తెలంగాణ

telangana

'రైతులను ప్రధాని మోసగించారు'

By

Published : Feb 9, 2021, 6:41 AM IST

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్​ పార్టీ విమర్శలు గుప్పించింది. రైతులను ప్రధాని మోసగించారని.. వారి సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నది చెప్పకుండానే ప్రసంగం కొనసాగించారని ఆరోపించింది.

PM Modi cheated Farmers: Congress
'రైతులను ప్రధాని మోసగించారు'

అన్నదాతలను ప్రధాని మోదీ మోసగించారని.. వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్నది చెప్పకుండానే రాజ్యసభలో ఆయన ప్రసంగం సాగించారని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని సోమవారం రాజ్యసభలో ప్రసంగించారు. అనంతరం కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే విలేకరులతో మాట్లాడారు.

"తమ సమస్యల పరిష్కారానికి ప్రధాని ఏం చెబుతారా అని రైతులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, వాటి గురించి ఆయన ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుమారు 75 రోజులుగా ఆందోళన చేస్తున్నవారికి తీవ్ర నిరాశే మిగిల్చారు. వివాదాస్పద చట్టాలను రద్దుచేసి, విస్తృత సంప్రదింపులతో కొత్తచట్టం తీసుకొస్తామని ప్రధాని చెప్పి ఉండాల్సింది. ముఖ్యమైన ఈ అంశాలేవీ లేకుండానే.. దేశాన్ని తప్పుదోవ పట్టించేలా ఆయన ప్రసంగం సాగింది. మూడు వ్యవసాయ చట్టాల గురించి ఎవరికీ ఏమీ తెలియదు. కానీ ప్రజలు ఆందోళన చేస్తున్నారని మాత్రమే ప్రధాని చెప్పారు. చట్టాల గురించి తెలియకపోవడానికి మేమేమైనా మూర్ఖులమా? కోట్ల మంది రైతుల్లో విద్యావంతులు లేరని ఆయన అనుకుంటున్నారా?" అని ఖర్గే విరుచుకుపడ్డారు.

ఖర్గేకు బెదిరింపు ఫోన్‌ కాల్‌

మోదీ ప్రసంగ తీరును విమర్శించిన కాసేపటికే తనకు బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చినట్టు ఖర్గే చెప్పారు. "ప్రధాని మోదీని మీరెందుకు విమర్శిస్తున్నారు?" అని సదరు వ్యక్తి బెదిరించాడనీ, దీనిపై ఖర్గే పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

భయం, మోసం, బెదిరింపులు..

భారత్‌కు ఫారిన్‌ డిస్ట్రక్టివ్‌ ఐడియాలజీ (ఎఫ్‌డీఐ) వచ్చిందన్న మోదీ వ్యాఖ్యలను మరో సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు. భయం (ఫియర్‌), మోసం (డిసెప్షన్‌), బెదిరింపులు (ఇంటిమిడేషన్‌) అనే ఎఫ్‌డీఐపై ఆధారపడి సాగిస్తున్న ప్రభుత్వం నుంచే ఈ భావజాలం పుట్టుకొచ్చిందని ట్వీట్‌ చేశారు.

ఇదీ చూడండి:'తెలుగు' బిల్లుకు బంగాల్​ అసెంబ్లీ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details