తెలంగాణ

telangana

'72 ఏళ్లైంది.. ఇంకా చట్టం చేయరా?'.. ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం ఫైర్

By

Published : Nov 23, 2022, 6:48 AM IST

supreme court
సుప్రీంకోర్టు ()

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియపై రాజ్యాంగ మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయంటూ సుప్రీంకోర్టు పెదవి విరిచింది. దీన్ని కలవరపరిచే ధోరణిగా పేర్కొంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియపై రాజ్యాంగ మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయంటూ సుప్రీంకోర్టు పెదవి విరిచింది. కలవరపరిచే ధోరణిగా దాన్ని పేర్కొంది. ఈసీ, సీఈసీల నియామకాలకు సంబంధించి ప్రభుత్వాలు 72 ఏళ్లుగా చట్టం తీసుకురాకపోవడాన్ని ప్రశ్నించింది. సీఈసీ నియామకానికి కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించింది.

"2004 నుంచి యూపీఏ పదేళ్ల పాలనలో ఆరుగురు సీఈసీలు, ఎన్డీయే హయాంలో 8 ఏళ్లలోనే ఎనిమిది మంది సీఈసీలు మారారు. ఇది దేశాన్ని కలవరపెట్టే ధోరణి. రాజ్యాంగంలో నిర్దిష్ట నిబంధనలేమీ లేకపోవడంతో.. దాని మౌనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో చట్టమంటూ ఏదీ లేదు కాబట్టి వారు చేసింది చెల్లుబాటవుతోంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటు చట్టం చేయాలని రాజ్యాంగ పరిషత్‌ కోరుకుందని జస్టిస్‌ జోసెఫ్‌ పేర్కొన్నారు. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 ఏళ్లవుతున్నా ఇప్పటికీ చట్టాన్ని తీసుకురాలేదని గుర్తుచేశారు. సీఈసీ, ఈసీల నియామకాల్లో ప్రభుత్వం ఏమైనా నిర్దిష్ట విధానాన్ని అనుసరిస్తోందో తమకు తెలియజేయాలని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణిని కోర్టు కోరింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

'టి.ఎన్‌.శేషన్‌ లాంటివారు కావాలి'
సీఈసీ, ఈసీల సున్నితమైన భుజాలపై రాజ్యాంగం మహత్తర అధికారాలను ఉంచిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బలమైన వ్యక్తిత్వమున్న దివంగత టి.ఎన్‌.శేషన్‌లాంటివారు సీఈసీగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు చాలామంది సీఈసీ పదవిని అలంకరించారని, కానీ టి.ఎన్‌.శేషన్‌లాంటివారు అరుదుగా వస్తుంటారని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details