తెలంగాణ

telangana

ఈవీఎంల ట్యాంపరింగ్​పై అఖిలేశ్​ ఆరోపణ.. ఈసీ ఏమందంటే?

By

Published : Mar 9, 2022, 4:16 AM IST

Updated : Mar 9, 2022, 12:19 PM IST

UP Election Result 2022: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ట్యాంపరింగ్​కు గురవుతున్నాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వారణాసిలో స్థానిక అభ్యర్థులకు సమాచారం లేకుండానే అధికారులు ఈవీఎంలను రవాణా చేశారని చెప్పారు. ప్రజాస్వామ్యం కోసం కౌంటింగ్ సమయంలో యువత సైనికులుగా మారాలని కోరారు. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.

UP Election Result
యూపీ ఎన్నికలు 2022

UP Election Result 2022: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను ఎలక్షన్ కమిషన్​ అధికారులు ట్యాంపరింగ్​ చేస్తున్నారని ఆరోపించారు. అయోధ్యలో తమ పార్టీ విజయం సాధిస్తుందని భాజపా భయపడుతోందని అన్నారు. వారణాసిలో స్థానిక అభ్యర్థులకు సమాచారం లేకుండానే ఈవీఎంలను రవాణా చేశారని ఆరోపించారు.

"ప్రజాస్వామ్యానికి ఇదే చివరి పోరు.. అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండానే ఈవీఎంలు రవాణా చేస్తున్నారు. ఇది దొంగతనం.. మన ఓట్లను కాపాడుకోవాలి. మనం కోర్టుకు వెళ్లవచ్చు కానీ అంతకంటే ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను."

- అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్

ఓట్ల లెక్కింపు సమయంలో మోసాలకు పాల్పడితే ఎదుర్కొనేందుకు సమాజ్‌వాదీ పార్టీ, మిత్రపక్షాల అభ్యర్థులు తమ కెమెరాలతో సిద్ధంగా ఉండాలని అఖిలేష్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం కోసం కౌంటింగ్ సమయంలో యువత సైనికులుగా మారాలని కోరారు. ఉత్తర్​ప్రదేశ్‌లో ఏడో, చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. రాష్ట్రంలో భాజపాకే మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఈసీ వివరణ..

ఉత్తర్​ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియోగం జరిగిందని అఖిలేశ్‌ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. వారణాసిలో ఈవీఎంలు ఉన్న వాహనాన్ని గుర్తించారని అఖిలేశ్‌ చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ఈసీ వివరణ ఇచ్చింది. ఆ ఈవీఎంలు ఓట్ల లెక్కింపు కోసం అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసినవని తెలిపింది. వాటిని ఎన్నికల కోసం వినియోగించలేదని ఈసీ స్పష్టం చేసింది. దీనిపై ఓ రాజకీయ పార్టీ వదంతులను ప్రచారం చేస్తోందని విమర్శించింది.

అఖిలేశ్​పై భాజపా విమర్శలు..

అఖిలేశ్​ యాదవ్​పై విమర్శలు గుప్పించారు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్​ ప్రసాద్​ మౌర్య. ప్రశాంతంగా, నిజాయతీగా జరిగిన ఎన్నికలను స్వాగతించకుండా.. ఓటమి భయంతో ఫలితాల తర్వాత మీడియాకు విడుదల చేసేందుకు ప్రెస్​నోట్​ను సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. ఎస్పీ కూటమి ఓటమి పాలవుతుందన్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు ఇలాంటి పనులను మానుకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి:'ఈడీ అధికారులు భాజపాకు ఏటీఎంలా మారారు'

Last Updated : Mar 9, 2022, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details