తెలంగాణ

telangana

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి మళ్లీ కరోనా

By

Published : Aug 13, 2022, 3:56 PM IST

Sonia Gandhi Corona News కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మళ్లీ కరోనా పాజిటివ్​గా తేలింది. ఆమె ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్​ రమేశ్​ ట్వీట్​ చేశారు.

Sonia Gandhi tests positive for COVID-19 again
Sonia Gandhi tests positive for COVID-19 again

Sonia Gandhi Corona News: కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఆమెకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయ్యిందని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. ప్రభుత్వ ప్రొటోకాల్‌ ప్రకారం ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నట్లు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. సోనియా గాంధీ కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం ఇటీవలే కొవిడ్‌ బారిన పడ్డారు.
సోనియా గాంధీ కొవిడ్‌ బారిన పడడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. జూన్‌లో ఆమెకు కొవిడ్‌ నిర్ధరణ అయ్యింది. దీంతో కొవిడ్‌ అనంతర సమస్యలతో అదే నెల 12వ తేదీ దిల్లీలోని సర్‌ గంగా రామ్‌ ఆస్పత్రిలో చేరారు. జూన్‌ 20న కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రెండు నెలలు తిరగకముందే మరోసారి కొవిడ్‌ బారిన పడడం గమనార్హం. ఆమె త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్​ పార్టీ అధికారిక ట్విట్టర్​ హ్యాండిల్​లో పేర్కొంది. రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​, ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సహా పలువురు ప్రముఖ నేతలు.. సోనియా గాంధీ కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు.

కొద్దిరోజుల కింద నేషనల్​ హెరాల్డ్​ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీని విచారించింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. తర్వాత.. ఈ​ మనీలాండరింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా సీల్ చేసింది. దిల్లీ, లఖ్​నవూ, కోల్​కతాలో 10 నుంచి 12 చోట్ల అనేక గంటలపాటు సోదాలు జరిపిన ఈడీ.. కాంగ్రెస్​కు చెందిన హెరాల్డ్​ హౌస్​లోని యంగ్ ఇండియన్​ ఆఫీస్​ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఏంటీ కేసు?
కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసులో కాంగ్రెస్ చీఫ్​ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్​లను ఈడీ ప్రశ్నించింది. మూడు రోజుల విచారణలో భాగంగా సోనియాకు వందకుపైగా ప్రశ్నలు సంధించింది.

నేషనల్‌ హెరాల్డ్‌ పబ్లిషర్‌ అయిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) టేకోవర్‌కు సంబంధించిన లావాదేవీల గురించి సోనియాను ప్రశ్నించగా.. అవన్నీ మోతీలాల్‌ వోరాకే తెలుసని ఆమె చెప్పినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌, ఏజేఎల్‌, యంగ్‌ ఇండియన్‌ మధ్యలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూసుకున్నారని ఆమె చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన మోతీలాల్‌ వోరా.. మధ్యప్రదేశ్‌ సీఎంగా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారిగానూ వ్యవహరించారు. 2020 డిసెంబరులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.

ఇవీ చూడండి:గాంధీలకు ఈడీ బిగ్ షాక్.. ఆ ఆఫీస్​ సీజ్​.. సోనియా ఇంటి వద్ద భారీగా పోలీసులు

సోనియా వర్సెస్​ స్మృతి.. లోక్​సభలో పర్సనల్​ ఫైట్

ABOUT THE AUTHOR

...view details