తెలంగాణ

telangana

'సొరంగంలో చిక్కుకున్నవారంతా సేఫ్​'- కుటుంబ సభ్యులతో మాట్లాడిన కూలీలు, ఆపరేషన్ మరింత ముమ్మరం

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 8:16 AM IST

Updated : Nov 22, 2023, 9:17 AM IST

Uttarakashi Tunnel Incident Live Video : ఉత్తరాఖండ్​లోని సొరంగంలో చిక్కుకున్న కూలీల దృశ్యాలను తొలిసారిగా తీసుకోవడమే కాకుండా వారితో వీడియో ద్వారా ముఖాముఖి మాట్లాడడంలో సహాయక సిబ్బంది విజయం సాధించారు. కూలీలను వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడించారు.

Uttarakashi Tunnel Incident Live Video
Uttarakashi Tunnel Incident Live Video

Uttarakashi Tunnel Incident Live Video :ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. టన్నెల్​ లోపల ఉన్నవారి క్షేమసమాచారాన్ని తెలుసుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలిస్తున్నాయి. గత 11 రోజులుగా సొరంగంలో ఉన్న వీరి వద్దకు ఆరు అంగుళాల పైప్​ను లోపలకు పంపించారు. దీని ద్వారా పంపిన ఓ ఎండోస్కోపీ కెమెరాలో కూలీలకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. అందులో వారంతా సురక్షితంగానే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్​ను రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ ధామి తన అధికారిక ట్విట్టర్​(ఎక్స్‌)లో పోస్ట్​ చేశారు. కాగా, టన్నెల్​ ప్రమాదానికి సంబంధించిన కారణాలపై విచారణ జరుపుతామని సీఎం ధామి హామీ ఇచ్చారు.

ఫ్యామిలీతో మాట్లాడిన కూలీలు!
కార్మికులకు సంబంధించిన దృశ్యాలను తొలిసారిగా తీసుకోవడమే కాకుండా వారితో వీడియో ద్వారా ముఖాముఖి మాట్లాడడంలో సహాయక సిబ్బంది విజయం సాధించారు. కూలీలను వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అలాగే కూలీలకు కావాల్సిన ఆహారం, మంచినీళ్లను ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నారు. కాగా, ఈనెల 12 నుంచి ప్రారంభమైన సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

'మా పూర్తి సహకారం ఉంటుంది..'
చార్​ధామ్​ మార్గంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఆర్​ఎఫ్​, ఐటీబీపీ, బీఆర్​ఓ భద్రతా దళాలు సహా అంతర్జాతీయ నిపుణులు భాగస్వాములయ్యారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్​సింగ్ ధామి తెలిపారు. అలాగే కేంద్ర సాంకేతిక ఏజెన్సీలు కూడా ఈ ప్రక్రియలో ముందున్నాయని.. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన సహకారం కూడా అందిస్తోందని సీఎం చెప్పారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా ప్రాణాలతో బయటకు తీసుకురావడమే తమ ప్రధాన కర్తవ్యమని పుష్కర్‌ సింగ్ ధామి స్పష్టం చేశారు. కూలీలతో మాట్లాడేందుకు కావాల్సిన మొబైళ్లు, ఛార్జర్లు, వాకీ టాకీలను కూడా అధికారులు సమకూర్చామని తెలిపారు. తద్వారా సొరంగం లోపల పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సొరంగంలో చిక్కుకున్న కూలీలందరూ క్షేమంగానే ఉన్నారని.. త్వరలోనే వారంతా బయటకు వస్తారనే అశాభావం తమకుందని పుష్కర్​ సింగ్​ ధామి అన్నారు. ప్రధాని మోదీ సైతం సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

"సిల్​క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​కు చెందిన ప్రత్యేక​ విమానాల ద్వారా కావాల్సిన పరికరాలు, సామగ్రిని కూడా తెప్పిస్తున్నాము. "

- పుష్కర్‌ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి

'ఏ మాత్రం తేడా వచ్చినా..'
సొరంగం ఉన్న కొండ పైభాగం నుంచి నిలువుగా తవ్వి, వెడల్పైన గొట్టాన్ని పంపించడం ద్వారా కూలీలను బయటకు తీసుకురావాలనే ప్రయత్నాలను అధికారులు ప్రస్తుతం పక్కనపెట్టారు. మధ్యలో గట్టిరాయి అడ్డుగా ఉండడం దీనికి కారణం. దీని బదులు శిథిలాలకు ఒక చివరి నుంచి మరో చివరికి 60 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయడమే మేలు అని 'జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ' సభ్యుడు సయ్యత్​ అటా హస్నైన్​ తెలిపారు. ఒకవేళ నిలువుగా తవ్వాలంటే అత్యంత కచ్చితత్వం ఉండాలని, ఏమాత్రం తేడా వచ్చినా బాధిత కూలీలను చేరుకోలేమని అంతర్జాతీయ నిపుణుడు ఆర్నాల్డ్​ డిక్స్​ హెచ్చరించారు.

కూలీలకు పౌష్టికాహారం..
సొరంగం లోపల చిక్కుకున్న కూలీల కోసం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందజేస్తున్నారు అధికారులు. సోమవారం తొలిసారిగా కిచిడీ, సాంబార్​తో కూడిన ఆహార పొట్లాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైప్​లైన్​ ద్వారా లోపలికి పంపించారు. అయితే మంగళవారం ఆహారపు మెనూలో కాస్త మార్పులు చేశారు. ప్రత్యేకంగా వండించిన వెజ్​ పలావ్​, పన్నీర్, గీ-రోటీ(నెయ్యితో చేసిన రొట్టె)​తో పాటు వివిధ రకాల పండ్లను కూలీలకు అందిస్తున్నారు. కాగా, పొషకాహార నిపుణుల సూచన మేరకు వీటిలో కారం, మసాలాలు ఎక్కువగా వాడలేదని వంటమినిషి సంజయ్ తిరానా తెలిపారు. వీటితో పాటు త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్​ను కూడా మెనూలో చేర్చి సరఫరా చేస్తున్నామని.. కూలీల కోసం ప్రత్యేక వైద్య సిబ్బందిని కూడా నియమించామని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న ఓ అధికారి చెప్పారు.

మీడియాకు సూచనలు..
సొరంగం వద్ద నెలకొన్న పరిస్థితులపై అందించే వార్తల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని.. సంచలనాల కోసం ప్రయత్నించకుండా సున్నితంగా వ్యవహరించాలని పలు ప్రైవేటు టీవీ ఛానళ్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. సహాయక చర్యలకు ఆటంకం కలిగించకుండా కెమెరాలు వినియోగించాలని కోరింది.

సొరంగంలోకి DRDO రోబోలు- వెంటిలేషన్​ సహా కూలీలకు ఆహారం అందజేత!

కూలీలకు వేడివేడి కిచిడీ- బాటిళ్లలో నింపి లోపలకు- సొరంగంలోని కార్మికుల లైవ్​ వీడియో

Last Updated : Nov 22, 2023, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details