తెలంగాణ

telangana

'వ్యాక్సిన్‌ మిక్సింగ్‌ వద్దు- మూడో డోసే మంచిది'

By

Published : Aug 14, 2021, 5:50 AM IST

వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై విముఖత వ్యక్తం చేశారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధినేత సైరస్​ పునావాలా. వేర్వేరు వ్యాక్సిన్‌లను కలిపి ఇచ్చే విధానం సరైంది కాదని స్పష్టం చేశారు. వీటి వల్ల తయారీ సంస్థల మధ్య ఆరోపణలకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే మూడో లేదా బూస్టర్ డోసు తీసుకోవడం మంచిదన్నారు.

Cyrus Poonawalla
సైరస్​ పునావాలా

వేర్వేరు సంస్థలు అభివృద్ధి చేసినా కరోనా వ్యాక్సిన్‌లను మిక్సింగ్‌ విధానంలో ఇవ్వడంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా (Cyrus Poonawalla) స్పందించారు. వ్యాక్సిన్‌ డోసులను మిశ్రమ పద్ధతిలో ఇచ్చే అవసరం లేదని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఒక వేళ ఏదైనా తప్పు జరిగితే వ్యాక్సిన్‌ తయారీ సంస్థల మధ్య నిందారోపణలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రయోగ దశల్లో వీటిపై పూర్తి స్థాయిలో అధ్యయనాలు జరగలేదనే విషయాన్ని పూనావాలా గుర్తుచేశారు. పుణెలోని తిలక్‌ మహారాష్ట్ర విద్యాపీఠ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సైరస్‌ పూనావాలా ఈ విధంగా స్పందించారు.

'బూస్టర్ డోస్ మంచిది'

మరోవైపు కొవిషీల్డ్​ మూడో లేదా బూస్టర్ డోసు తీసుకోవడం మంచిదని సైరస్ పునావాలా పేర్కొన్నారు. "ఆరు నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గుతాయి. అందుకే నేను మూడో డోసు తీసుకున్నాను. 7 నుంచి 8 వేల మంది సీరం ఉద్యోగులకు బూస్టర్ డోస్ ఇచ్చాం. రెండో డోసు తీసుకున్నవారికి ఇదే నా అభ్యర్థన.. ఆరు నెలల తర్వాత బూస్టర్​ డోస్ తీసుకొండి."అని ఆయన పేర్కొన్నారు.

డోసుల కొరత వల్లే అలా..

వ్యాక్సిన్‌ ఎగుమతిని నిషేధించడాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పునావాలా. వేలకోట్లు ఖర్చు చేసి.. నెలకు 10 నుంచి 12 కోట్ల డోసుల ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా ప్రపంచంలో ఏ సంస్థ ఉత్పత్తి చేయడం లేదన్న ఆయన.. కేంద్ర నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కొవిషీల్డ్​రెండు డోసుల మధ్య వ్యవధి రెండు నెలలు మాత్రమేనని.. అయితే డోసుల కొరత కారణంగా కేంద్ర ప్రభుత్వం దానిని మూడు నెలలకు పెంచిందని ఆరోపించారు.

ఇదీ చూడండి:‘సీరం' ఛైర్మన్‌కు లోక్‌మాన్య తిలక్‌ జాతీయ పురస్కారం

ABOUT THE AUTHOR

...view details