ETV Bharat / bharat

‘సీరం' ఛైర్మన్‌కు లోక్‌మాన్య తిలక్‌ జాతీయ పురస్కారం

author img

By

Published : Jul 31, 2021, 5:31 PM IST

ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ డాక్టర్‌ సైరస్‌ పూనావాలాకు అరుదైన గౌరవం లభించింది. కొవిషీల్డ్ టీకా ఉత్పత్తిలో ఆయన చేసిన సేవలకు గాను ప్రతిష్ఠాత్మక లోకమాన్య తిలక్‌ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు.

Covishield
సీరం

దేశంలో ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ డాక్టర్‌ సైరస్‌ పూనావాలా ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది లోకమాన్య తిలక్‌ జాతీయ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయనున్నట్టు లోక్‌మాన్య తిలక్‌ ట్రస్టు అధ్యక్షుడు దీపక్‌ తిలక్‌ ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలో ఎంతోమంది ప్రాణాల్ని కాపాడేందుకు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా సన్మానించనున్నట్టు పేర్కొన్నారు. సైరస్‌ పూనావాలా సారథ్యంలో సీరం సంస్థ వ్యాక్సిన్‌ డోసులను కోట్ల సంఖ్యలో ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందించిందని ప్రశంసించారు. ఇంకా అనేక రకాల వ్యాక్సిన్లను సరసమైన ధరలకే అందించడంలో సీరం ముందువరుసలో ఉందన్నారు. ఆగస్టు 13న ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదుతో పాటు జ్ఞాపికను అందజేయనున్నారు.

Covishield
కొవిషీల్డ్‌ టీకా

వాస్తవానికి, ఏటా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ఆగస్టు 1న (లోక్‌మాన్య తిలక్‌ వర్థంతి) ప్రదానం చేస్తుంటారు. కానీ ఈ ఏడాది కరోనాతో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 13న ప్రదానం చేస్తున్నట్టు తిలక్‌ స్పష్టంచేశారు. 1983 నుంచి దేశంలో పలు రంగాల్లో విశేష సేవలందించే ప్రముఖులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఈ అవార్డు అందుకున్న ప్రముఖుల్లో సోషలిస్ట్‌ నేత ఎస్‌ఎం జోషి, మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, దివంగత నేత ప్రణబ్‌ ముఖర్జీ, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌ నారాయణమూర్తి తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి: 'కొవిషీల్డ్ తీసుకున్నవారికి ఆ దేశాల్లోకి అనుమతి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.