తెలంగాణ

telangana

వివేకా హత్య కేసు.. నాలుగోసారి అవినాష్​ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ

By

Published : Mar 14, 2023, 3:47 PM IST

Updated : Mar 14, 2023, 5:14 PM IST

Ys viveka murder case CBI enquiry: వైఎస్​ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్​ రెడ్డి నాలుగోసారి సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆయనను అధికారులు నాలుగు గంటల పాటు విచారించారు. వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావడం ఇది నాలుగో సారి. అంతకు ముందు.. ఈ నెల 10వ తేదీన కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఆయన హాజరయ్యారు.

ys viveka murder case
avinash reddy

Ys viveka murder case CBI enquiry:మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని.. సీబీఐ ఇవాళ నాలుగు గంటల పాటు విచారించింది. అవినాష్‌రెడ్డిని మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో సీబీఐ కార్యాలయానికి చేరుకోగా.. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ నేతృత్వంలో అధికారులు ఆయనను ప్రశ్నించారు. వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావడం ఇది నాలుగో సారి. అంతకు ముందు.. ఈ నెల 10వ తేదీన కోఠిలోని సీబీఐ కార్యాలయానికి ఆయన హాజరయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు.

న్యాయవాది సమక్షంలో...సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి విచారణ జరిగింది. ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు.. తదనంతర పరిణామాలపైనే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది సమక్షంలోనే సీబీఐ అధికారులు విచారించారు.

న్యాయస్థానం ఆదేశాలతో...పార్లమెంటు సమావేశాల నేపథ్యాన తాను ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నదని.. సీబీఐ ముందు హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ సీబీఐకి అవినాష్‌రెడ్డి ఒక రోజు ముందుగా లేఖ రాశారు. దీనిపై సీబీఐ తరఫున ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. ఇక.. హైకోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ ఎదుట హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఎంపీ కోరగా.. తాము జోక్యం చేసుకోలేమని, సీబీఐ వద్దే తేల్చుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

లోతైన దర్యాప్తు..తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్​ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తోంది. కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను ప్రశ్నించింది. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్​ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మూడు సార్లు విచారణ జరిపిన సీబీఐ.. తాజాగా మంగళవారం నాలుగు గంటల పాటు ఆయన్ను ప్రశ్నించింది.

భాస్కర్ రెడ్డికి సైతం నోటీసులు..హత్య కేసును సీబీఐ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్​ భాస్కర్​రెడ్డిని ఈ నెల 12న విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు పులివెందులలో ఆయన ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు... నోటీసులను స్వయంగా భాస్కర్​రెడ్డికి అందించారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో విచారణకు రావాలని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున.. ఘటనా స్థలంలో సాక్ష్యాధారాలు చెరిపేయడంతో పాటు కేసులో భారీ కుట్ర కోణం దాగి ఉందని సీబీఐ అనుమానిస్తోంది. ఆయా సందేహాలు నివృత్తి చేసుకోవడానికి భాస్కర్​రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలిచినట్లు సమాచారం. వివేకా హత్య జరగడానికి కొన్ని గంటల ముందు... సునీల్ యాదవ్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు సీబీఐ గూగుల్ టేక్ అవుట్ ద్వారా నిర్ధారించింది.

తండ్రికి మూడుసార్లు.. కుమారుడికి నాలుగుసార్లు...భాాస్కర్ రెడ్డిని సీబీఐ విచారించడం ఇదే తొలిసారి కాదు.. ఏడాది కిందట వరసగా రెండురోజుల పాటు పులివెందులలో ప్రశ్నించింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఈ నెల12న విచారణకు పిలిచింది. గత నెల 23నే రావాలని నోటీసులు అందించినా.. వ్యక్తిగత కారణాలతో గడువు కోరారు. దీంతో కడపలో విచారణకు రావాలని సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చింది. కాగా, భాస్కర్‌రెడ్డి కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో సీబీఐ విచారణకు హాజరయ్యారు. అక్కడ అధికారులు లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ... అధికారులు మళ్లీ నోటీసులు ఇస్తే.. వస్తానని చెప్పారు.

ఇవీ చదవండి :

Last Updated : Mar 14, 2023, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details