తెలంగాణ

telangana

కరోనా ఎఫెక్ట్​: బంగారం అమ్మేస్తున్నారు.. విమానాలకు గిరాకీ

By

Published : Mar 2, 2020, 10:56 AM IST

Updated : Mar 3, 2020, 3:24 AM IST

CORONA effect  Gold prices fall, demand for airplanes
కరోనా కతలు: బంగారం ధరలు తగ్గుముఖం.. విమానాలకు గిరాకీ..

కరోనా వైరస్‌ మనుషులపైనే కాదు.. బంగారంపైనా ప్రతాపం చూపిస్తోంది. పలు దేశాల్లో తమ దగ్గర ఉన్న పాత పసిడిని అమ్మేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఓ వైపు బంగారం ధరలు తగ్గుతుంటే.. మరో వైపు ప్రైవేటు విమానాలకు గిరాకీ అమాంతం పెరిగిపోతుంది. ప్రముఖులు అందరితో కలిసి ప్రయాణాలు చేయటం కంటే ప్రైవేటు విమానాలకే మొగ్గు చూపుతున్నారు.

కరోనా వైరస్‌ మనుషులపైనే కాదు.. బంగారంపైనా ప్రతాపం చూపిస్తోంది. పసిడి మార్కెట్లను తలకిందులు చేస్తోంది. అమెరికా, ఐరోపాల్లో కొద్ది వారాలుగా జనం తమవద్ద ఉన్న పాత బంగారాన్ని అమ్మేయడానికి ఎగబడుతున్నారు. సాధారణంగా పసిడి ధర పెరుగుతున్నప్పుడల్లా పాత బంగారం విక్రయాలు ఊపందుకుంటాయి. అయితే ఈసారి అనూహ్యంగా పెరగడం విశేషం. ఈ వారంలో ఇలాంటి విక్రయాలు 12 శాతం పెరిగినట్లు షికాగోలోని నగల వ్యాపారులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ పుట్టుకకు కేంద్రమైన చైనాలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ఆర్థికరంగం దెబ్బతినడంతో ఈ ఏడాది బంగారం ధరలు కూడా పడిపోయాయి. వైరస్‌కు భయపడి ప్రజలు వీధుల్లోకే రావడం మానేయడంతో కొనుగోళ్లు, అమ్మకాలు కూడా లేవు.

పసిడి మార్కెట్లు తల్లకిందులు

అద్దె విమానాలకు గిరాకీ..

కరోనా దెబ్బకు ప్రైవేటు విమానాలకు గిరాకీ అమాంతం పెరిగింది. ఆసియా దేశాలతో పాటు అమెరికా, బ్రిటన్‌ వంటి ప్రాంతాల్లో సంపన్నులు, కార్పొరేట్‌ కంపెనీల ప్రముఖులు ఇప్పుడు అందరితో కలిసి ప్రయాణించడం కంటే ప్రైవేటు విమానాల్లో వెళ్లడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఖర్చుకూ వెనుకాడటం లేదు. ఉదాహరణకు 12 సీట్ల ప్రైవేటు విమానం న్యూయార్క్‌ నుంచి లండన్‌కు రాకపోకలకు 1,40,000 డాలర్లు(రూ.కోటికి పైగా) ఖర్చవుతుంది. ఇదే మార్గంలో మొదటి తరగతి విమాన ఛార్జీ ఒకరికి 10,000 డాలర్లే. అయినా ప్రైవేటుకే మొగ్గుచూపుతున్నారు.

విమానాలకు గిరాకీ.

ముద్దులు వద్దు సుమా!

ఫ్రాన్స్‌తో పాటు పొరుగున ఉన్న స్విట్జర్లాండ్‌లో ఆప్యాయంగా పలకరించుకోవడానికి, శుభాకాంక్షలు తెలపడానికి అటూఇటూ చెంపలపై ఒకరికొకరు ముద్దు పెట్టుకునే అలవాటుంది. ఇకపై ఇలాంటి చుంబనాలు వద్దేవద్దంటూ ప్రజలందరికీ ప్రభుత్వాలు స్పష్టంచేశాయి. సామాజికంగా ఒకరికొకరు దూరంగా ఉండటం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించే అవకాశం ఉన్నందున ఈ ముద్దుల పద్ధతికి కొన్నాళ్లు దూరంగా ఉందామంటూ రెండు దేశాల ఆరోగ్య మంత్రులు ప్రకటనలు చేశారు.

నో ముద్దులు

కరోనాను సబ్బు కడిగేస్తుంది

కరోనా ముప్పును తగ్గించుకోవాలంటే చేతులను తరచూ శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని నిపుణులంతా చెబుతున్నారు. సబ్బుతో కడుక్కోవడం వల్ల జరిగే మేలేంటో వివరిస్తున్నారు.. అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌, శాస్త్రవేత్త కారెన్‌ ఫ్లెమింగ్‌. సబ్బుతో కడగడం అనేది కరోనాపై గొప్ప ఆయుధంగా పనిచేస్తుందని ఆమె చెబుతున్నారు. ఈ వైరస్‌ చుట్టూ కొవ్వుతో కూడిన పలుచని పొర ఉంటుంది. సబ్బు నీళ్లకు ఆ పొరను తొలగించే శక్తి ఉంటుంది. దీంతో వైరస్‌ చచ్చిపోతుంది.. అని ఆమె వివరించారు.

వైరస్​ను సబ్బు కడిగేస్తుంది

చైనాకూ ఓ మేలు

కరోనా చైనాకూ అనూహ్యంగా ఓ మేలు కూడా చేసింది. అదేమిటంటే ఇక్కడ వాయు కాలుష్యం బాగా తగ్గింది. గతేడాది ఫిబ్రవరి (10-25 తేదీల మధ్య) నాటికి.. ఈ ఏడాది అదే సమయానికి నైట్రొజన్‌ డయాక్సైడ్‌ స్థాయిలు చాలామేర తగ్గాయి. నాసా శాటిలైట్‌ చిత్రాల్లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కొవిడ్‌ అత్యంతగా ప్రబలిన హుబెయ్‌ ప్రావిన్స్‌లో కాలుష్యం మరింతగా తగ్గింది. సాధారణంగా చైనాలో కొత్త సంవత్సరం వేడుకల సమయంలో కొంతమేర వాయు కాలుష్యం తగ్గుతుంటుంది. కరోనా వల్ల అనేక పరిశ్రమలు కూడా మూతపడటంతో ఈ ఏడాది కాలుష్యం బాగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

చైనాకు మేలు

మాదక ద్రవ్యాల్లో వైరస్‌!

మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కరోనా బూచిని చూపిస్తున్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తే వాటిలో కరోనా వైరస్‌ ఉండొచ్చు.. తస్మాత్‌ జాగ్రత్త అంటూ విస్కాన్‌సిన్‌లోని మెర్రిల్‌ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో హెచ్చరించారు. ఎవరివద్దయినా మాదకద్రవ్యాలు ఉంటా నిస్సంకోచంగా తమ వద్దకు తీసుకొస్తే.. ఉచితంగా పరీక్షిస్తామని చెబుతున్నారు. ఒకవేళ రావడానికి భయపడితే.. సమాచారం అందించినా ఇంటికే వచ్చి పరీక్షిస్తామని కూడా చెబుతున్నారు.

మాదక ద్రవ్యాల్లో వైరస్‌

ఇదీ చూడండి:'మోటేరా సభ చూసిన తర్వాత ఏదీ పెద్దదిగా లేదు'

Last Updated :Mar 3, 2020, 3:24 AM IST

ABOUT THE AUTHOR

...view details