తెలంగాణ

telangana

ఆధార్​లో వివరాలు మార్చుకోవాలా? ఎన్నిసార్లు అప్​డేట్ చేసుకోవచ్చో తెలుసా?

By

Published : May 17, 2023, 6:11 PM IST

aadhaar-update-limit

Aadhaar update limit : ఆధార్‌ కార్డ్​పై మీ వివరాలు తప్పుగా ఉన్నాయా? వాటిని సరి చేసుకోవాలని భావిస్తున్నారా? మరి ఎన్నిసార్లు సవరించాలనే దానిపై పరిమితులున్నాయని తెలుసా?

Aadhaar Update Limit : ఆధార్‌ కార్డ్‌ ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్పత్రుల నుంచి బ్యాంక్​లు, కళాశాలలు, రేషన్‌ దుకాణాలు.. ఇలా ప్రతి దగ్గర ఆధార్‌ అవసరం అవుతోంది. అధికారిక గుర్తింపు కార్డ్​గా దీనికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అందుకే.. ఆధార్‌పై ఉండే వివరాలు తప్పుల్లేకుండా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పొరపాటున ఏవైనా తప్పులున్నా.. వెంటనే వాటిని సరి చేయించుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

అయితే, 2019లో యూఐడీఏఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌ కార్డ్​పై ఉండే వివరాలను సవరించడంపై పరిమితి విధించింది. యూజర్ తమ పేరు, పుట్టిన తేదీతో పాటు జెండర్ వంటి వివరాలను కొన్నిసార్లు మాత్రమే మార్చడానికి వీలు ఉంటుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది.

పేరు:
Aadhaar Name Change : యూఐడీఏఐ కార్యాలయం మెమోరాండం ప్రకారం.. ఆధార్‌కార్డ్​పై పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది.
పుట్టిన తేదీ:
Aadhaar Date Of Birth Change Proof : పుట్టిన తేదీని ఆధార్​లో మార్చుకునేందుకు ఒక్కసారి మాత్రమే అనుమతి ఇస్తోంది యూఐడీఏఐ. అది కూడా ఆధార్‌ కార్డ్ తొలిసారి తీసుకున్న సమయంలో ఉన్న పుట్టిన తేదీకి మూడు సంవత్సరాలు అటూఇటూ మాత్రమే మార్చుకునే వీలు ఉంటుంది. ఆధార్‌ వివరాలు నమోదు చేసేటప్పుడు పుట్టిన తేదీకి సంబంధించి రుజువుగా ఎలాంటి పత్రాలు ఇవ్వకపోతే.. దాన్ని 'డిక్లేర్డ్‌' లేదా 'అప్రాగ్జిమేట్‌'గా పేర్కొంటారు. తర్వాత ఎప్పుడైనా ఈ వివరాలు మార్చుకోవాల్సి ధ్రువపత్రం తప్పక సమర్పించాల్సి ఉంటుంది. అయితే, డిక్లేర్డ్‌ లేదా అప్రాగ్జిమేట్‌గా నమోదై ఉన్నవారికి మాత్రం మూడేళ్లు అటూఇటూ రూల్ వర్తించదు.

  • జెండర్‌:
    Aadhaar Gender Correction : జెండర్‌ వివరాలు ఆధార్‌ కార్డ్​లో ఒక్కసారి మాత్రమే మార్చుకోవడానికి వీలు ఉంటుంది.
  • ఫొటో:
    Aadhaar Photo Update : ఆధార్‌ కార్డ్‌పై ఉండే ఫొటోను సవరించుకోవడంపై మాత్రం ఎలాంటి పరిమితి లేదు. దగ్గర్లో ఉన్న ఏదైనా ఆధార్‌ సెంటర్​కు వెళ్లి లేటెస్ట్​ ఫొటోను అప్​డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో మార్చడం సాధ్యం కాదు.
  • చిరునామా:
    Aadhaar Address Update : అడ్రస్‌ను మార్చుకోవడంపై కూడా యూఐడీఏఐ ఎలాంటి పరిమితి విధించలేదు. అయితే, చిరునామాను ధ్రువీకరిస్తూ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

పరిమితికి మించి చేయాలంటే..
Aadhaar Update Limit Cross: పేరు, పుట్టిన తేదీ, జెండర్‌ వివరాలు కొన్నిసార్లు మాత్రమే మార్చుకునే వీలు ఉంటుంది. ఒకవేళ లిమిట్ దాటిన తర్వాత ఆధార్​లో ఈ మార్పులు చేయాల్సిన అవసరం వస్తే మాత్రం ప్రత్యేక పద్ధతిని పాటించాలి. ఆధార్‌ కార్డ్‌హోల్డర్‌ దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లాలి. లిమిట్​కు మించి సవరణలు చేస్తున్న నేపథ్యంలో అప్‌డేట్‌ను స్వీకరించాలని కోరుతూ ప్రత్యేకంగా పోస్ట్‌/ మెయిల్‌ ద్వారా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకు మార్చాల్సి వస్తుందో స్పష్టంగా వివరించాలి. ఇందుకోసం ఆధార్‌ వివరాలు, సంబంధిత డాక్యుమెంట్లు, యూఆర్‌ఎన్‌ స్లిప్‌ను జత చేయాలి. help@uidai.gov.in మెయిల్‌ ఐడీకి మెయిల్‌ పంపాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు ప్రత్యేకంగా కోరితేనే.. ప్రాంతీయ ఆధార్‌ కార్యాలయాన్ని సంప్రదించాలి. లేదంటే వ్యక్తిగతంగా ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.

సంబంధిత అధికారులు యూజర్లు చేసుకున్న విజ్ఞప్తిని పరిశీలిస్తారు. వివరాల్లో మార్పు సమంజసమేనని భావిస్తే.. అందుకు తగ్గట్టు మార్పులు చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. ఆధార్​లో చేయాల్సిన మార్పులకు వివరాలను సాంకేతిక డిపార్ట్​మెంట్​కు పంపుతారు. అనంతరం కొన్ని రోజుల్లో మారిన వివరాలతో కొత్త ఆధార్‌ ఇంటికి వస్తుంది.

ABOUT THE AUTHOR

...view details