తెలంగాణ

telangana

ఎన్నికల తర్వాత ధరల మోతే- వంట నూనెలు, పెట్రోల్​ పైపైకి!

By

Published : Feb 10, 2022, 7:20 AM IST

Updated : Feb 10, 2022, 9:01 AM IST

Product Price Hike: కరోనా సంక్షోభం సామాన్యుడిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇది చాలదన్నట్లు నిత్యసవర వస్తువులు సహా వివిధ ఉత్పత్తుల ధరల పెరుగుదల మరింత వేదన మిగులుస్తున్నాయి. మూడు నెలలు పెరుగుదలకు విరామిచ్చిన పెట్రోల్​ ధరలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం అమాంతం ఆకాశాన్ని అంటుతాయని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు మొబైల్​ టారిఫ్​ రేట్లు మళ్లీ పెంచనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇదే జరిగితే సామాన్యుడి జేబుకి మిగిలిదే చిల్లే!

product price hike
product price hike

Product Price Hike: కొవిడ్‌ పరిణామాల నుంచి బయట పడేందుకు సామాన్యుడు అష్టకష్టాలు పడుతుంటే, వివిధ ఉత్పత్తుల ధరలు పెరుగుతూ మరింత వేదన మిగులుస్తున్నాయి. వంటనూనెల ధరలు మరుగుతుంటే, 5 రాష్ట్రాల ఎన్నికల కోసం 3 నెలలుగా ఉపశమించిన పెట్రోల్‌-డీజిల్‌ ధరలు తదుపరి మండిపోతాయని నివేదికలు తేల్చిచెబుతున్నాయి. మొబైల్‌ టారిఫ్‌లు కూడా మళ్లీ పెరిగితే ఇంటి బడ్జెట్‌పై మరింత ఒత్తిడి తప్పదు.

లీటరుకు రూ.8-9 పెరగొచ్చు: డెలాయిట్‌

Petrol price hike: పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టింది.. ఇంకా ఏం పెంచుతాములే అని చమురు కంపెనీలు ధరల పెంపును ఆపాయనుకుంటున్నారా.. పైగా అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరుగుతున్న నేపథ్యంలో.. దాదాపు 3 నెలలుగా స్తబ్దుగా ఉన్న ధరల పెంపును 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగానే మళ్లీ ప్రారంభిస్తాయని డెలాయిట్‌ నివేదిక పేర్కొంది. వచ్చే నెలలో ఇంధన ధరల మోత మోగించే యోచనలో కంపెనీలు ఉన్నాయని, ఆ పెంపు కూడా భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తోంది. ‘రాష్ట్రాల ఎన్నికల వల్లే దేశీయంగ పెట్రో ధరలు పెంచలేదు’ అని డెలాయిట్‌ పార్ట్‌నర్‌ దేవాశిష్‌ మిశ్రా పేర్కొన్నారు. ఎన్నికలయ్యాక అంటే.. మార్చి 10 వరకు విక్రయ ధరలో ఎంతైతే లోటును భరించాయో, ఆ మొత్తం వసూలు చేసుకునేలా ధరలు పెంచే అవకాశం ఉందని తెలిపారు. లీటరుకు రూ.8-9 వరకు పెరగొచ్చని వివరించారు.
వాస్తవానికి అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు (ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌) దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచేలా సాంకేతికంగా అనుసంధానమయ్యాయి. అయితే అధిక ధరల వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో, అధికారంలోని పార్టీల అవసరాలకు అనుగుణంగా ఎన్నికల సమయాల్లో చమురు సంస్థలు ధరలను పెంచడం లేదనే విమర్శ దేశీయంగా ఉందని మిశ్రా చెప్పారు.

ఆర్‌బీఐకి సవాలే..:చమురు ధర పెరిగితే కరెంటు ఖాతా లోటు పెరగడమే కాకుండా నిత్యావసరాల ధరలూ అధికమవుతాయి. ద్రవ్యోల్బణ నియంత్రణలో ఆర్‌బీఐకి సవాళ్లు ఎదురవుతాయి. కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కీలక రేట్లను ఆర్‌బీఐ పరిమిత స్థాయిలో ఉంచుతోంది. ద్రవ్యోల్బణం పెరిగితే.. కీలక రేట్ల పెంపు దిశగా అడుగులు వేయడం ఆర్‌బీఐకి కష్టం కావచ్చు.

Oil Rate hike

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి భారత్‌ చేస్తున్న చర్యలపై ‘పెరుగుతున్న వంటనూనెల ధరలు’ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచంలోనే ఎక్కువగా వినియోగించే వంట నూనె అయిన పామాయిల్‌ ధర ఈ ఏడాది 15 శాతం పెరిగింది. సోయాబీన్‌ నూనె 12 శాతం ప్రియం కావడంతో, అంతర్జాతీయ ఆహార ద్రవ్యోల్బణాన్ని ఆల్‌టైం గరిష్ఠాల సమీపానికి చేరింది. పామాయిల్‌, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు పువ్వు నూనెలను ఎక్కువగా కొనుగోలు చేసే భారత్‌పై ఈ ధరల పెరుగుదల ఒత్తిడి తీసుకొచ్చింది. వినియోగదారు ఆహార ధరలు 6 నెలల్లోనే ఎన్నడూ లేనివిధంగా గత డిసెంబరులో పెరిగాయి. ఇందువల్ల ఇంటి బడ్జెట్‌పైనే కాదు.. 80 కోట్ల మందికి ఆహార మద్దతు ఇస్తున్న ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరిగింది. అందుకే పామాయిల్‌, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు పువ్వు నూనెలపై దిగుమతి సుంకాలను సైతం తగ్గించారు. భారీమొత్తం నిల్వలను అట్టేపెట్టిఉంచకుండా పరిమితులు విధించారు.

ఇపుడు ఏం చేయాలంటే..

వంట నూనెల విషయంలో సత్వర పరిష్కారం ఏమిటంటే పొద్దుతిరుగుడు పువ్వుల రిఫైన్డ్‌ నూనెను దిగుమతి చేసుకుని ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) ద్వారా మార్కెట్‌ ధర కంటే తక్కువకు అమ్మడమేననే సూచన వస్తోంది. మధ్య నుంచి దీర్ఘకాల ప్రణాళికల విషయానికొస్తే దిగుమతులు తగ్గించుకునేలా, దేశీయంగా నూనెగింజల సాగు పెరిగేలా చూడాలి. వంట నూనెల నిల్వలను పెంచుకోవాల్సి ఉంది. తద్వారా కొరత ఏర్పడినప్పుడు నిల్వలు విడుదల చేసి.. ధరలను అదుపులో ఉంచొచ్చని చెబుతున్నారు.

చైనా తరహాలోనే..

ధరల అదుపునకు చైనా ఇలాంటి వ్యూహాన్ని అనుసరిస్తోంది. పెద్ద ఎత్తున ముడి చమురు; వ్యూహాత్మక లోహాలు, వ్యవసాయ దిగుబడులను నిల్వ చేస్తుంది. నిల్వల పరిమాణాలను బయటపెట్టదు. అత్యవసర సమయాల్లో వాటిని విడుదల చేసి ధరలను అదుపు చేస్తుంది.

ఇప్పటికే 'నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌-పామ్‌ ఆయిల్‌' పేరిట గతేడాది 1.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11,000 కోట్ల)తో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా ముడి పామాయిల్‌ ఉత్పత్తిని రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది. 2025-26లో 1.12 మిలియన్‌ టన్నులుగా ఉండే పామాయిల్‌ ఉత్పత్తి 2029-30 కల్లా 2.8 మి. టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మొబైల్‌ టారిఫ్‌లు మళ్లీ పెరుగుతాయ్‌

Airtel Tariff Hike: ఈ ఏడాది (2022)లో టారిఫ్‌లు మరోసారి పెంచుతామని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. 3-4 నెలల్లో కాకపోయినా, ద్వితీయార్ధంలో తప్పనిసరిగా ఛార్జీలు పెంచుతామని పేర్కొంది. డిసెంబరు త్రైమాసికంలో వినియోగదారుపై సగటు ఆదాయం(ఆర్పు) రూ.163 నమోదు కాగా, 2022లో ఇది రూ.200కు చేరుతుందనే అంచనాను ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విత్తల్‌ 'ఫలితాల తరవాత' విశ్లేషణలో వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

  • నవంబరులో టారిఫ్‌లను 18-25 శాతం పెంచడంతో పాటు గూగుల్‌ పెట్టుబడుల వల్ల ఎయిర్‌టెల్‌ రాణించింది. నగదు నిల్వలున్నందునే, స్పెక్ట్రమ్‌ బకాయిల్లో కొంత చెల్లించేశాం. టారిఫ్‌ల పెంపు వల్ల బ్యాలెన్స్‌ షీట్లలో ఎంత మార్పు వచ్చిందో జనవరి-మార్చిలో పూర్తిగా వెల్లడవుతుంది. ఈ సంవత్సరంలో మళ్లీ టారిఫ్‌ల పెంపునకు ముందు ఉండటానికి వెనుకాడేది లేదు. కొత్త పథకాలు కూడా ఆవిష్కరిస్తాం.
  • స్థిరత్వం కోసం ఆర్పును తొలుత రూ.200కు చేర్చాలన్న కంపెనీ ప్రణాళిక ఈ ఏడాదిలోనే సాకారం అవుతుంది. తదుపరి అడుగు ఆర్పును రూ.300 కు చేర్చడమే.
  • 5జీ స్పెక్ట్రమ్‌ కనీస ధర తగ్గితే, మరింతమంది వినియోగించుకునేందుకు అనువుగా ఆ సేవలకు టారిఫ్‌లు నిర్ణయించొచ్చు.
  • వినియోగదారులను ఫీచర్‌ఫోన్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మార్చేందుకు పలు మార్గాలు అవలంబిస్తున్నాం. సులభ వాయిదాల్లో ఇచ్చిన ఫోన్‌కు ఈఎంఐ కట్టకపోతే, వెంటనే లాక్‌ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌ ఉంది. ఖాతాదారును బట్టి రాయితీలు, నగదు వెనక్కి వంటివీ ఇవ్వొచ్చు.
  • ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ షేరు రూ.719.90 ఉండగా, టారిఫ్‌ల పెంపు/ఆర్పు రాణింపుపై ఆశావహ పరిస్థితుల వల్ల రూ.910కి చేరవచ్చనే అంచనాను ఆర్థికసేవల సంస్థ జెఫ్రీస్‌ వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:కొవిడ్​కు కొత్త మందు- ఒక్క స్ప్రేతో వైరస్​ ఖతం!

Last Updated : Feb 10, 2022, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details