ETV Bharat / bharat

కాంగ్రెస్ కొత్త అవతారం- యూపీలో అదే వ్యూహంతో బరిలోకి..

author img

By

Published : Jan 23, 2022, 12:24 PM IST

UP Election 2022: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కొత్త అవతారంలో బరిలోకి దిగనుంది. గెలుపే ధ్యేయంగా అభ్యర్థుల ఎంపికలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. యువతకు, కొత్తవారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు దఫాలుగా ప్రకటించిన మొత్తం 166 మంది అభ్యర్థులలో 119 మంది పూర్తిగా కొత్తవారే కావడం విశేషం.

priyanka gandhi vadra
ప్రియాంక గాంధీ వాద్రా

UP Election 2022: పాత ముఖాలను వదలించుకుని కొత్తవాళ్లతో కాంగ్రెస్‌కు జవజీవాలు తీసుకురావాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా నడుంకట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ కొత్త అవతారంతో బరిలోకి దిగాలని ఆమె లక్షిస్తున్నారు. ఇంతవరకు ఆ పార్టీ రెండు దఫాలుగా ప్రకటించిన మొత్తం 166 మంది అభ్యర్థులలో 119 మంది పూర్తిగా కొత్తవారే. 40 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామనే వాగ్దానాన్ని ఆమె నిలబెట్టుకుంటున్నారు.

2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 7 సీట్లు గెలవగా, రెండు సీట్లలో విజేతలు భాజపాలోకి ఫిరాయించారు. చాలా ఏళ్ల క్రితమే యూపీని చేజార్చుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. అక్కడ కొత్తతరం నాయకులను తయారుచేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మహిళలు, యువత, రైతులు, వెనుకబడిన కులాలు, దళితుల సమస్యలపై పోరాడుతున్న వారిని కాంగ్రెస్‌ అక్కున చేర్చుకొంటోందని పార్టీ ప్రతినిధి అన్షు అవస్థి చెప్పారు.

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తల్లి ఆశాసింగ్‌(55)కు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఉద్యమించిన సదాఫ్‌ జాఫర్, ఆశా కార్యకర్తల కోసం పోరాడి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ సభలో భౌతిక దాడికి గురైన పూనం పాండే, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన రామ్‌ రాజ్‌ గోండ్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై తొలిసారి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు.

త్రుటిలో చేజారిన సీట్లపై ప్రత్యేక దృష్టి

ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభలో మొత్తం 403 సీట్లు ఉన్నాయి. వాటిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 5,000 ఓట్ల కన్నా తక్కువ మెజారిటీతో అభ్యర్థులు గెలిచిన 47 నియోజకవర్గాలపై ఈసారి అన్ని పార్టీలూ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. వీటిలో 23 స్థానాలను భారతీయ జనతా పార్టీ, 13 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ, 8 సీట్లను బహుజన్‌ సమాజ్‌ పార్టీ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్, అప్నాదళ్, రాష్ట్రీయ లోక్‌ దళ్‌ పార్టీలు ఒక్కొక్కటి చొప్పున గెలిచాయి. ఈసారి బలమైన అభ్యర్థులను నిలబెట్టి గట్టి ప్రయత్నం చేస్తే ఈ 47 సీట్లలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకోవచ్చని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.

ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ

2017 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 200 కన్నా తక్కువ ఓట్ల మెజారిటీతో రెండు సీట్లు గెలిచింది. 432 ఓట్ల ఆధిక్యంతో బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఒక సీటు గెలిచింది. ఇలా 1000 ఓట్లకన్నా తక్కువ మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించిన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. కనౌజ్‌ ఎస్‌.సి. రిజర్వుడు సీటును భాజపా 2,500 ఓట్ల తేడాతో కోల్పోయింది. ఈసారి అక్కడ ఐపీఎస్‌ మాజీ అధికారి ఆసిం అరుణ్‌ను పోటీలో దింపింది. ఇలాంటి నియోజకవర్గాలపై పార్టీలన్నీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి.

కాంగ్రెస్‌ గూటికి ప్రముఖ నేతలు

uttarakhand election 2022: ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. రాష్ట్రంలో ఉద్దండ నాయకులు హరక్‌సింగ్‌ రావత్, యశ్‌పాల్‌ ఆర్యలు మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఫిబ్రవరి 14న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలను తాజా పరిణామం మెరుగుపరుస్తుందని విశ్లేషకుల అంచనా.

2017 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి పలువురు ప్రముఖ నాయకులు నిష్క్రమించడం ఆ పార్టీ ఓటమికి, భారతీయ జనతా పార్టీ అఖండ విజయానికి దారితీసింది. శుక్రవారం గఢ్వాల్‌కు చెందిన హరక్‌ సింగ్‌ రావత్‌ కాంగ్రెస్‌ గూటికి తిరిగి రాగా, గత అక్టోబరులో కుమావ్‌ ప్రాంత షెడ్యూల్డ్‌ కుల నాయకుడు యశ్‌ పాల్‌ ఆర్య, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే సంజీవ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దీంతో ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌కు ప్రముఖ నేతల కొరత తీరినట్లయింది.

2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో హరక్‌ సింగ్‌ రావత్‌ నాలుగు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి మరీ గెలిచారు. అవిభక్త ఉత్తర్‌ప్రదేశ్‌ తోపాటు ఉత్తరాఖండ్‌ మంత్రివర్గాలలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. యశ్‌పాల్‌ ఆర్య రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, అసెంబ్లీ స్పీకర్‌గా, రెండు కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో మంత్రిగా పని చేశారు. రాష్ట్రంలో ప్రముఖ దళిత నాయకుడైన ఆర్యను 12 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా పరిగణిస్తున్నారు.

2017 ఎన్నికల్లో ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 54,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

యూపీలో జేడీ(యూ) ఒంటరిపోరు

up elections jdu: బిహార్‌లో అధికారంలో ఉన్న జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) భాగస్వామి పార్టీ భాజపా. దీంతో సహజంగానే యూపీ ఎన్నికల్లో భాజపా తమను భాగస్వామి పార్టీగానే గుర్తించి పొత్తు పెట్టుకుంటుందని జేడీయూ భావించింది. అయితే ఈ ఆశలపై కాషాయ పార్టీ నీళ్లు జల్లింది!

"పొత్తు ఉంటుందని ఆశతో చివరి వరకు నిరీక్షించాం. అయితే భాజపా స్పందించడం లేదు. అందుకే ఒంటరిగా బరిలోకి దిగుతున్నాం"అని జేడీయూ అధ్యక్షుడు లలన్‌సింగ్‌ శనివారం తెలిపారు. అంతేకాదు.. తమ పార్టీ తరఫున యూపీ అసెంబ్లీఎన్నికల్లో పోటీ చేసే 16 మంది అభ్యర్థులను ప్రకటించారు. త్వరలోనే మరో 51 స్థానాలకు పేర్లను వెలువరిస్తామని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: యూపీలో ఎంఐఎం కొత్త జట్టు- గెలిపిస్తే ఇద్దరు సీఎంలు!

యూపీలో ముస్లింలు ఎటువైపు? యోగి '80-20' వ్యూహం ఫలించేనా?

ఆచితూచి లౌకిక గళం.. యూపీలో 'సాఫ్ట్‌ హిందుత్వం'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.