తెలంగాణ

telangana

'స్వదేశంలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ అందుకే..'

By

Published : Dec 27, 2021, 5:05 AM IST

Rajnath Singh on BrahMos: స్వదేశంలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ స్పష్టత ఇచ్చారు. భారత్​పై దుష్ట కన్ను పడకుండా నివారించేందుకే క్షిపణి తయారు చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు.

rajnath singh
రాజ్​నాథ్ సింగ్

Rajnath Singh on BrahMos: భారత్‌పై దాడి చేసేందుకు ఏ దేశమూ కన్నెత్తే సాహసము చేయకుండా ఉండేందుకే స్వదేశంలో బ్రహ్మోస్‌ క్షిపణి తయారు చేయాలనుకుంటున్నామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. అంతేకానీ మరే దేశంపై దాడి చేసే ఉద్దేశంతో కాదని స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బ్రహ్మోస్‌ తయారీ కేంద్రంతోపాటు రక్షణ సాంకేతిక, ప్రయోగ కేంద్రానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి పాకిస్థాన్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు.

'తాము తయారు చేస్తోన్న సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌తోపాటు ఇతర అధునాతన రక్షణ ఆయుధాలు ఇతర దేశాలపై దాడి చేసేందుకు కాదు. ఇతర దేశాలపై దాడి చేయడం లేదా ఇతర దేశం నుంచి ఇంచు భూమి కూడా లాక్కునే స్వభావం భారత్‌కు ఎన్నడూ లేదు' అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. బ్రహ్మోస్‌ క్షిపణిని భారత్‌ గడ్డపైనే తయారు చేయాలనుకుంటున్నామని పేర్కొన్న ఆయన.. తద్వారా చెడు ఉద్దేశంతో ఎవ్వరూ భారత్‌పై కన్నెత్తి చూసే సాహసం చేయలేరని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. భారత్‌పై ఆ దేశం ఎందుకు విరోధం కోరుకుంటుందో తెలియదన్నారు.

Brahmos Missile Lucknow:

'పొరుగు దేశం ఒకటుంది. కొంతకాలం క్రితం భారత్‌ నుంచి విడిపోయింది. ఎందుకో తెలియదు కానీ భారత్‌ పట్ల ఆ దేశానికి ఎల్లప్పుడూ చెడు ఉద్దేశాలే ఉంటాయి. ఊరీ, పుల్వామాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడింది. అటువంటి సందర్భంలోనే ప్రధాని మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశం భూభాగంలోకి అడుగుపెట్టి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాం. ఆ సమయంలో ఎయిర్‌స్ట్రైక్‌ అవసరం కావడంతో దాన్ని కూడా విజయవంతంగా పూర్తిచేశాం. అలా ఎవరైనా మనమీద దురుద్దేశంతో ఏదైనా చేసేందుకు సాహసిస్తే.. కేవలం మన ప్రాంతం నుంచే కాకుండా వారి భూభాగంలోకి ప్రవేశించి దాడిచేస్తామనే హెచ్చరిక ఇచ్చాం. ఇదే భారత్‌ బలం' అని పరోక్షంగా ప్రస్తావిస్తూ పాకిస్థాన్‌పై రాజ్‌నాథ్‌ సింగ్‌ నిప్పులు చెరిగారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్‌.. దేశ రక్షణను తేలికగా తీసుకోమని స్పష్టం చేశారు. తొలుత ఎవ్వర్నీ రెచ్చగొట్టమని, అదే సమయంలో ఎవరైనా మనదేశాన్ని రెచ్చగొడితే అటువంటి వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.

ఇదీ చదవండి:

'రద్దయిన చట్టాలను మళ్లీ తీసుకువచ్చే యోచన లేదు'

హిమవీరులారా మీకు సలాం.. రక్తం గడ్డ కట్టే చలిలోనూ దేశం కోసం...

ABOUT THE AUTHOR

...view details