తెలంగాణ

telangana

త్వరలోనే మా మంత్రి అరెస్ట్: దిల్లీ సీఎం

By

Published : Jan 23, 2022, 5:20 PM IST

Punjab Elections Kejriwal: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ మరోసారి భాజపాపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేంద్రం.. మరోసారి దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించేందుకు చూస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్​ను అరెస్ట్​ చేసేందుకు ఈడీ సిద్ధంగా ఉందని ఆరోపించారు.

Kejriwal
కేజ్రీవాల్​

Punjab Elections Kejriwal: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రయోగించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు, దిల్లీ మంత్రి సత్యేంత్ర జైన్‌ను ఈడీ అధికారులు త్వరలో అరెస్ట్ చేస్తారనే సమాచారం ఉందని తెలిపారు.

ఇప్పటికే రెండుసార్లు జైన్‌ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారని, మళ్లీ వచ్చినా స్వాగతిస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత చెప్పారు. తాము సత్యం ఆధారంగా, న్యాయబద్ధంగానే పనిచేస్తామని పేర్కొన్నారు. తనతో సహా ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేసినా తాము భయపడేది లేదన్నారు.

"మేము చన్నీ(పంజాబ్‌ సీఎం) మాదిరి కన్నీరు కార్చం. ఆయన(చన్నీ‌)కి ఎందుకంత నైరాశ్యం? తప్పు చేశారు కాబట్టే. మీ తప్పులు పట్టుకున్నారు. ఈడీ అధికారులు పెద్దపెద్ద నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. 11 రోజుల క్రితం ఏం జరిగిందో పంజాబ్ ప్రజలు చూశారు. మేము ఎలాంటి తప్పులు చేయలేదు. కాబట్టి మేము భయపడం. ఇదివరకు కూడా దాడులు జరిగాయి. మళ్లీ దాడిచేసి, మళ్లీ అరెస్ట్ చేసినా మేము భయపడేది లేదు. అన్ని కేంద్ర సంస్థలను పంపమని కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీలకు సూచిస్తున్నాను. మేమంతా సిద్ధంగానే ఉన్నాం. సత్యేంద్ర జైన్‌ మాత్రమే కాదు, మా ఇంటికి, మనీశ్ సిసోడియా, భగవంత్‌ మాన్‌ ఇంటికి పంపండి. మీ అందరికీ స్వాగతం. అరెస్ట్‌ చేయాలనుకుంటే అరెస్ట్ చేయండి. ఏ సంస్థలు వచ్చినా మేము మీకు ముకుళిత హస్తాలతో స్వాగతం చెబుతాము."

--అరవింద్​ కేజ్రీవాల్​, ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చురుగ్గా మారాయని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామని భాజపా భావించిన ప్రతీసారి దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించుతుందని అన్నారు. సీబీఐ, ఈడీ లాంటి వాటిని పంపినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details