తెలంగాణ

telangana

UP polls 2022: భాజపా ఇంటింటి ప్రచారంలో షా.. ఎస్​పీపై యోగి విమర్శలు

By

Published : Jan 22, 2022, 7:18 PM IST

Uttar Pradesh election 2022: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ ప్రచారాలు, ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన క్రమంలో ఇంటింటి ప్రచారం చేపట్టింది అధికార భాజపా. షామిలీ జిల్లాలోని కైరానాలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. మరోవైపు.. సమాజ్​వాదీ పార్టీ అభ్యర్థుల జాబితాపై విమర్శలు గుప్పించారు సీఎం యోగి ఆదిత్యనాథ్​.

amit shah, yogi adityanath
అమిత్​ షా, యోగి ఆదిత్యనాథ్​

Uttar Pradesh election 2022: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నిక నగార మోగిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్రంలో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. తొలిదశలో పోలింగ్​ జరిగే షామిలీ జిల్లాలోని కైరానా నగరంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. 2014లో వలస వెళ్లి రాష్ట్రానికి తిరిగి వచ్చిన కుటుంబాలను కలిశారు షా. ఇంటిటికి వెళ్లి ఓటర్లను కలిసిన ఆయన.. భాజపా అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.

కైరానాలో కరపత్రాలు పంచుతున్న అమిత్​ షా

"2014, జనవరి తర్వాత కైరానాకు తొలిసారి వచ్చాను. 2014 తర్వాత యూపీ అభివృద్ధికి ప్రధాని మోదీ పెద్దపీట వేశారు. 2017లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలో భాజపా ప్రభుత్వ ఏర్పాటు చేశాక అభివృద్ధిలో రాష్ట్రం మరింత దూసుకెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త అభివృద్ధి కనిపిస్తోంది. పలు రహదారులు, విమానాశ్రయాలు, విద్యుత్తు, కొవిడ్​-19 వ్యాక్సినేషన్​​ సహా ఇతర సౌకర్యాలను ప్రజలకు మోదీ, యోగి ప్రభుత్వాలు ఇచ్చాయి. ప్రతి పేద ఇంటిలో ఇప్పుడు గ్యాస్​ కనెక్షన్​, శౌచాలయం, విద్యుత్తు సౌకర్యం, ఆయుష్మాన్​ భారత్​ యోజన కార్డు ఉంది. రానున్న రోజుల్లో యూపీ అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించునుంది. మోదీ జీ తీసుకొచ్చిన అన్ని పథకాలను యోగీ జీ రాష్ట్రంలో అమలు చేశారు. కైరానాలో అది కనిపిస్తోంది. గతంలో వలస వెళ్లినవారు తిరిగొచ్చారు. "

- అమిత్​ షా, కేంద్ర హోంశాఖ మంత్రి.

కైరానాలో దివంగత నేత హుకుమ్​ సింగ్​ కూతురు మ్రిగాంక సింగ్​కు టికెట్​ ఇచ్చింది భాజపా. హుకుమ్​ సింగ్​ ఈ స్థానం నుంచి పలుమార్లు విజయం సాధించారు.

చిన్నారికి మిఠాయి తినిపిస్తున్న కేంద్ర హోంమంత్రి

సమాజ్​వాదీ పార్టీపై యోగి విమర్శలు..

అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్​వాదీ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాపై విమర్శలు గుప్పించారు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన నేతలకు టికెట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలుపుతోందని ఆరోపించారు.

"సమాజ్​వాదీ పార్టీ అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించిన వారు ఉంటారు. మా హయాంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారి పోస్టర్లు గోడలపై ఉంటాయని వారికి తెలుసు. కరోనాను ఎదుర్కొంటున్న తీరులో మోదీ ప్రభుత్వంపై యావత్​ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. ఇప్పటి వరకు భారత్​లో 160 కోట్ల డోసులు అందించాం. ఆక్సిజన్​ కొరత లేదు. ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకా అందిస్తున్నాం."

- యోగి ఆదిత్యనాథ్​, యూపీ ముఖ్యమంత్రి.

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:యూపీలో ముస్లింలు ఎటువైపు? యోగి '80-20' వ్యూహం ఫలించేనా?

ABOUT THE AUTHOR

...view details