తెలంగాణ

telangana

ఉద్ధవ్​ ఠాక్రేకు బిగ్ షాక్.. శివసేన పేరు, ఎన్నికల గుర్తు ఏక్​నాథ్ శిందేకే సొంతం

By

Published : Feb 17, 2023, 6:59 PM IST

Updated : Feb 17, 2023, 7:44 PM IST

శివసేన పేరు, పార్టీ ఎన్నికల గుర్తు ఏక్​నాథ్​ శిందే నేతృత్వంలోని వర్గానికే చెందుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఉద్ధవ్​ ఠాక్రేకు తీవ్ర నిరాశ మిగుల్చుతూ శుక్రవారం ఈమేరకు తేల్చిచెప్పింది. 2018లో సవరించిన శివసేన పార్టీ రాజ్యాంగాన్ని అప్రజాస్వామికంగా అభివర్ణించింది ఎన్నికల కమిషన్​.

shiv sena symbol dispute
శివసేన పార్టీ గుర్తు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేకు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శివసేన పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన విల్లు-బాణం.. ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే నేతృత్వంలోని వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2018లో సవరించిన శివసేన పార్టీ రాజ్యాంగాన్ని అప్రజాస్వామికంగా అభివర్ణించింది ఈసీ. ఎలాంటి ఎన్నికలు లేకుండా సొంత కోటరీలోని వ్యక్తుల్ని పార్టీ పదాధికారులుగా అప్రజాస్వామికంగా నియమించుకునేలా రాజ్యాంగంలో మార్పులు చేసుకున్నారని స్పష్టం చేసింది. అలాంటి పార్టీ వ్యవస్థల్ని నమ్మలేమని అభిప్రాయపడింది.

1999లో ఎన్నికల సంఘం ఒత్తిడితో అప్పటి అధ్యక్షుడు బాలాసాహెబ్ ఠాక్రే పార్టీ రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు చేర్చగా.. వాటిని తీసేస్తూ 2018లో మోసపూరితంగా సవరించారని ఈసీ వివరించింది. ఆ తర్వాత కొత్త రాజ్యాంగాన్ని కూడా ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ తమకు సమర్పించలేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా.. శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఏక్​నాథ్​ శిందే వర్గానికే చెందుతాయని ఈసీ తేల్చిచెప్పింది.

2019లో మహారాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 55 మంది శివసేన పార్టీ తరఫున గెలిచారు. వీరిలో దాదాపు 40 మంది శివసేన రెబల్ నేత ఏక్​నాథ్ శిందేకు మద్దతు ఇచ్చారు. దీంతో గతేడాది జులై 1న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్​నాథ్ శిందే బాధ్యతలు చేపట్టారు. భాజపాతో కలిసి ఆయన అధికారాన్ని పంచుకున్నారు. ఉపముఖ్యమంత్రిగా భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ఉన్నారు.
శివసేన చీలిక వర్గాలకు కొత్త పేర్లు కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏక్​నాథ్ శిందే వర్గానికి 'బాలాసాహెబంచి శివసేన' పేరును ఖరారు చేసింది. రెండు కత్తులు, డాలు గుర్తును శిందే వర్గానికి కేటాయించింది. అలాగే ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 'కాగడా' గుర్తును కేటాయించింది. ఆయన నేతృత్వంలోని పార్టీకి 'శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే' పేరును ఖరారు చేసింది.

Last Updated :Feb 17, 2023, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details