తెలంగాణ

telangana

'ఆక్సిజన్‌ కొరతతో ఎవరూ చనిపోలేదా?.. కేంద్రం నిర్లక్ష్యం బాధాకరం!'

By

Published : Sep 14, 2022, 6:39 AM IST

Covid Deaths Due To Oxygen Shortage

Oxygen shortage in India: కొవిడ్‌ మరణాలపై కేంద్రం నిర్లక్ష్యం తీవ్రంగా కలచివేసిందని పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవించలేదని చెప్పడంపై విస్మయం వ్యక్తం చేసింది. కొవిడ్ మరణాలపై రాష్ట్రాల సహకారంతో కేంద్రం ఆడిట్‌ నిర్వహించాలని సూచించింది.

oxygen shortage during covid: దేశంలో కొవిడ్‌ రెండో ఉద్ధృతి తీవ్రంగా నెలకొన్న సమయంలో ఆక్సిజన్‌ కొరత కారణంగా అసలు మరణాలే చోటుచేసుకోలేదని... కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పడం తీవ్రంగా కలచివేసిందని పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. దేశంలో ప్రాణ వాయువుకు, ఆక్సిజన్‌ సిలిండర్లకు కొరత లేదన్న ప్రభుత్వ వ్యాఖ్యల్లో డొల్లతనం నాడు బహిర్గతమైందని పేర్కొంది. ఆక్సిజన్‌ అందుబాటులో లేదన్న కారణంతో తమ వద్ద ఒక్క కొవిడ్‌ మరణం కూడా నమోదు కాలేదని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. ఇకనైనా, రాష్ట్రాల సహకారంతో ఈ చావులను నమోదు చేయాలని, వైద్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సరైన వ్యూహాలను రూపొందించుకోవాలని కేంద్రానికి సూచించింది. 'వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీ, కొవిడ్‌ మహమ్మారి నిర్వహణ' పేరుతో రాజ్యసభకు సమర్పించిన నివేదికలో స్థాయీ సంఘం ఈ వ్యాఖ్యలు చేసింది.

మీడియా కళ్లకు కట్టింది...
"కొవిడ్‌ ఉద్ధృతి వేళ ఆక్సిజన్‌ లభించక ఎంతోమంది చనిపోయినా, ఆ వాస్తవాల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రభుత్వానికి అసలు సానుభూతే లేదని దీంతో అర్థమైంది. ఆక్సిజన్‌ను రాష్ట్రాలకు పంపిణీ చేయడంలోనూ కేంద్రం విఫలమైంది. ప్రాణవాయువును నిలకడగా సరఫరా చేయలేకపోయింది. ఆక్సిజన్‌, వెంటిలేటర్లతో కూడిన పడకలను అందుబాటులో ఉంచలేకపోయింది. ఆ సమయంలో నెలకొన్న అత్యంత దయనీయ పరిస్థితులను... ఆక్సిజన్‌ సిలిండర్లు, ఔషధాల కోసం ప్రజలు బారులుతీరి నిరీక్షించడాన్ని మీడియా తన కథనాల్లో కళ్లకు కట్టింది. ఆక్సిజన్‌ కొరత కారణంగా చోటుచేసుకున్న మరణాలను నమోదు చేసేందుకు అసలు మార్గదర్శకాలే లేవు. దీంతో 'అనుబంధ ఆరోగ్య సమస్యలు (కో-మార్బిడిటీస్‌)' పేరుతో వీటిని లెక్కిస్తున్నారు. ఈ మరణాలపై రాష్ట్రాల సహకారంతో కేంద్రం ఆడిట్‌ నిర్వహించాలి. ప్రభుత్వ సంస్థల నుంచి మరింత పారదర్శకతనూ, జవాబుదారీతనాన్నీ ఆశిస్తున్నాం" అని కమిటీ పేర్కొంది.

గుర్తించదగ్గ వ్యాధిగా క్యాన్సర్‌!
మరో నివేదికలో- క్యాన్సర్‌ను గుర్తించదగ్గ వ్యాధిగా వర్గీకరించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. ఇప్పటివరకూ ఇలా వర్గీకరించకపోవడం వల్ల క్యాన్సర్‌ మరణాలను తక్కువగా చూపుతున్నారని పేర్కొంది.

జన్యు పరిశీలనకు వసతులు!
ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నందున.. కరోనా మూలాలను, అది వ్యాపిస్తున్న మార్గాలను అధ్యయనం చేసేందుకు శక్తిమంతమైన యంత్రాంగం అవసరమని నొక్కి చెప్పింది. దేశంలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ వసతులను మెరుగుపరచాలని సూచించింది.

ఆ దేశానికి జరిమానా!
కొవిడ్‌-19కు కారణమైన దేశానికి భారీ జరిమానా విధించేలా వైరస్‌ మూలాలను కనుగొనేందుకు మరిన్ని పరిశోధనలు చేపట్టాలంటూ ప్రపంచ దేశాల కూటమిని కోరాలని... కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది.

ABOUT THE AUTHOR

...view details