ETV Bharat / bharat

సోనియా వర్సెస్​ స్మృతి.. లోక్​సభలో 'పర్సనల్​ ఫైట్!'

author img

By

Published : Jul 28, 2022, 2:48 PM IST

Updated : Jul 28, 2022, 7:00 PM IST

Adhir Ranjan Chowdhury's 'rashtrapatni' remark
Adhir Ranjan Chowdhury's 'rashtrapatni' remark

ధరల పెరుగుదల, ఎంపీల సస్పెన్షన్​పై కేంద్రంపై ముప్పేట దాడికి విపక్షాలు ప్రయత్నిస్తున్న వేళ.. ఒక్కసారిగా సీన్​ రివర్స్​ అయింది. కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనలు.. మరుగున పడిపోయాయి. బదులుగా ఇప్పుడు భాజపా ఎంపీలే నిరసన బాట పట్టారు. కాంగ్రెస్​ నేత అధీర్​ రంజన్​ వ్యాఖ్యలపై.. రాష్ట్రపతికి, దేశానికి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేస్తున్నారు​. సోనియా లోక్​సభలో తమ ఎంపీలను, ప్రత్యేకించి ఒకరిని(స్మృతి ఇరానీని) బెదిరించారని నిర్మల ఆరోపించగా.. రెండు వర్గాల మధ్య పెద్ద రాద్ధాంతమే జరిగింది. మరోవైపు.. తనను ఉరి తీయాలనుకున్నా దానికి సిద్ధమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు అధీర్​.

ఉదయాన్నే సభలు ప్రారంభం.. విపక్షాల నినాదాలు, ఆందోళనలు, వాయిదా.. కాసేపటికే పునఃప్రారంభం, మళ్లీ వాయిదా.. సభ్యుల సస్పెన్షన్.. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో కొద్దిరోజులుగా ఇదే తంతు జరుగుతుంది. ధరల పెరుగుదల వంటి పలు అంశాలపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూసిన కాంగ్రెస్​ సహా విపక్షాలకు అధీర్​ రంజన్​ చౌదరి రూపంలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఒక్కసారిగా సీన్​ రివర్స్​ అయింది. అధీర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన భాజపా.. నేరుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపైనే గురిపెట్టింది. రాష్ట్రపతికి, దేశానికి ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని కమలదళం పట్టుబడుతోంది.

ఏం జరిగిందంటే?
అధీర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు, అధికార పక్షం నిరసనల నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సోనియా గాంధీ ప్రయత్నించారు. లోక్​సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడగానే సోనియా గాంధీ.. ట్రెజరీ బెంచ్ వద్దకు వెళ్లారు. ఈ అంశంలోకి తనను ఎందుకు లాగుతున్నారని అక్కడ ఉన్న భాజపా నేత రమా దేవిని అడిగారు.

ఈ సమయంలో స్మృతి ఇరానీ.. మధ్యలో కలగజేసుకున్నారు. సోనియా గాంధీని చూపిస్తూ అధీర్ వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేశారు. తొలుత స్మృతి ఇరానీని.. సోనియా పట్టించుకోలేదు. అయితే, కాసేపటికే మంత్రివైపు చూసి కోపంగా మాట్లాడారు. ఈ విషయంపై స్పందించిన రమాదేవి.. "'నా పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారు? నా తప్పు ఏంటి?' అని సోనియా నన్ను అడిగారు. 'కాంగ్రెస్ లోక్​సభాపక్షనేతగా చౌదరిని ఎంపిక చేయడమే మీరు చేసిన తప్పు' అని నేను సోనియాతో చెప్పా" అని మీడియాకు వివరించారు. అయితే, సోనియా గాంధీ లోక్​సభలో కొందరు భాజపా ఎంపీలను బెదిరించారని సంచలన ఆరోపించారు కేంద్ర మంత్రి, భాజపా నాయకురాలు నిర్మలా సీతారామన్​.

"లోక్​సభలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సోనియా గాంధీ.. మా పార్టీ సీనియర్​ నాయకురాలు రమా దేవి దగ్గరకు వచ్చారు. అప్పుడు మా పార్టీకే చెందిన మరికొందరు అక్కడకు వెళ్లగానే.. 'నువ్వు(స్మృతి ఇరానీ)​ నాతో మాట్లాడకు' అంటూ సోనియా గాంధీ లోక్​సభలో మా సభ్యులను బెదిరించే ధోరణిలో అన్నారు. రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అధీర్​ రంజన్​.. క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. 'ఇప్పటికే ఆయన క్షమాపణలు కోరారు.' అని చెబుతున్నారు. సోనియా దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు."
-నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

కావాలంటే నన్ను ఉరితీయండి..
వివాదంపై వివరణ ఇచ్చిన అధీర్ రంజన్.. రాష్ట్రపతిని అవమానించాలనే ఆలోచన కూడా తనకు రాదని అన్నారు. ఒకవేళ రాష్ట్రపతికి ఏమైనా తప్పుగా అనిపిస్తే.. తాను స్వయంగా ఆమెను కలిసి క్షమాపణలు చెబుతానని అన్నారు.

"నేను తప్పు చేశా. దాన్ని ఒప్పుకుంటున్నా. రాష్ట్రపతిని ఉద్దేశపూర్వకంగా నేను ఏం అనలేదు. ఒకవేళ రాష్ట్రపతికి తప్పుగా అనిపిస్తే.. నేను స్వయంగా ఆమెను కలిసి క్షమాపణలు కోరతా. అంతేకాని ఈ వంచకులకు క్షమాపణ చెప్పను. కావాలంటే నన్ను ఉరితీయండి. నేను ఏ శిక్షకైనా సిద్ధమే. కానీ మధ్యలో ఆమెను (సోనియా గాంధీ) ఎందుకు ఇందులోకి లాగుతున్నారు."

- అధీర్​ రంజన్​ చౌదరి, కాంగ్రెస్​ నేత

మరోవైపు, జాతీయ మహిళా కమిషన్.. అధీర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. వ్యక్తిగతంగా హాజరై ఈ విషయంపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించింది. వచ్చే బుధవారం 11.30 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రపతిని అవమానించేలా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్​తో పాటు 13 రాష్ట్రాల్లోని మహిళా కమిషన్లు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.

'తోడేళ్లలా చుట్టుముట్టారు'
కాగా, కాంగ్రెస్సేతర విపక్ష నేతలు సోనియాకు మద్దతు ప్రకటించారు. కొంతమంది సోనియాను చుట్టుముట్టి హేళన చేశారని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్ర వ్యాఖ్యానించారు. '75ఏళ్ల సీనియర్ నేతను లోక్​సభలో తోడేళ్ల బృందం హేళన చేసినప్పుడు నేను అక్కడే ఉన్నా. ఆమె చేసిన తప్పల్లా.. ప్యానెల్ ఛైర్​పర్సన్​తో మాట్లాడటమే. భాజపా నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్​లో చెప్పిన అబద్దాలను వింటే అసహ్యం వేస్తోంది' అని ట్వీట్ చేశారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది, బీఎస్పీ నేత దానిష్ అలీ సైతం సోనియాకు మద్దతు ప్రకటించారు.

ఇవీ చూడండి: ఎంపీల 50 గంటల నిరాహార దీక్ష.. తిండి, నిద్రా అంతా అక్కడే..

'అధీర్' వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం.. మరో ముగ్గురు ఎంపీలపై వేటు

Last Updated :Jul 28, 2022, 7:00 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.