తెలంగాణ

telangana

కవరేజీ పెరిగే బీమా గురించి తెలుసా?

By

Published : Mar 18, 2021, 9:15 AM IST

భవిష్యత్తులో ఆర్థిక భరోసా కోసం టర్మ్​ పాలసీ ముఖ్యమైనదిగా భావిస్తారు. అయితే.. బీమా చేస్తున్నప్పుడు ఎంత మొత్తం కవరేజీ తీసుకోవాలన్న విషయంలో చాలా మంది సందిగ్ధంలో పడుతుంటారు. ముందు ముందు ఖర్చులు పెరిగితే బీమా సరిపోకపోవచ్చు. ఈ సమస్య లేకుండా ఉండేందుకు టర్మ్​ పాలసీలోనే ఓ అవకాశం ఉంది. అదే ఇంక్రిమెంటల్​ టర్మ్​ పాలసీ. దాని గురించి తెలుసుకుందాం.

Incremental Term Insurance Policy
కవరేజీ పెరిగే బీమా గురించి తెలుసా?

టర్మ్ పాలసీ గురించి చాలా మందికి అవగాహన ఉంది. అయితే ఇందులో బీమా మొత్తం మారదు. ఖర్చులు పెరిగి, కుటుంబం విస్తరిస్తే గతంలో చేయించిన ఈ బీమా సరిపోకపోవచ్చు. ఈ సమస్య లేకుండా ఉండేవే ఇంక్రిమెంటల్ టర్మ్​ పాలసీలు. వాటి గురించి తెలుసుకుందాం..

ఆర్థిక భద్రతలో టర్మ్ పాలసీ ముఖ్యమైనదిగా భావిస్తారు. తమపై ఆధారపడిన వారి భవిష్యత్తును సురక్షితం చేసేందుకు దీనిని కొనుగోలు చేయటం చాలా ఉత్తమమైన పని. బీమా చేయించుకున్న వ్యక్తి మరణించిన పక్షంలో.. నామినీ బీమా మొత్తాన్ని పొందుతారు.

బీమా కొనుగోలు చేస్తున్నప్పుడు ఎంత మొత్తం కవరేజీ తీసుకోవాలన్న విషయంలో చాలా మంది సందిగ్ధపడుతుంటారు. వార్షిక ఆదాయానికి 7 నుంచి 10 రెట్లు కవరేజీ తీసుకోవాలని వ్యక్తిగత ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. అయితే ఆదాయం పెరిగిన కొద్ది.. కవరేజీ పెంచుకునే ఆప్షన్ తీసుకోవాలని వారు చెబుతున్నారు.

క్రమక్రమంగా పెరుగుతుంది

ఇంక్రిమెంటల్ ఆప్షన్ ద్వారా ప్రతి సంవత్సరం బీమా కవరేజీ క్రమక్రమంగా పెరుగుతుంది. దీన్ని బట్టి ప్రీమియం మొత్తం కూడా పెరుగుతుంది. అయితే సాధారణ టర్మ్ పాలసీలో ప్రీమియం మారదు.

ఉదాహరణకు కోటి రూపాయల పాలసీ తీసుకున్నారు అనుకుందాం. కానీ ఒక పదేళ్ల తర్వాత.. ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఈ పాలసీ సరిపోకపోవచ్చు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు పెరగటం లాంటి కారణంతో కూడా ఈ పాలసీ సరైన భద్రతను అందించలేకపోవచ్చు.

అయితే ఇలాంటి సమయంలో బీమా మొత్తం పెరిగే పాలసీలు చాలా ఉపయోగపడతాయి. దీనివల్ల కుటుంబానికి ఆర్థిక భద్రత పెరుగుతుంది. అదే విధంగా ధరల పెరుగుదల ప్రభావం కూడా తగ్గుతుంది.

ఇతర అంశాలు లేకుండా కాలానుగుణంగా.. ఈ పాలసీల వల్ల జీవితంలో ప్రతి స్థాయిలో భద్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పాలసీ వల్ల మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలు సమయానుగుణంగా పూర్తి చేసుకోవచ్చు.

పన్ను ప్రయోజనాలు..

సాధారణ టర్మ్ బీమా వలే ఈ పాలసీకి కూడా పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం మినహాయింపు తీసుకోవచ్చు. మరణించిన సమయంలో వచ్చే మొత్తానికి కూడా సెక్షన్ 10డీ ప్రకారం పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

ఇదీ చూడండి:పెరగనున్న టర్మ్ బీమా ప్రీమియం!

ABOUT THE AUTHOR

...view details