తెలంగాణ

telangana

శనివారం బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఆ పనులు ముందే పూర్తి చేసుకోవడం బెటర్!

By

Published : Nov 17, 2022, 5:27 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు నవంబర్​ 19న సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో శనివారం బ్యాంకు సేవలకు కొంతమేర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ విషయాన్ని తెలియజేశాయి.

aibea calls nationwide bank strike on november 19
బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగాల ఔట్​సోర్సింగ్​కు వ్యతిరేకంగా శనివారం సమ్మెకు పిలిపునిచ్చింది. ఈ సమ్మెతో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్​ రంగ బ్యాంకుల కార్యకలాపాలపై కొంత ప్రభావం పడనుంది. ఈ సమ్మెలో అధికారులు భాగం కానప్పటికీ బ్యాంకు డిపాజిట్​, విత్​డ్రా, చెక్కుల క్లియరెన్స్​ విషయంలో కొంత మేర ప్రభావం పడనుంది. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ & సింధ్ బ్యాంక్‌ సహా పలు బ్యాంకులు.. శనివారం సమ్మె కారణంగా సంస్థ కార్యకలాపాలు నెమ్మదిస్తాయని తమ వినియోగదారులకు తెలియజేశాయి.

కొన్ని బ్యాంకులు ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ చేయడం వల్ల కింది స్థాయిలో రిక్రూట్‌మెంట్ తగ్గడమే కాకుండా ఖాతాదారుల గోప్యత, వారి డబ్బు ప్రమాదంలో పడుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్​ వెంకటాచలం అన్నారు. కొన్ని బ్యాంకులు పారిశ్రామిక వివాదాల చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకున్నా యాజమాన్యం తమ సలహాలను పట్టించుకోలేదని, పారిశ్రామిక వివాదాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగులను బలవంతంగా బదిలీ చేశారని మండిపడ్డారు.

ఏఐబీఈఏ కొన్ని బ్యాంకులతో గతంలో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఆ నిబంధనలను ఉల్లంఘించిన కొన్ని బ్యాంకులు తమ ఉద్యోగుల భద్రతకు భంగం కలిగిస్తున్నాయని.. ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని వెంకటాచలం అన్నారు. ఈ నేపథ్యంలో.. ఆందోళన కార్యక్రమం, సమ్మెల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేయడం తప్ప తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details