తెలంగాణ

telangana

'మా నాన్నను ఎందుకు చంపారు?'.. నళినిని ప్రశ్నిస్తూ ఏడ్చేసిన ప్రియాంక

By

Published : Nov 13, 2022, 4:52 PM IST

Rajiv Gandhi Assassination : ప్రియాంక గాంధీ తనను కలిసి రాజీవ్ గాంధీ హత్య గురించి ప్రశ్నించారని.. రాజీవ్ హత్య కేసులో శిక్ష అనుభవించి, ఇటీవలే విడుదలైన నళిని శ్రీహరన్ వెల్లడించారు. కాసేపటికే ప్రియాంక భావోద్వేగానికి గురై ఏడ్చారని ఆమె తెలిపారు. శరణార్థుల శిబిరంలో ఉన్న తన భర్తను సోమవారం కలుస్తానని ఆమె తెలిపారు.

rajiv gandhi assassination
రాజీవ్ గాంధీ హత్య కేసు

Rajiv Gandhi Assassination : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన నళిని శ్రీహరన్ కీలక విషయాలు వెల్లడించారు. 2008లో వేలూరు సెంట్రల్ జైలులో తనను కలిసిన ప్రియాంక గాంధీ.. ఆమె తండ్రి రాజీవ్ హత్య గురించి పలు ప్రశ్నలు అడిగారని అన్నారు. ఆ సమయంలో ప్రియాంక భావోద్వేగానికి గురై ఏడ్చారని నళిని తెలిపారు. తాను జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు నళిని శ్రీహరన్​. రెండు నెలల గర్భవతి అయినప్పటికీ తనను జైలులో బంధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబమే తనకు తొలి ప్రాధాన్యం అని తెలిపారు. తమిళనాడులోని చెన్నైలో పలు విషయాలపై ఆదివారం నళిని మీడియాతో మాట్లాడారు.

"తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిక్ కలసి.. ఆయనకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. గాంధీ కుటుంబానికి కృతజ్ఞతలు. ఆ కుటుంబాన్ని కలిసే అవకాశం దొరికితే వారిని కలిసేందుకు సిద్ధంగా ఉన్నా. సోమవారం తిరుచ్చి శరణార్థుల శిబిరంలో ఉన్న నా భర్త శ్రీహరన్​ను​ కలుస్తా. నా కుమార్తె కూడా ఆయన్ను కలిసేందుకు ఉత్సాహంగా ఉంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు చూడాలనుకుంటున్నా. నా భర్తను వీలైనంత త్వరగా శరణార్థుల శిబిరం నుంచి విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. రాజీవ్ హత్య కేసు నుంచి బయటపడేందుకు నాకు సహకరించిన వారందరినీ కలవాలనుకుంటున్నా."

--నళిని శ్రీహరన్​

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నళిని శ్రీహరన్‌ సహా మొత్తం ఆరుగురు దోషులు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వీరందరినీ విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. వారి శిక్షను తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసిన సంగతిని గుర్తుచేసింది. కారాగారంలో వీరందరి ప్రవర్తన సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపింది. ఇదే కేసులో 30 ఏళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించిన పెరారివాలన్‌ విడుదలకు.. రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద దఖలు పడిన అసాధారణ అధికారాలను ఉపయోగించుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది మే 18న ఆదేశాలు జారీ చేసింది. అదే తీర్పు మిగతా ఆరుగురు దోషులకూ వర్తిస్తుందని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దోషులు శనివారం విడుదలయ్యారు.

ఇవీ చదవండి:గిరిజనుడి విజయగాథ.. తినడానికి తిండి లేని స్థాయి నుంచి అమెరికాలో టాప్ సైంటిస్ట్​గా..

తాను చనిపోయి మరో ఇద్దరిని బతికించిన 18 నెలల చిన్నారి.. చిన్న వయసులోనే అవయవదానం

ABOUT THE AUTHOR

...view details