తెలంగాణ

telangana

చమురు ధరలకు రెక్కలు.. భారత్​లో మాత్రం నో ఛేంజ్​.. ఎన్నికలయ్యాక వాత!

By

Published : Jan 18, 2022, 5:57 PM IST

Petrol diesel prices: ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఆకాశన్నంటుతున్నా.. భారత్​లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క పైసా పెరగడం లేదు. 72 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న కారణంగానే ప్రభుత్వం ధరలను పెంచడం లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మార్చిలో మళ్లీ చమురు ధరలకు రెక్కలొస్తాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Petrol diesel prices
Petrol diesel prices

Petrol diesel prices: అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఎన్నడూలేని విధంగా 8 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్​ ధర 87 డాలర్లకు పెరిగింది. కానీ భారత్​లో దాని ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. మన దేశంలో చమురు ధరలు పెరిగి 72 రోజులు అయ్యింది. ధరల్లో ఎలాంటి తేడా లేదు. సాధారణంగా అంతర్జాతీయంగా ధరలు పెరిగితే.. దేశీయంగా కూడా ధరలు అమాంతం ఎగబాకుతాయి. ఇందుకు భిన్నంగా భారత్​లో స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ధరల స్థిరీకరణ కొనసాగడానికి కారణం కేవలం రానున్న అసెంబ్లీ ఎన్నికలే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పొరపాటున పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగితే ఆ ప్రభావం కచ్చితంగా ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​ లాంటి రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని అంటున్నారు.

అంతర్జాతీయంగా పెరుగుదలకు కారణాలు ఇవే..

ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని చమురు కేంద్రాలపై యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్ దాడి చేసింది. దీంతో పలు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరో వైపు ఈ దాడి కారణంగా సరఫరాకు ఆటంకం కలుగుతుందనే కారణంగా బ్రెంట్ క్రూడాయిల్​ బ్యారెల్‌కు 87.7 డాలర్లకు పెరిగింది. అంతేగాకుండా ఈ దాడితో ప్రపంచానికి చమురును అందించే అతిపెద్ద కేంద్రాలుగా ఉన్న ఇరాన్, సౌదీ అరేబియా మధ్య శత్రుత్వం మరింత పెరుగుతుందని మార్కెట్​ నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ధరలు జీవన కాల గరిష్ఠాలను తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు.

స్థిరంగా..

అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా... దేశీయ ఇంధన ధరలు ఎక్కడా పెరిగిన దాఖలాలు లేవు. దీనికి భిన్నంగా భాజపా పాలిత రాష్ట్రాలు వ్యాట్​ను తగ్గించి ధరలను మరింత కిందకు తీసుకొచ్చాయి. వాస్తవానికి అంతర్జాతీయ ధరల ప్రభావం దేశీయంగా ధరల పెంపునకు దారి తీస్తుంది. కానీ రెండు నెలలుగా స్తబ్దుగా కొనసాగుతున్నాయి.

దేశీయంగా ధరలు ఇలా..

దేశ రాజధాని దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్​ను తగ్గించిన తరువాత లీటర్ పెట్రోల్ ధర రూ.95.41గా ఉంది. డీజిల్ ధర రూ.86.67గా కొనసాగుతుంది. ఈ వ్యాట్​ను తగ్గించక ముందు(2021 అక్టోబర్​ 26) లీటర్​ పెట్రోల్ ధర రూ.110.04 వద్ద జీవన కాల గరిష్ఠానికి చేరుకుంది. మరో వైపు డీజిల్ ధర కూడా లీటర్​కు రూ. 98.42గా ఉండేది. ఆ సమయంలో బ్యారెల్​ ధర 86.40 డాలర్లు. తర్వాత క్రమంగా తగ్గి నవంబర్​ 5 నాటికి బ్యారెల్ ధర 82.74 డాలర్లకు, డిసెంబర్​ నాటికి 68.87 డాలర్లకు పతనమైంది. అనంతరం అనూహ్యంగా పుంజుకుని ఇప్పుడు 87.7 డాలర్లకు చేరుకున్నా దేశీయంగా ఎటువంటి మార్పులేదు. దీనికి కారణం.. శాసనసభ ఎన్నికలే అని చెప్తున్నారు నిపుణులు.

ఎన్నికల ముందు పెరగని చమురు ధరలు..

అంతర్జాతీయంగా ఇంధన ధరలు బ్యారెల్‌కు దాదాపు 5 డాలర్లు పెరిగినప్పటికీ.. 2018లో కర్ణాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం 19 రోజుల పాటు చమురు ధరలను పెంచలేదు. కానీ ఎన్నికలు ముగియగానే వరుసగా 16 రోజుల పాటు ధరలను పెంచాయి చమురు సంస్థలు. దీంతో పెట్రోలు ధర లీటరుకు రూ. 3.8, డీజిల్ ధర లీటరుకు రూ. 3.38 పెరిగింది. ఇదే విధంగా 2017లో గుజరాత్​ ఎన్నికల సమయంలో కూడా 14 రోజుల పాటు ధరలను ఏ మాత్రం పెంచలేదు.

గతంలో కూడా పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపుర్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన సమయంలో.. 2017 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఒక్క పైసా కూడా పెంచలేదు. ఇదే క్రమంలో 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ధరలను స్థిరంగా ఉంచిన కంపెనీలు.. తుది దశ పోలింగ్ ముగిసిన తరువాత రోజు నుంచే వడ్డన ప్రారంభించినట్లు పరిశ్రమ వర్గాల తెలిపాయి.

గతంలో కూడా ఇలా చాలా రోజుల పాటు ధరలను పెంచకుండా ఉన్నాయి చమురు సంస్థలు. కానీ 2020లో అంతర్జాతీయంగా ధరలు తగ్గిన కారణంగా లాభాలను సొమ్ము చేసుకోవడానికి ఎక్సైజ్​ సుంకాన్ని పెట్రోల్​పై రూ. 10, డీజిల్​పై రూ. 13 పెంచింది కేంద్రం. గతేడాది నవంబర్​, డిసెంబర్​లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ ఇప్పుడు పెరిగినా కూడా ధరలు పెంచకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి:రోబోలపై రిలయన్స్​ గురి.. రూ.983 కోట్ల పెట్టుబడులు

ABOUT THE AUTHOR

...view details