తెలంగాణ

telangana

రిలయన్స్‌ చేతికి 200 ఫ్యూచర్​ స్టోర్​లు!

By

Published : Feb 27, 2022, 5:02 AM IST

Reliance and future group: ఫ్యూచర్‌ రిటైల్‌- రిలయన్స్‌ రిటైల్‌ మధ్య కుదిరిన ఒప్పందంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకవైపు కోర్టుల్లో ఫ్యూచర్​, అమెజాన్​ ఒప్పందం నడుస్తుండగానే.. మరోవైపు ఫ్యూచర్​కు చెందిన సుమాారు 200 స్టోర్లను రిలయన్స్ తన అధీనంలోకి తెచ్చుకుంది.

Reliance takes control of around 200 Future Retail stores, offers jobs to employees
రిలయన్స్‌ చేతికి 200 ఫ్యూచర్​ స్టోర్​లు!

Reliance and future group: ఫ్యూచర్‌ రిటైల్‌- రిలయన్స్‌ రిటైల్‌ మధ్య కుదిరిన డీల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫ్యూచర్‌ రిటైల్‌ కార్యకలాపాలను చేపట్టే ప్రక్రియను రిలయన్స్‌ ప్రారంభించింది. ఆ ఉద్యోగులకు తమ గ్రూపులోకి తీసుకుంటోంది. ఫ్యూచర్‌ గ్రూప్‌ తన రిటైల్‌ వ్యాపారాన్ని రిలయన్స్‌కు విక్రయించడం సహా, అమెజాన్‌ గ్రూప్‌- ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య కుదిరిన ఒప్పందం చెల్లుబాటు విషయంలో ఈ రెండు సంస్థలు న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు, ఎన్‌సీఎల్‌టీ, దిల్లీ హైకోర్టుల పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

బిగ్‌ బజార్‌ సహా తదితర పేర్లతో ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆ స్టోర్లలో కొన్నింటి కార్యకలాపాలను రిలయన్స్‌ రిటైల్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్‌ గ్రూప్‌ పేరును తీసేసి తన బ్రాండ్‌ స్టోర్లుగా మారుస్తోంది. దీంతోపాటు ఫ్యూచర్‌ రిటైల్‌ స్టోర్‌ ఉద్యోగులకు రిలయన్స్‌ పే రోల్స్‌ వర్తింప చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలియజేశాయి. దీనిపై అటు ఫ్యూచర్‌ గ్రూప్‌, రిలయన్స్‌ గ్రూప్‌గానీ, ఇటు అమెజాన్‌ గానీ అధికారికంగా తమ స్పందనను తెలియజేయలేదు.

2020 ఆగస్టులో అప్పుల్లో ఉన్న ఫ్యూచర్‌ గ్రూప్‌ తన రిటైల్‌ వ్యాపారాన్ని రిలయన్స్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ డీల్‌ విలువ రూ.24,713 కోట్లు. దీనిపై అమెజాన్‌ అభ్యంతరం చెబుతోంది. తమ కంపెనీతో గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఫ్యూచర్‌ గ్రూప్‌ ఉల్లంఘించిందంటూ ఈ డీల్‌ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను ఆశ్రయించింది. మరోవైపు అమెజాన్‌-ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య కుదిరిన డీల్‌ను రద్దు చేస్తున్నట్లు గతేడాది డిసెంబర్‌లో కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. దీంతో ఇరు వర్గాలు ఆయా అంశాలపై న్యాయస్థానాలను ఆశ్రయించడంతో న్యాయపోరాటం కొనసాగుతోంది.

మరోవైపు రిలయన్స్‌తో డీల్‌ కుదిరన కొద్ది రోజులకే ఫ్యూచర్‌ గ్రూప్‌కు స్టోర్లకు లీజుకిచ్చిన కొందరు భూ యజమానులు రిలయన్స్‌ను ఆశ్రయించారు. ఫ్యూచర్‌ రిటైల్‌ తమకు అద్దె చెల్లించడం లేదని పేర్కొనడంతో రిలయన్స్‌ ఆయా ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఈ నేపథ్యంలోనే స్టోర్ల నిర్వహణ బాధ్యతలను రిలయన్స్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సంఖ్య ఎంతనేది పూర్తిగా తెలియరాలేదు. దాదాపు ఈ సంఖ్య 200 వరకు ఉంటుందని మరికొన్ని వర్గాలు పేర్కొన్నాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌ విలువ పడిపోకుండా ఉండిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్య చేపట్టిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌కు మొత్తం 1700 వరకు ఔట్‌లెట్స్‌ ఉన్నాయి.

ఇదీ చూడండి:

భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ఎక్కడ ఎంతంటే..?

ABOUT THE AUTHOR

...view details