తెలంగాణ

telangana

వారాంతంలో భారీ నష్టాలు మిగిల్చిన కరోనా భయాలు

By

Published : Mar 6, 2020, 9:33 AM IST

Updated : Mar 6, 2020, 3:54 PM IST

stock
స్టాక్ మార్కెట్లు

15:51 March 06

భారీ నష్టాలతో ముగింపు..

వరుసగా రెండో వారాంతపు సెషన్​లో భారీ నష్టాలను నమోదు చేశాయి స్టాక్​ మార్కెట్లు. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 894 పాయింట్లు కోల్పోయి 37,577 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 279 పాయింట్లు నష్టపోయి 10,989 పాయింట్లకు చేరుకుంది.

14:51 March 06

బీఎస్​ఈలో రూ.3.85 లక్షల కోట్లు ఆవిరి

స్టాక్​ మార్కెట్లు ఉదయం భారీ స్థాయిలో నష్టపోయిన కారణంగా మదుపరులు తీవ్రంగా నష్టపోయారు. ప్రారంభ సెషన్​లో అమ్మకాల ఒత్తిడి కారణంగా 1,400 పాయింట్ల మేర​ కోల్పోయింది సెన్సెక్స్​. ఫలితంగా మదుపరులు రూ. 3,85,485 కోట్ల సంపదను కోల్పోయారు.  

ప్రస్తుతం సెన్సెక్స్​ 873 పాయింట్ల నష్టంతో 37,598 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో 10,980 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 

11:50 March 06

ఎస్​ బ్యాంక్​ షేర్లపై పరిమితులు విధించిన ఎన్​ఎస్​ఈ

ఎస్​ బ్యాంక్ షేర్లపై జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి పలు సెగ్మెంట్లలో పరిమితులు విధించింది. ఎస్​ బ్యాంక్​పై ఆర్బీఐ మారటోరియం విధించిన నేపథ్యంలో దాని షేర్లు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది ఎన్​ఎస్​ఈ. 

11:40 March 06

సెక్టార్ వారీగా నష్టాలు

అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే..

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్​ 1,207 పాయింట్లు కోల్పోయి 37,263 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 374 పాయింట్ల నష్టంతో 10,894 వద్ద కొనసాగుతోంది.  

30 షేర్​ ఇండెక్స్​, నిఫ్టీ 50లలో అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 

10:41 March 06

ప్రారంభంలోనే రూ.5 లక్షల కోట్లు ఆవిరి

దేశయమార్కెట్ల పతనం పునరావృతం అయింది. గత శుక్రవారం ఏవిధంగా మార్కెట్లు భారీగా పతనం అయ్యాయో.. అంతకంటే వేగంగా ఈ వారం కూడా పడిపోయాయి. కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తుండటం వల్ల శని, ఆదివారాల్లో ఏ భారీ పరిణామాలు చోటుచేసుకున్నా సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో తమ సంపద కోల్పోవాల్సి వస్తుందనే భయంతో మదుపరులు భారీగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా మార్కెట్​ ప్రారంభ క్షణాల్లోనే మదుపరుల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.  

10:34 March 06

భారీ నష్టాల్లో మార్కెట్లు 

దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం ప్రారంభ సెషన్​లో భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఒకానొక దశలో 1,400 పాయింట్లు కోల్పోయిన బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​.. ప్రస్తుతం 1,166 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.  

నిఫ్టీ కూడా తొలుత 400 పాయింట్లకు పైగా క్షీణించింది. ప్రస్తుతం 315 పాయింట్ల కోల్పోయి 10,953 పాయింట్ల వద్ద ట్రేడవుతుంది.  

కరోనా వైరస్​ ప్రభావంతో వృద్ధిపై భయాలు నెలకొన్న వేళ ప్రపంచ వ్యాప్తంగా స్టాక్​ మార్కెట్లు కుదేలయ్యాయి. విదేశీ మారక నిల్వల తరలింపు కూడా భారీ ప్రభావం చూపింది.  

యెస్ బ్యాంకు ప్రభావం..

ఒకప్పుడు మదుపరులకు ఎంతో ఇష్టమైన యెస్​ బ్యాంకుపై భారత రిజర్వ్ బ్యాంక్ అనూహ్య నిర్ణయం తీసుకుని మారటోరియం విధించింది. ఒక్కో ఖాతా నుంచి నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించింది. నెలకు రూ.50 వేల పరిమితి విధించింది.  

పునరుజ్జీవ ప్రణాళిక అంటూ ఏదీ లేకపోవటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. యెస్​ బ్యాంకులో వాటా కొనుగోళ్లకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ సగం దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో యెస్​ బ్యాంక్ షేరు విలువ 24.97 శాతం పడిపోయింది. ఎస్బీఐ కూడా 6 శాతం మేర నష్టపోయింది.  

భారీ నష్టాల్లోనివి..

స్టాక్​ మార్కెట్లలో అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇండస్​ఇండ్​ బ్యాంక్​, బజాజ్​ ఫినాన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ, యాక్సిస్​ బ్యాంక్ భారీ నష్టాల్లో ఉన్నాయి.  

అంతటా నష్టాలే...

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో భారీ అనిశ్చితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలో మదుపరులు భారీ అమ్మకాలకు మొగ్గుచూపారు.  

ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్​, దక్షిణ కొరియా, జపాన్​ 3 శాతం నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు కూడా గురువారం 3 శాతం మేర నష్టపోయాయి.  

10:01 March 06

భారీగా పతనమైన రూపాయి

రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. 65 పైసలు పడిపోయిన రూపాయి.. డాలరుతో పోలిస్తే 73.99కు చేరుకుంది. అంతర్జాతీయ వృద్ధి రేటుపై ఆందోళనలతో విదేశీ నిధులు తరలిపోవటం వల్ల రూపాయి పతనమైంది. 

మూలధన విపణుల్లోనుంచి విదేశీ మారక నిల్వలు తరలిపోవటం, విదేశీ సంస్థాగత మదుపరుల ఈక్విటీల అమ్మకాలు రూపాయి పతనాన్ని శాసించాయి.  

స్టాక్​ మార్కెట్లు ప్రారంభ సెషన్​లో 3 శాతం మేర నష్టపోవటమూ రూపాయిపై ప్రభావం చూపింది. కరోనా భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా నష్టపోవటం వల్ల దేశీయ మదుపరుల సెంటిమెంటు దెబ్బతిన్నది. యెస్​ బ్యాంక్​పై మారటోరియం విధించటం వల్ల స్టాక్​ మార్కెట్లపై మరింత భారం పడింది.  

డాలరు కూడా..

కరోనా వైరస్​ ప్రభావం వృద్ధిరేటుపై తప్పకుండా పడుతుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన నేపథ్యంలో డాలరు విలువ కూడా 0.25 శాతం పడిపోయింది.  

09:38 March 06

యెస్​ బ్యాంక్ షేర్ల పతనం

రిజర్వ్​ బ్యాంక్​ మారటోరియం విధించిన నేపథ్యంలో​ యెస్​ బ్యాంక్​ షేర్లు భారీగా పడిపోయాయి. షేరు విలువ 24.97 శాతం పడిపోయి రూ.27.65కు చేరింది. 

09:21 March 06

కరోనా భయాలతో భారీ నష్టాల్లో మార్కెట్లు

కరోనా భయాలు, అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 1,175 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​... 37,295 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 362 పాయింట్లు నష్టపోయి 11 వేల దిగువకు చేరింది.

Last Updated :Mar 6, 2020, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details