తెలంగాణ

telangana

వివాదాస్పద ఎమ్మెల్యే ఆజం ఖాన్​పై అనర్హత వేటు.. దోషిగా తేలిన మరుసటి రోజే నిర్ణయం

By

Published : Oct 28, 2022, 8:15 PM IST

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ఆజం ఖాన్‌పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు స్పీకర్​ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

Samajwadi Party leader Azam Khan
Samajwadi Party leader Azam Khan

Azam Khan News: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్​. ఈ మేరకు శాసన సభ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఓ ఐఏఎస్‌ అధికారిపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆయన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆజం ఖాన్‌కు మూడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం సాయంత్రం తీర్పు వెల్లడించింది.

2019లో యూపీలో జరిగిన ఎన్నికల సందర్భంగా అజంఖాన్‌ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఐఏఎస్‌ అధికారి అంజనేయ కుమార్‌ సింగ్‌ (అప్పట్లో జిల్లా మెజిస్ట్రేట్‌)లపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ముస్లింల ఉనికికి కష్టతరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో రాంపుర్‌ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఇప్పటికే భూఆక్రమణ కేసులో అరెస్టయి దాదాపు రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆయనకు సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆరంభంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడం వల్ల విడుదలయ్యారు. అవినీతి, చోరీతో పాటు ఆజంఖాన్‌పై దాదాపు 90 కేసులు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details