-19 తర్వాత యువత ఈక్విటీ మార్కెట్లోకి అధికంగా వచ్చారు. నష్టాలు కనిపించడంతో కాస్త దూరమైనట్లు కనిపిస్తోంది. నిజమేనా.?

మార్కెట్‌ ఎప్పుడూ ఒకే దిశలో వెళ్లదు అని చాలామందికి తెలిసొచ్చింది. ఈ దశలో కొంతమందికి నష్టాలూ కనిపించాయి. సరైన అవగాహన ఉన్నవారు సూచీల గమనాన్ని అర్థం చేసుకుంటారు. చాలా ఫిన్‌టెక్‌ సంస్థలు యువతను పెట్టుబడులవైపు ప్రోత్సహించడమే కాకుండా.. వారికి అవగాహన కల్పించేందుకూ ప్రయత్నిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యూహంతో మార్కెట్లోకి అడుగుపెట్టిన వారికి ఇబ్బందేమీ ఉండదు. ఇప్పటికే నష్టం వచ్చిన వారు.. వాస్తవ పరిస్థితిని విశ్లేషించి, పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. దూరంగా వెళ్లడం వల్ల భవిష్యత్‌లో లాభాలను ఆర్జించే అవకాశాలు కోల్పోతారు.

కొత్త మదుపరులకు మీరిచ్చే సూచనలేమిటి ?

ఐపీఓల్లో మదుపు చేసి లిస్టింగ్‌ లాభాల కోసం చూస్తున్నవారే అధికంగా కనిపిస్తున్నారు. ఇది సరైన పెట్టుబడి వ్యూహం కాదు. మంచి సంస్థలు ఎంచుకోవడం, దీర్ఘకాలం కొనసాగడమే ఉత్తమం. లాభాలు స్వీకరించిన తర్వాత తిరిగి ఆ సొమ్ము పెట్టుబడి రూపంలో మార్కెట్లోకే వస్తుంది కాబట్టి, ఇది మంచి పరిణామమే. పాత కంపెనీలూ ఎప్పుడూ లాభాలను అందిస్తూనే ఉంటాయి.

మీ పెట్టుబడుల జాబితాను పెంచుకునేందుకు వచ్చే తొమ్మిది నెలల కాలాన్ని ఉపయోగించుకోండి. భారతీయ కంపెనీల వృద్ధిలో భాగస్వాములుకండి. దీర్ఘకాలంలో లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం కోసం అంతర్జాతీయంగా వినూత్న వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థల్లోనూ గ్లోబల్‌ ఫండ్లనూ పరిశీలించండి. షేర్లతో నష్టభయం అధికం కాబట్టి, మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా మదుపు చేయండి. ఏడాది రెండేళ్ల కాలాన్ని కాకుండా.. పదేళ్ల తర్వాత గురించి ఆలోచిస్తూ మీ పెట్టుబడులను కొనసాగించండి.

ఇవీ చూడండి:ఎల్‌ఐసీ ఐపీఓ నేడే ప్రారంభం.. ఈ విషయాలు తెలుసుకున్నారా?

పరాగ్​కు ఉద్వాసన తప్పదా? 'ట్విట్టర్​' ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన

ABOUT THE AUTHOR

...view details