తెలంగాణ

telangana

కొత్తగా కరోనా వ్యాప్తి.. దేశంలో తొలి 'సూపర్ వేరియంట్' కేసు.. డేంజరేనా?

By

Published : Dec 31, 2022, 8:02 PM IST

అమెరికాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ ఉపరకం ఎక్స్‌బీబీ.1.5 తొలి కేసు భారత్‌లోనూ నమోదైంది. బీక్యూ, ఎక్స్‌బీబీ సబ్‌ వేరియంట్‌లతో పోల్చితే రోగనిరోధకతను ఏమార్చే సామర్థ్యం దీనికి ఎక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాప్తి అవకాశాలూ ఎక్కువేనని అంటున్నారు.

xbb dot1 5 super variant first case in gujarath
గుజరాత్​లో ఎక్స్‌బీబీ 1 5 సూపర్‌ వేరియంట్‌ కరోనా కేసు

భారత్‌లో ఒమిక్రాన్‌ ఉపరకం ఎక్స్‌బీబీ.1.5 తొలి కేసు వెలుగుచూసింది. గుజరాత్‌లో ఇది బయటపడినట్లు ఇన్సాకాగ్‌ వివరాల్లో వెల్లడైంది. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల పెరుగుదలకు ఈ సబ్‌ వేరియంటే కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్‌ వల్ల గత వారం వ్యవధిలోనే అమెరికాలో కేసులు 21.7 శాతం నుంచి 41 శాతం పెరిగాయని యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్ తెలిపింది. దీని కారణంగా న్యూయార్క్‌లో ఆస్పత్రుల్లో చేరికలూ పెరుగుతున్నాయి.

ఒమిక్రాన్‌కు చెందిన రెండు వేర్వేరు బీఏ.2 సబ్- వేరియంట్‌ల సమ్మేళనమైన "ఎక్స్‌బీబీ" రూపాంతరమే "ఎక్స్‌బీబీ.1.5"దీన్ని "సూపర్‌ వేరియంట్‌" గానూ పేర్కొంటున్నారు. అదనపు మ్యుటేషన్‌ కారణంగా మానవ శరీరంలోని కణాలను అంటిపెట్టుకునే లక్షణం దీనికి అధికంగా ఉందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ వైరాలజిస్ట్ ఆండ్రూ పెకోస్జ్ తెలిపారు. బీక్యూ, ఎక్స్‌బీబీ సబ్‌ వేరియంట్‌లతో పోల్చితే రోగనిరోధకతను ఏమార్చే సామర్థ్యం ఎక్కువ ఉండటంతోపాటు వ్యాప్తి అవకాశాలూ ఎక్కువేనని అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగల్-డింగ్ ట్వీట్ చేశారు. ఎక్స్‌బీబీ.1.5కి సంబంధించి ఆయన పేర్కొన్న అంశాల్లో కొన్ని..

  • రోగనిరోధక శక్తిని ఏమార్చే బలమైన వేరియంట్‌లలో ఇదీ ఒకటి.
  • మానవ శరీరంలో ప్రవేశించడం, కణాలపై దాడి చేయడంలో దూకుడు కనబర్చుతుంది.
  • పాత ఎక్స్‌బీబీ లేదా బీక్యూ రకాల కంటే చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.
  • ఈ ఉపరకం ప్రబలంగా ఉన్న చోట్ల ఆసుపత్రుల్లో చేరికలు పెరుగుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. గుజరాత్‌లో మొదటి ఎక్స్‌బీబీ.1.5 కేసు గుర్తించడంతో.. పొరుగున ఉన్న మహారాష్ట్ర అప్రమత్తమైంది. "రాష్ట్రంలో ప్రస్తుతం 275కుపైగా ఎక్స్‌బీబీ కేసులు ఉన్నాయి. కానీ, ఎక్స్‌బీబీ.1.5 గురించి చాలా తక్కువగా తెలుసు. దీంతో.. ఈ ఉపరకంపై దృష్టి సారించాం. ఇది ఎక్స్‌బీబీ రూపాంతరమే కాబట్టి.. కొన్ని మార్పులు ఉండొచ్చని సమాచారం. ఏదేమైనా.. వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ 100 శాతం జీనోమ్‌ సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నాం" అని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details