పరాగ్​కు ఉద్వాసన తప్పదా? 'ట్విట్టర్​' ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన

author img

By

Published : May 3, 2022, 12:10 PM IST

Elon Musk

Elon Musk twitter: ట్విట్టర్​ను కొనుగోలు చేసిన ఎలాన్​ మస్క్ సంస్థలోని​ పలువురికి ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. ట్లిట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, ట్విట్టర్​ లీగల్‌ హెడ్‌ విజయ్​ గద్దెను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం యాజమాన్యంపై ఎలాన్​ మస్క్​కు ఏమాత్రం విశ్వాసం లేదని సంస్థ ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Elon Musk twitter: ట్విట్టర్​ను 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌.. కొత్త సీఈఓను ఇప్పటికే ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ను ఆయన తొలగించే అవకాశం ఉందని స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ట్విట్టర్‌ ఛైర్మన్‌ బ్రెట్‌ టేలర్‌తో ఇటీవల భేటీ అయిన మస్క్ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటార్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం యాజమాన్యంపై తనకు ఏమాత్రం విశ్వాసం లేదని మస్క్‌ తెలిపినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు.

​ twitter ceo
ట్లిట్టర్​ సీఈఓ పరాగ్ అగర్వాల్

పరిహారంపైనా అసంతృప్తి..: గత నవంబరులో జాక్‌ డోర్సే స్థానంలో సీఈఓ బాధ్యతలు స్వీకరించిన పరాగ్‌ అగర్వాల్‌.. మస్క్‌కు కంపెనీని అధికారికంగా అప్పగించే వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. కంపెనీతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఒకవేళ పరాగ్‌ను సీఈఓ బాధ్యతల నుంచి 12 నెలల్లోగా తీసివేస్తే 42 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై కూడా మస్క్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బోర్డులోని ఇతర సభ్యుల పరిహారంపైనా మస్క్‌ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా పరిహారాలు, వేతనాల్లో కోత ఉంటుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. అయితే, పరాగ్‌ స్థానంలో ఆయన ఎవరిని నియమించనున్నారనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

విజయ గద్దెకూ ఉద్వాసన?: పరాగ్‌తో పాటు ట్విట్టర్​ లీగల్‌ హెడ్‌గా ఉన్న విజయ గద్దెను సైతం మస్క్‌ తొలగిస్తారని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ తొలగిస్తే కంపెనీ ఆమెకు 12.5 మిలియన్‌ డాలర్ల పరిహారంతో పాటు షేర్లను కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో అత్యధిక వేతనం తీసుకుంటున్న వారిలో విజయ ఒకరు. అభ్యంతరకరమైన పదాలు, పోస్టులు, వాక్‌ స్వాతంత్ర్యంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సమయంలో విజయ ట్విట్టర్​ను ఓ గాడిన పెట్టేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఎన్నో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొని వినియోగదారుల హక్కుల రక్షణ కోసం కీలక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు వివాదాస్పద ట్వీట్లతో ప్రజల అసహనానికి కారణమవుతున్న వారిని వేదిక నుంచి నిషేధించేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. అలా ట్విట్టర్​ నుంచి బహిష్కరణకు గురైన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముఖ్యులు. ఇటీవల విజయ ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. కంపెనీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు సమాచారం.

vijaya gadde
ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ్ గద్దె

ఉద్యోగుల ఆందోళన..: ట్విట్టర్​ కొనుగోలు ఒప్పందం ఖరారైన దగ్గరి నుంచీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవితవ్యం ఏంటని పరాగ్‌ను ప్రశ్నిస్తూ ఉన్నారు. తమ ఉద్యోగ భద్రతపై నిలదీస్తున్నారు. అగర్వాల్ మాత్రం ఒప్పందం అధికారికంగా పూర్తయ్యే వరకు ఉద్యోగుల తొలగింపు ఉండదని హామీ ఇచ్చారు. తర్వాత కంపెనీ భవిష్యత్తు ఏంటన్నది మాత్రం తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఉద్యోగుల తొలగింపు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విట్టర్​ యూజర్లపై ఎలాంటి ప్రభావం పడనుందనే విషయాన్ని మాత్రం కొత్త యాజమాన్యం దృష్టిలో ఉంచుకుంటుందని భావిస్తున్నానన్నారు.

ఇదీ చదవండి: 'బిట్‌కాయిన్లన్నీ అమ్మినా.. 25 డాలర్లు ఇవ్వను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.