తెలంగాణ

telangana

చైనా దూకుడుకు చెక్.. తూర్పు సెక్టార్​లో వాయుసేన యుద్ధ విన్యాసాలు

By

Published : Dec 15, 2022, 7:01 AM IST

తూర్పు సెక్టార్‌లో భారత వాయుసేన గురువారం నుంచి రెండు రోజుల పాటు యుద్ధవిన్యాసాలను నిర్వహించనుంది. ఇటీవల భారత్​-చైనా మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ విన్యాసాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, పాంగాంగ్​ సరస్సు సమీపంలో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతోంది.

tawang clash
tawang clash

తూర్పు సెక్టార్‌లో గురువారం నుంచి రెండురోజుల పాటు భారత వాయుసేన యుద్ధ విన్యాసాలను నిర్వహించనుంది. దీనిలో ఫైటర్‌జెట్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, మానవరహిత విమానాలు పాల్గొననున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును పరిశీలించేందుకు తూర్పు కమాండ్‌ వీటిని నిర్వహిస్తోంది. చాలా రోజుల ముందుగానే వీటికి సంబంధించిన షెడ్యూల్‌ కూడా సిద్ధమైంది. ఇటీవల జరిగిన ఘర్షణతో ఈ యుద్ధ విన్యాసాలకు సంబంధం లేదని వాయుసేన చెబుతోంది.

ఉద్రిక్తత నేపథ్యంలోనే..
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో యాంగ్జే వద్ద ఈ నెల 9న భారత్‌-చైనా దళాల మధ్య ఘర్షణతో వాస్తవాధీన రేఖ ఉద్రిక్తంగా మారింది. తూర్పు సెక్టార్లో వైమానిక విన్యాసాలు నిర్వహించనున్న సమయంలోనే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. మరోపక్క భారత్‌ చైనా సరిహద్దులకు 155 కిలోమీటర్లు ఉత్తరాన ఉన్న షిగాట్సే ఎయిర్‌పోర్టులో కదలికలు పెరిగాయి. ఇక్కడ డ్రాగన్‌.. ఫైటర్‌జెట్లు, ఎయిర్‌బార్న్‌ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, మానవ రహిత విమానాలను నిలిపి ఉంచింది.

పాంగాంగ్‌ సరస్సు వద్ద భారీగా నిర్మాణాలు..
కీలకమైన పాంగాంగ్‌ సరస్సు వద్ద బీజింగ్‌ భారీగా నిర్మాణాలు చేపడుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. ఇక్కడ అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను, పేలుళ్లను తట్టుకునేలా బంకర్లనూ ఏర్పాటు చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details