తెలంగాణ

telangana

48 గంటలుగా రెస్ట్​ లేకుండా 1,500 కార్మికుల శ్రమ.. రెండు లైన్లు పునరుద్ధరణ

By

Published : Jun 5, 2023, 8:13 AM IST

Updated : Jun 5, 2023, 10:21 AM IST

Track Restoration Balasore : ఒడిశా బాలేశ్వర్ రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ట్రాక్‌, విద్యుత్‌ లైన్ల పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రెండు ప్రధాన మార్గాలను రాకపోకలకు సిద్ధం చేశారు. ఆదివారం రాత్రి 10.40 గంటలకు తొలి గూడ్స్ రైలును రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. ఇప్పటికే 3 రైళ్లను ప్రయోగాత్మకంగా ఈ మార్గాల్లో పంపించామని.. రెండురోజుల్లో మరిన్ని రైళ్ల రాకపోకలకు అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. మరోవైపు ఈ దుర్ఘటనలో చనిపోయినవారిని గుర్తించడం కష్టతరంగా మారింది.

Track Restoration Balasore
Track Restoration Balasore

Track Restoration Balasore : ఒడిశా రైలు ప్రమాదంలో రైల్వే లైన్‌ను పునరుద్ధరించేందుకు.. ఆగ్నేయ రైల్వేతో పాటు తూర్పు కోస్తా రైల్వే, అధికారమంతా రంగంలోకి దిగింది. సుమారు 1,500 మందికి పైగా కార్మికులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు 48 గంటలుగా నిర్విరామంగా క్షేత్ర స్థాయిలో పనులు చేస్తున్నారు. తొలి రోజు నుంచి తీరిక లేకుండా పనిచేస్తున్న.. సిబ్బంది స్థానంలో పని చేయడానికి వాల్తేరు డివిజన్ నుంచి ఆదివారం 280 మంది సి‌బ్బందితో.. ప్రత్యేక రైలు బహనాగ బజార్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఒడిశా, బంగాల్ రైల్వే ఉన్నతాధికారులు, వాల్తేరు డీఆర్‌ఎం అనూప్ శత్పథి పునరుద్ధరణ పనులు పర్యవేక్షిస్తున్నారు.

ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత డౌన్‌లైన్ పునరుద్ధరించారు. తర్వాత రెండు గంటలకే అప్‌లైన్ కూడా సిద్ధమైంది. ఈ సెక్షన్ నుంచి మూడు రైళ్లను ప్రయోగాత్మకంగా నడిపామని.. మరో ఏడు రైళ్లను పరిశీలించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆదివారం రాత్రి 10.40 గంటలకు సిద్ధమైన మార్గంలో తొలి గూడ్స్ రైలును రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. వైజాగ్‌ నౌకాశ్రయం నుంచి రవుర్కేలా ఉక్కు కర్మాగారానికి బొగ్గును తీసుకెళ్తున్న రైలును మంత్రి ప్రారంభించారు. బెంగళూరు-హౌవ్‌డా రైలు ప్రమాదానికి గురైన ట్రాక్‌పైనే ఈ గూడ్సు పరుగులు పెట్టింది. తర్వాత వివిధ రైళ్లు బాలేశ్వర్‌ మార్గంలో తిరుగుతున్నాయి. లూప్‌లైన్‌ పనులు మాత్రం ఇంకా సాగుతున్నాయి. గూడ్సు సహా ప్యాసింజర్‌ రైళ్లను కూడా ప్రమాదం జరిగిన మార్గంలో తిప్పుతున్నారు. అయితే ఆ ప్రదేశంలో మాత్రం నెమ్మదిగా నడుపుతున్నారు. అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్‌ను కూడా ప్రమాద స్థలిలో వేగం తగ్గించి నడుపుతున్నారు.

"ప్రధాని మోదీ పునరుద్ధరణ పనులు తొందరగా చేయాలని ఆదేశించారు. మొత్తం సిబ్బంది వేగంగా ట్రాక్‌లను సిద్ధం చేసి రెండు మార్గాలను పునరుద్ధరించారు. భయానక దుర్ఘటన జరిగిన 51 గంటల్లోపే రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి వచ్చాయి."

--అశ్వినీ వైష్ణవ్, రైల్వే మంత్రి

మరోవైపు రైలు దుర్ఘటనలో కుటుంబసభ్యుల ఆచూకీ దొరక్క ఫొటోలు, ఆధార్ కార్డులు పట్టుకుని బంధువులు తిరుగుతున్నారు. ప్రమాద తీవ్రతకు తలలు చిధ్రమై గుర్తుపట్టటానికి వీల్లేని విధంగా మృతదేహాలున్నాయి. ఏ శవం ఎవరిదో తెలియని దుస్థితి. దీంతో వాటిని గుర్తించటం సవాలుగా మారింది. అధికారులు ప్రతి మృతదేహంపైన ఓ నంబరు వేసి అది కనిపించేలా మృతదేహాల ఫొటోలు తీసి వాటిని ఒక టేబుల్‌పై ఉంచారు. మృతుల కుటుంబ సభ్యులు.. ఆ ఫొటోలు చూసుకుని వాటిలో తమవారు ఉన్నారేమోనని గుర్తించాల్సిందే. ఫొటోల్లో మృతదేహాలు చిద్రమైపోయి ఉండటం వల్ల చాలామంది గుర్తించలేకపోతున్నారు.

Odisha Train Accident : ప్రమాద మృతుల్లో అత్యధికులు జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నవారే. వీరిలో బంగాల్, బిహార్‌కు చెందినవారే అధికం. అన్‌ రిజర్వ్‌డ్ బోగీల్లో వెళ్లిన వారి సమాచారం తెలియక గుర్తింపు కార్డులతో కుటుంబ సభ్యులు తిరుగుతున్నారు. కనిపించిన ప్రతి ఒక్కరిని తమ వారి గురించి అడుగుతున్నారు. బాలేశ్వర్‌లోని నోసీ ఇండస్ట్రియల్ పార్కు వద్ద ఉన్నవాటిలో ఆదివారం సాయంత్రానికి 97 మృతదేహాలనే గుర్తించగలిగారు. మిగతా మృతదేహాలను భద్రపరిచే చోటులేక భువనేశ్వర్, కటక్‌లోని వేర్వేరు చోట్లకు పంపించేశారు.

దీంతో మృతుల కుటుంబీకులకు.. తమవారి మృతదేహాలను వెతుక్కోవడం పెద్ద సవాలుగా మారింది. మృతుల్లో ఏ రాష్ట్రం వారు ఎందరనే కనీస సమాచారం కూడా అధికారులు ప్రకటించకపోవడం వల్ల తమ వారి చివరి చూపు కోసం బంధువులు పడుతున్న వేదన కలచివేస్తోంది. తమ బాధ్యత ఇంకా ముగియలేదని.. తప్పిపోయిన వారి కుటుంబ సభ్యులందరూ వీలైనంత త్వరగా వారిని కనుగొనేలా చూడడమే తమ లక్ష్యమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెబుతున్నారు. దాదాపు 200 మృతదేహాలను ఇంకా ఎవరూ గుర్తించలేదని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి :భద్రత మరిచిన రైల్వే.. వాటిలో 100% లోపాలున్నట్లు గతేడాదే కాగ్​ హెచ్చరిక

'సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్ర లోపాలు'.. 3 నెలల క్రితమే రైల్వే ఉన్నతాధికారి వార్నింగ్​

Last Updated :Jun 5, 2023, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details