తెలంగాణ

telangana

టెక్ దిగ్గజాల్లో జాక్​ మాను పక్కనపెట్టిన చైనా!

By

Published : Feb 2, 2021, 1:59 PM IST

అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్​ మాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చైన టెక్​ దిగ్గజాల జాబితా నుంచి ఆయన్ను పక్కన పెట్టేశారు. చైనా అధికార వార్తా పత్రిక టెక్​ దిగ్గజాలపై ప్రచురించిన ఓ ప్రత్యేక కథనంలో ఆయన ప్రస్తావనే లేదు. అలీబాబా ప్రత్యర్థి సంస్థ అయిన టెన్సెట్ అధినేతపై మాత్రం ప్రశంసలు కురిపించింది ఆ కథనం. ఇందులో షియోమీ, హువావే వంటి సంస్థల అధినేతలు కూడా ఉండటం గమనార్హం.

Chines media Avoiding jack ma
జాక్ మాను పక్కనబెడుతున్న చైనా వార్తా సంస్థలు

చైనా విధానాలను బహిరంగంగా ఎండగట్టి.. ఇబ్బందుల్లో చిక్కుకున్నారు అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్‌ మా. ఇప్పటికే ఆయన కంపెనీలపై డ్రాగన్‌ గట్టి నిఘా పెట్టగా.. తాజాగా ఆయనను టెక్‌ దిగ్గజాల జాబితా నుంచి కూడా పక్కనబెట్టేశారు.

చైనా అధికారిక మీడియా సంస్థ షిన్జువా న్యూస్‌ ఏజెన్సీకి చెందిన షాంఘై సెక్యూరిటీ న్యూస్‌ పత్రిక మంగళవారం తమ దేశ టెక్‌ దిగ్గజాలపై ఓ కథనం ప్రచురించింది. అయితే ఇందులో జాక్‌ మా పేరు లేదు. అదే సమయంలో అలీబాబా ప్రత్యర్థి సంస్థ అయిన టెన్సెంట్‌ సీఈఓ పోనీ మా పై మాత్రం ప్రశంసలు కురిపించడం గమనార్హం. సాంకేతికతలో పోనీ మా చరిత్ర తిరగరాస్తున్నారంటూ షాంఘై సెక్యూరిటీస్‌ రాసుకొచ్చింది. జాబితాలో బీవైడీ కో. ఛైర్మన్‌ వాంగ్‌ చువాన్‌ఫు, షివోమీ సహ వ్యవస్థాపకుడు లీ జున్‌, హువావే అధినేత రెన్‌ జెంగ్‌ఫెయ్‌ తదితర దిగ్గజ వ్యాపారవేత్తల ప్రస్థావన ఉంది.

జాక్​ మాపై చైనా ఆగ్రహం ఎందుకు?

కొద్ది నెలల క్రితం ప్రభుత్వానికి సలహాలివ్వబోయి జాక్‌ మా.. చైనా పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. గతేడాది అక్టోబరు 24న చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్‌ మా ప్రసంగిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. ఇంకేముంది.. జాక్‌ మా వ్యాఖ్యలపై మండిపడ్డ డ్రాగన్‌.. ఆయనపై ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. అంతేగాక, ఆయనకు చెందిన యాంట్‌ ఫినాన్షియల్‌ ఐపీఓను అడ్డుకుంది. ఈ పరిణామాల తర్వాత నుంచి జాక్‌ మా బయటి ప్రపంచానికి చాలా రోజులు దూరమయ్యారు. దీనితో ఆయన అదృశ్యంపై అనేక అనుమానాలు తలెత్తాయి.

అయితే.. కొద్ది వారాల క్రితం జాక్ మా 'వర్చువల్‌'గా ప్రత్యక్షమై పలు అనుమానాలకు చెక్​ పెట్టారు. రూరల్‌ టీచర్స్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నట్లు ఆ దేశ మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ ప్రకటించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details