తెలంగాణ

telangana

ఆస్పత్రి టాయిలెట్​లో మహిళ ప్రసవం.. కమోడ్​లో పడి నవజాత శిశువు మృతి

By

Published : Jul 21, 2023, 11:45 AM IST

Woman Gave Birth In Hospital Bathroom : ప్రభుత్వాస్పత్రిలో మూత్రవిసర్జన కోసం బాత్​రూమ్​కు వెళ్లిన ఓ గర్భిణీ అక్కడే ప్రసవించింది. అదే సమయంలో కమోడ్​లో పడ్డ నవజాత శిశువు మృతి చెందింది. తమిళనాడులో ఈ హృదయవిదారక ఘటన జరిగింది.

woman gave birth in hospital bathroom
woman gave birth in hospital bathroom

Woman Gave Birth In Hospital Bathroom : తమిళనాడులోని కాంచీపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణీ.. మూత్రవిసర్జన సమయంలో టాయిలెట్​లోనే ప్రసవించింది. దీంతో నవజాత శిశువు.. కమోడ్​లో పడి మరణించింది.

అసలేం జరిగిందంటే?
జిల్లాలోని మామల్లన్​ నగర్​కు చెందిన జ్ఞానశేఖరన్​ భార్య ముత్తమిజ్​(22) నిండు గర్భిణీ. తన భర్తతో కలిసి ఆమె.. బుధవారం ఉదయం కాంచీపురం ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షించగా.. ఆమె ప్రసవానికి సమయం దగ్గర పడినట్లు తేలింది. దీంతో ఆమె వెంటనే ఆస్పత్రిలో చేరింది. అదే రోజు సాయంత్రం 6.30 గంటల సమయంలో మూత్ర విసర్జనకు ఆమె టాయిలెట్​కు వెళ్లింది.

ఆ సమయంలో వెస్ట్రన్ టాయిలెట్‌లో మూత్ర విసర్జన చేసేందుకు కూర్చున్నప్పుడు ముత్తమిజ్​కు ప్రసవ నొప్పులు వచ్చాయి. అప్పుడే పండంటి ఆడబిడ్డకు ప్రసవించింది. కానీ ఆ చిన్నారి.. కమోడ్​లో పడిపోయింది. ముత్తమిజ్​ అరుపులు విన్న నర్సులు.. బాత్​రూమ్​ వద్దకు వచ్చి చిన్నారిని రక్షించారు. చిన్నపిల్లలు వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల మెరుగైన చికిత్స కోసం చెంగల్​పట్టు ప్రభుత్వ బోధనాస్పత్రికి నవజాత శిశువును తీసుకెళ్లాలని సూచించారు.

దీంతో చిన్నారి కుటుంబసభ్యులు.. 108 అంబులెన్స్​కు సమాచారం అందించారు. కానీ అంబులెన్స్​ ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం. ఆ అంబులెన్స్​లో చిన్నారిని చెంగల్‌పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 10 కిలోమీటర్లు ప్రయాణించాక.. మార్గమధ్యలోనే చిన్నారి మృతి చెందింది. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని ఆరోపిస్తూ కాంచీపురం ప్రభుత్వాస్పత్రి వైద్యులు, నర్సులతో ముత్తమిజ్​ భర్త జ్ఞానశేఖర్, బంధువులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంంది.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రికి వద్దకు చేరుకుని ముత్తమిజ్​ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత జ్ఞానశేఖరన్‌.. చిన్నారి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ ఘటన తర్వాత కాంచీపురం ఆస్పత్రిలో మిగతా రోగులు.. వైద్య సిబ్బందిపై మండిపడ్డారు. ప్రసూతి వార్డులో నర్సుల కొరత ఉందని.. ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ఆరోపించారు. అంతే కాకుండా కొందరు సెక్యూరిటీ గార్డులు, మహిళా సిబ్బంది.. లంచం ఇచ్చే వారినే వార్డుల్లోకి అనుమతిస్తున్నారని ఆరోపణలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details