తెలంగాణ

telangana

విస్తృత అవకాశాలతోనే అసమానతలు దూరం

By

Published : Mar 8, 2021, 6:49 AM IST

ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అనే నినాదాలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. ఏటా మహిళా దినోత్సవం నాడు వారి సేవలను కొనియాడటం తప్ప.. మహిళాభివృద్ధికి నిజమైన బాటలు పడట్లేదు. ఎన్నో రంగాల్లో వారికి సమాన అవకాశాలు అందట్లేదన్నది నిజం. లింగపరమైన వివిక్ష వేళ్లూనుకుపోయిన సమాజాల్లో మహిళా సాధికారతకు మిధ్యే అవుతోంది. అతివలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించినప్పుడే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకు సార్థకత!

womens day special all the women have to get equal rights in the society then only she would be recognized
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

సమాన అవకాశాలున్న చోట అభివృద్ధిలో అసమానతలు ఉండవు. లింగపరమైన దుర్విచక్షణకు అంతం పలికి పురోగతి పథంలో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించాలన్న ఆకాంక్ష ఇప్పటిది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా నిర్వహించే మహిళా దినోత్సవాల మౌలిక ఉద్దేశమూ ఇదే. దేశదేశాల్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ సమీకరణలను ఈ దఫా కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రభావితం చేసింది. అందుకే 'మహిళా నాయకత్వం- కొవిడ్‌ ప్రభావిత ప్రపంచ గమనంలో స్త్రీమూర్తులకు సమాన స్థాయి సాధించడం' అనే నినాదంతో ఈ ఏటి మహిళా దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది.

క్రమంగా పెరుగుదల..

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న నాయకత్వ మార్పుల్లో మహిళామణులకు గడచిన ఏడాది సముచిత స్థానం దక్కింది. అమెరికా ఉపాధ్యక్ష స్థానం తొలిసారిగా కమలాహ్యారిస్‌ రూపంలో ఓ మహిళకు దఖలుపడింది. ఆఫ్రో ఆసియా మూలాలున్న కమలా హ్యారిస్‌కు సుదీర్ఘ పాలనానుభవం ఉంది. మరోవంక అమెరికా ప్రతినిధుల సభలో మునుపెన్నడూ లేని స్థాయిలో 119 మంది మహిళా సభ్యులకు చోటు దొరకడం విశేషం. ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా నైజీరియాకు చెందిన గొజి ఒకొంజొ ఇవెలాను ఇటీవల నియమించారు. ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగానే కాకుండా ఆఫ్రికా ప్రాంతం నుంచి ఆ స్థానం చేరుకున్న వ్యక్తిగానూ ఆమె ఘనత సాధించారు.


ముందుండి నడిపారు..
కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో వ్యాధి నియంత్రణ క్రతువును ముందుండి నడిపించింది మహిళా సమాజమే. ఆరోగ్య కార్యకర్తలుగా, స్వాస్థ్య ఉద్యమకారిణులుగా, వైద్య సేవలందించడంలో మనసుపెట్టి పనిచేసిన సృజనశీలురుగా, ప్రజాసమూహాలను ఎప్పటికప్పుడు చైతన్యపరచిన చురుకైన నాయకురాళ్లుగా కరోనా కట్టడిలో వనితాలోకం పోషించిన పాత్ర చిరస్మరణీయమైనది. ఈ సంక్షోభం ఒక రకంగా మహిళల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది. పరిమితికి మించి వారు మోస్తున్న బరువు బాధ్యతలనూ వెల్లడించింది. మహమ్మారిలా విరుచుకుపడిన కొవిడ్‌ను, వైరస్‌ విసిరిన సామాజిక ఆర్థిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్న మెజారిటీ దేశాలకు మహిళలే సారథ్యం వహించడం విశేషం. డెన్మార్క్‌, ఇథియోపియా, ఫిన్‌లాండ్‌, జర్మనీ, ఐస్‌లాండ్‌, న్యూజిలాండ్‌, స్లొవేకియా వంటి దేశాలు కొవిడ్‌పై పోరాటంలో ముందువరసలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గాంబియాలోని బంజుల్‌ మొదలు స్పెయిన్‌లోని బార్సిలోనా వరకు 15మంది మహిళా మేయర్లు కొవిడ్‌ నియంత్రణలో, వైరస్‌ కట్టడిలో తమ అనుభవాలను అంతర్జాల వేదికలపై పంచుకొంటూ ప్రముఖంగా కనిపించారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో చురుగ్గా సాయం పడుతున్న స్త్రీమూర్తుల పరిస్థితి క్షేత్రస్థాయిలో దారుణంగా ఉంది. గృహ హింస, మితిమీరిన పని భారం, నిరుద్యోగిత, పేదరికం మహిళాలోకాన్ని చెండుకుతింటున్నాయి. 'ఐరాస' ఇటీవల వెలువరించిన నివేదిక ప్రకారం కరోనా ప్రభావం కారణంగా ఈ ఏడాది 9.6 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి జారుకుంటారు. ఇందులో 4.7 కోట్ల మంది మహిళలు, బాలికలే కావడం గమనార్హం.

ఆరోగ్య సమస్యలు, ఆర్థిక వెనకబాటు స్త్రీజాతికి అడ్డంకులుగా ఉన్నాయి. మహిళల ఆదాయం కనిష్ఠంగా ఉండటం; చెప్పుకోదగిన పొదుపు మొత్తాలు లేకపోవడం; ఆస్తిపాస్తులు కొరవడటం, అత్యధికులు అసంఘటిత రంగానికి చెందినవారే కావడం, వీరికి సంబంధించి సామాజిక రక్షణ ఏర్పాట్లు కనిష్ఠంగా ఉండటం, మితిమీరిన ఇంటిపనికి బందీలై ఉండటం వంటివి వనితా లోకానికి సంకెళ్లుగా మారాయి. మహమ్మారి ఆగమనంతో అంతా ఇళ్లకే పరిమితం కావడంతో స్త్రీలపై ఊపిరిసలపనంత పనిభారం పెరిగింది. గృహ హింస, లైంగిక హింస పెరిగింది. భౌతిక, మానసిక వేధింపులు పెరిగాయి. ఉద్యోగాలు చేసే స్త్రీలురెట్టింపు పనితో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉపాధిపరంగానూ మహిళల పరిస్థితి మహమ్మారి కారణంగా మరింత క్షీణించింది.

పురోగతికి బాటలు..

కరోనా నేపథ్యంలో ఎదురైన అనుభవాల సాయంతో ప్రస్తుత వ్యవస్థలను మార్చేందుకు ప్రయత్నించాలి. స్త్రీలకు ఉపాధి కల్పించ లేని ఈ దురవస్థను మార్చాలి. సహేతుక వేతనం ఇవ్వని విధానాలను సంస్కరించాలి. మహిళలు చేసే ప్రతి పనిని గౌరవించడం ద్వారా ఈ లక్ష్యాలను సాధించాలి. ఈ మార్పుల ద్వారా లింగపరమైన దుర్విచక్షణ, పురుషాధిక్య ధోరణులకు ముగింపు పలికేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ ఏటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ నినాదం స్త్రీల స్థితిగతులపై యూఎన్‌ కమిషన్‌ నిర్వహించిన 65వ సమావేశపు ప్రాధమ్యాలకు అనుగుణంగానే ఉంది. ప్రజాజీవితంలో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని పెంచడంతోపాటు, వారిపై అన్నిచోట్లా జరుగుతున్న హింసకు ముగింపు పలకడం ద్వారా లింగపరమైన సమానత్వాన్ని, స్త్రీలు-బాలికల సాధికారతను సాధించాలని యూఎన్‌ సమావేశం ప్రాథమ్యాలు నిర్దేశించింది. సమానమైన పని, సమాన వేతనంతోపాటు అన్ని రంగాల్లోనూ మహిళలకు నిర్ణయాధికారం ఉండాలని ఆ సమావేశం నినదించింది.

చురుకైన భాగస్వామ్యం..

2030నాటికి నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు భిన్న రంగాల్లో మహిళా భాగస్వామ్యం పెరగడం అత్యంత కీలకం. ఉపాధి రంగంలో మహిళల ప్రాధాన్యం పెరిగితే మెరుగైన నిర్ణయాలకు; సమర్థమైన పురోగతికి బాటలు పడతాయి. అసమానతలపై బలంగా గళమెత్తి, లింగపరమైన దుర్విచక్షణలపై రాజీలేని ఉద్యమాలు చోటుచేసుకుంటున్న దేశాల్లోనే మేలైన సమ్మిళిత ఆర్థిక విధానాలు ప్రాణం పోసుకున్నాయి. కొవిడ్‌ అనంతరమూ మహిళల చురుకైన భాగస్వామ్యానికి వీలు కల్పించాలి. నాయకత్వం వహించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో, వివిధ రంగాల్లో భాగస్వామ్యం కల్పించడంలో వారి పాత్ర పెరగాలి. చట్టాలు, విధానాలు, బడ్జెట్లతోపాటు అన్ని స్థాయుల్లోనూ నిర్ణయాధికారంలో వారి వాటా పెరగాలి.

మహిళా బృందాల స్పందన..

దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయ బృందాలు సైతం కొవిడ్‌ సవాలుకు దీటుగా స్పందించాయి. మాస్కులు, శానిటైజర్లు, ఇతర రోగ నిరోధక ఉపకరణాలను ప్రజలకు చేరవేయడంతోపాటు- సామూహిక వంటశాలలు నిర్వహించి లక్షల మంది ఆకలి తీర్చారు. కేరళలో మహిళల సారథ్యంలో కొనసాగుతున్న 'కుదుంబశ్రీ (కుటుంబశ్రీ)' వ్యవస్థలో 44 లక్షల సభ్యులున్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ వేళ ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సామూహిక వంటశాలలను పెద్దయెత్తున నిర్వహించింది.

ఇవీ చదవండి:విమెన్స్ డే స్పెషల్: నీ సహనానికి సరిహద్దులు కలవా..!

ఉమెన్స్ డే: ఈ 'అమ్మ'లకు ఎవరూ సాటిరారు!

హీరోహీరోయిన్లకు రెమ్యునరేషన్​లో ఎందుకీ వ్యత్యాసం?

వ్యక్తిగత బాగోగుల విషయంలో వెనకబడిపోతే ఎలా...?

అది జరిగినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం..!

ABOUT THE AUTHOR

...view details