తెలంగాణ

telangana

ఇన్ఫోసిస్‌ లాభంలో 13.4% వృద్ధి.. మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన సంస్థ

By

Published : Jan 12, 2023, 9:09 PM IST

Infosys Q3 Results : డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన ఇన్ఫోసిస్‌ లాభంలో 13 శాతం, ఆదాయంలో 20 శాతం వృద్ధి నమోదైంది. గురువారం మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను సంస్థ ప్రకటించింది.

13-percent-growth-in-infosys-profit-20-percent-growth-in-revenue
ఇన్ఫోసిస్‌ త్రైమాసిక ఫలితాలు

Infosys Q3 Results : ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను గురువారం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే మూడో త్రైమాసిక నికర లాభంలో 13.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ.5,809 కోట్ల లాభాన్ని నమోదు చేసినట్లు ప్రకటించిన ఆ సంస్థ.. ఈ ఏడాది రూ.6,586 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

గతేడాదితో పోలిస్తే ఇన్ఫోసిస్‌ ఏకీకృత ఆదాయం 20 శాతం వృద్ధి చెంది రూ.38,318 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇది రూ.31,867 కోట్లుగా నమోదైంది. లాభాలు, ఆదాయం రెండింట్లోనూ కంపెనీ పరిశ్రమ వర్గాల అంచనాలను అందుకోవడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది కంపెనీ ఆదాయ అంచనాలను 15- 16 శాతం నుంచి 16- 16.5 శాతానికి సవరించింది. గత త్రైమాసికంలో తమ కంపెనీ ఆదాయ వృద్ధి బలంగా నమోదైందని ఎండీ, సీఈఓ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. డిజిటల్‌ బిజినెస్‌తో పాటు కోర్‌ సర్వీసెస్‌లో గిరాకీ పెరుగుతోందని వెల్లడించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న బైబ్యాక్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటి వరకు 31.3 మిలియన్ల షేర్లను కొనుగోలు చేసినట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. అందుకోసం రూ.4,790 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది. మొత్తం రూ.9,300 కోట్ల బైబ్యాక్‌ లక్ష్యంలో ఇది 51.5 శాతం. ఇప్పటి వరకు ఒక్కో షేరును రూ.1,531 సగటు ధర వద్ద కొనుగోలు చేసినట్లు పేర్కొంది. బైబ్యాక్ గరిష్ఠ ధరను రూ. 1,850గా నిర్ణయించిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details