తెలంగాణ

telangana

రైల్లో వెళ్తున్న 'ఆమె'పై డౌట్.. చెక్ చేస్తే బ్యాగులో పాములు, బల్లులు, సాలీళ్లు

By

Published : Nov 7, 2022, 1:58 PM IST

Updated : Nov 7, 2022, 4:01 PM IST

ట్రైన్​లో పాములను స్మగ్లింగ్ చేస్తున్న ఓ మహిళను రైల్వే పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆమె నుంచి అరుదైన పాములతోపాటు ఇతర జీవులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ బహిరంగ మార్కెట్​లో కొన్ని కోట్లలో ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఝార్ఖండ్ జంషెద్​పుర్​లోని టాటానగర్‌ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.

exotic breed snake in Jamshedpur
అరుదైన పాములు స్మగ్లింగ్​ చేస్తున్న మహిళ

ఝార్ఖండ్ జంషెద్​పుర్​లోని టాటానగర్​ రైల్వేస్టేషన్​లో ఓ మహిళ అరుదైన పాములను తరలిస్తూ ఆర్​పీఎఫ్​ పోలీసులకు పట్టుబడింది. ఆ మహిళ నుంచి అనేక విదేశీ జాతుల పాములు, ఇతర జీవులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అటవీ శాఖకు అందిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్ట్​ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్​పీఎఫ్​ అధికారులు వెల్లడించారు.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓ మహిళ తన బ్యాగులో ఝార్ఖండ్​లోని టాటానగర్​ మీదుగా దిల్లీకి విదేశీ పాములను అక్రమంగా తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు టాటానగర్​లో తనిఖీలు చేపట్టారు. ప్లాట్‌ఫామ్ నంబర్ 3 పై దిల్లీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఆ మహిళను బ్యాగ్‌తో సహా గుర్తించారు. ఆమెను అరెస్ట్​ చేసి.. విచారణ చేపట్టగా ఆ మహిళది పుణె అని చెప్పింది. ఒక పరిచయం ఉన్న వ్యక్తి తనకు ఈ బ్యాగ్ ఇచ్చాడని, దానిని దిల్లీకి తీసుకెళ్లాలని సూచించాడని ఆ మహిళ తెలిపింది. ఆమె నాగాలాండ్ నుంచి గువహటికి వెళ్లి అక్కడ నుంచి హిజ్లీకి, తర్వాత దిల్లీకి వెళ్తున్నట్లు వెల్లడించింది.

అక్రమంగా తరలిస్తున్న పాములు, జీవులను పట్టుకున్న రైల్వే పోలీసులు

మహిళ నుంచి స్వాధీనం చేసుకున్న సర్పాల వివరాలు తెలుసుకునేందుకు పాములు పట్టుకునే వ్యక్తికి పిలిపించారు. అటవీశాఖకు సమాచారం అందించారు. ఆ బ్యాగులో 28 రకాల పాములే కాకుండా సాలీడ్లు, నల్లని పురుగులు, బల్లులు ఉన్నాయి. అందులో సాండ్​ బోవా అనే పాము ధర అంతర్జాతీయ మార్కెట్​లో కొన్ని కోట్లలో ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతోందని.. దీనితో సంబంధం ఉన్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆర్‌పీఎఫ్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ సంజయ్ తివారీ తెలిపారు.

అరుదైన పాము
Last Updated :Nov 7, 2022, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details