తెలంగాణ

telangana

పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము.. 25 మంది చిన్నారులకు అస్వస్థత!

By

Published : May 27, 2023, 5:00 PM IST

పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. భోజనం తిని 25 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిహార్​లో ఈ ఘటన జరిగింది.

snake in mid day meal in bihar several students ill
పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము.. 25 మంది చిన్నారులకు అస్వస్థత

బిహార్​లోని ఓ పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఆ భోజనం తిన్న చిన్నారుల్లో దాదాపు 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన అరారియా జిల్లాలో జరిగింది. అయితే మధ్యాహ్న భోజనం పాఠశాలలో వండలేదని.. ఓ కాంట్రాక్టర్​ దీనిని సరఫరా చేసినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫర్​బిస్‌గంజ్ సబ్‌డివిజన్ పరిధిలోని జోగ్‌బానిలోని సెకండరీ స్కూల్​లో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం భోజనం చేసిన చిన్నారుల్లో చాలా మంది వాంతులు చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు సైతం హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. స్కూల్​ వద్ద కాసేపు ఆందోళన చేపట్టారు. ఘటనపై హైలెవల్​ కమిటీతో విచారణ జరిపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

"మధ్నాహ్న భోజనంలో చిన్న పాము వచ్చిన విషయం వాస్తవమే. అయితే అది ఎలా వచ్చింది అనేది గుర్తించాల్సి ఉంది. దీనిపై విచారణ జరుపుతున్నాం. ఘటనలో 25 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కానీ వంద చిన్నారులు అనారోగ్యం పాలయ్యారనే పుకార్లు వినిపిస్తున్నాయి. అవేవి నమ్మొద్దు. ప్రస్తుతం చిన్నారులంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు." అని సబ్ డివిజనల్ అధికారి సురేంద్ర అల్బేలా తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన వివరించారు. అయితే భోజనాన్ని పాఠశాలలో తయారు చేయలేదని అధికారులు తెలిపారు. దీన్ని ఒక సప్లయర్​ సరఫరా చేశారన్నారు.

పప్పు గిన్నెలో పాము.. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత..
కొంత కాలం క్రితం కూడా ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బంగాల్​లోని బీర్బూమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. మయూరేశ్వర్ బ్లాక్​లోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పప్పు నిల్వ ఉంచిన పాత్రలో ఓ పామును పాఠశాల సిబ్బంది గుర్తించారు. వెంటనే వారందరిని రాంపుర్హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్​కు తరలించారు. ఘటనలో విద్యార్థులెవ్వరికి ప్రాణహాని కలగలేదు. చికిత్స అనంతరం విద్యార్థులంతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details